Novak - Nadal : జకోవిచ్‌కు అన్నీ తెలుసు.. నిర్ణయం తీసుకోగలడు: నాదల్‌

ఆస్ట్రేలియా ఓపెన్‌లో పాల్గొనేందుకు వెళ్లిన నొవాక్‌ జకోవిచ్‌ను....

Published : 07 Jan 2022 01:44 IST

మెల్‌బోర్న్‌‌: ఆస్ట్రేలియా ఓపెన్‌లో పాల్గొనేందుకు వెళ్లిన నొవాక్‌ జకోవిచ్‌ను మెల్‌బోర్న్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఎనిమిది గంటలపాటు నిలిపివేసి వీసాను అక్కడి అధికారులు రద్దు చేశారు. కరోనా వ్యాక్సినేషన్‌కు సంబంధించిన తగిన ఆధారాలు సమర్పించని కారణంగా జకోవిచ్‌ను నిలిపివేసినట్లు ఆస్ట్రేలియా బోర్డర్‌ ఫోర్స్‌ తెలిపింది. జకోవిచ్‌ సంఘటనపై మాజీ నంబర్‌వన్‌ రఫేల్‌ నాదల్‌ స్పందించాడు. కొవిడ్‌ వైరస్‌కు వ్యాక్సిన్‌ వేయించుకోకపోతే పర్యవసనాలను ఎదుర్కోక తప్పదని పేర్కొన్నాడు. గతంలో కొవిడ్ బారిన పడిన నాదల్‌.. ‘నాకుపై వ్యాక్సినేషన్‌ మీద పూర్తి నమ్మకం ఉంది. కరోనా మహమ్మారితో చాలా మంది ప్రజలు మృత్యువాత పడ్డారు’’ అని వ్యాఖ్యానించాడు. 

జకోవిచ్‌ను ఉద్దేశించి నాదల్ మాట్లాడుతూ.. ‘‘వ్యాక్సిన్‌ వేయించుకుంటే ఆస్ట్రేలియా ఓపెన్‌తో సహా ప్రపంచంలో ఎక్కడైనా ఆడవచ్చు. నా అభిప్రాయం ప్రకారం నిబంధనలు సరిగా పాటించకపోవడం వల్లే ప్రపంచమంతా ఇబ్బందుల్లో పడిందేమో. అయితే రిస్క్‌ గురించి జకోవిచ్‌కు తెలుసు. స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోగలడు. అదే సమయంలో టోర్నీ నిర్వాహకులు కఠినంగా ఉంటారు. టీకా తీసుకోకపోతే కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలానే జకో విషయంలో జరిగిన సంఘటనలూ నాకు నచ్చలేదు. ప్రపంచవ్యాప్తంగా కరోనాతో గత కొన్నినెలలుగా తలెత్తిన పరిస్థితులు కూడా జకోవిచ్‌కు తెలుసు. కాబట్టి వాటన్నింటిని పరిగణనలోకి తీసుకుని అతడే నిర్ణయం తీసుకోవాలి’’ అని సూచించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని