IPL 2021: రోహిత్‌కు మరికొన్ని రోజులు విశ్రాంతి అవసరం: జయవర్దెనె

ముంబయి ఇండియన్స్‌ సారథి రోహిత్‌ శర్మకు మరికొన్ని రోజులు విశ్రాంతి అవసరమని, అయితే.. తర్వాత కోల్‌కతాతో జరిగే మ్యాచ్‌లో  బరిలోకి దిగుతాడని ఆ జట్టు కోచ్‌ మహేలా జయవర్దెనె స్పష్టం చేశాడు...

Published : 21 Sep 2021 01:26 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ముంబయి ఇండియన్స్‌ సారథి రోహిత్‌ శర్మకు మరికొన్ని రోజులు విశ్రాంతి అవసరమని ఆ జట్టు కోచ్‌ మహేలా జయవర్దెనె తెలిపాడు. కోల్‌కతాతో జరిగే మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడని వెల్లడించాడు. ఐపీఎల్‌ 14వ సీజన్‌లో ఆదివారం ఆ జట్టు చెన్నై సూపర్‌ కింగ్స్‌పై ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ధోనీసేన నిర్దేశించిన 157 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబయి 136/8 పరుగులకే పరిమితమైంది. దీంతో 20 పరుగుల తేడాతో ఓటమిపాలై ఈ సీజన్‌లో నాలుగు ఓటములు మూటగట్టుకుంది.

ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం జయవర్దెనె మాట్లాడుతూ తమ కెప్టెన్‌కు మరిన్ని రోజులు విశ్రాంతి అవసరమని తెలిపాడు. ‘రోహిత్‌ బాగానే ఉన్నాడు. బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ కూడా బాగుంది. అయితే, సుదీర్ఘ ఇంగ్లాండ్‌ పర్యటన నుంచి వచ్చిన అతడకి కొన్ని రోజులు విశ్రాంతి అవసరం. తర్వాత కోల్‌కతాతో జరిగే మ్యాచ్‌లో పాల్గొంటాడు’ అని స్పష్టం చేశాడు. మరోవైపు రోహిత్‌తో పాటు ఈ మ్యాచ్‌లో కీలక ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య సైతం బరిలోకి దిగలేదు. అతడిపై స్పందించిన జయవర్దెనె.. పాండ్యకు చిన్న సమస్య ఎదురైందని, ముందు జాగ్రత్తగా అతడికి విశ్రాంతి కల్పించామన్నాడు. అనంతరం ముంబయి ఓటమిపై మాట్లాడుతూ.. చెన్నై జట్టులో రుతురాజ్‌ లాగా తమ జట్టులో ఎవరైనా బ్యాటింగ్‌ బాధ్యతలు తీసుకోవాల్సిందన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని