CWG 2022: నిఖత్‌, హుసాముద్దీన్‌ పతక పంచ్‌

బాక్సింగ్‌లో భారత్‌కు మూడు పతకాలు ఖాయమయ్యాయి. హుసాముద్దీన్‌ (57 కేజీ), నీతూ (మహిళల 48 కేజీ), నిఖత్‌ సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లారు. హోరాహోరీగా సాగిన క్వార్టర్‌ఫైనల్లో హుసాముద్దీన్‌ 4-1తో నమీబియాకు చెందిన ట్రైఎగైన్‌ మార్నింగ్‌పై

Updated : 04 Aug 2022 08:10 IST

బాక్సింగ్‌లో భారత్‌కు మూడు పతకాలు ఖాయమయ్యాయి. హుసాముద్దీన్‌ (57 కేజీ), నీతూ (మహిళల 48 కేజీ), నిఖత్‌ సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లారు. హోరాహోరీగా సాగిన క్వార్టర్‌ఫైనల్లో హుసాముద్దీన్‌ 4-1తో నమీబియాకు చెందిన ట్రైఎగైన్‌ మార్నింగ్‌పై విజయం సాధించాడు. అతడు గత కామన్వెల్త్‌ క్రీడల్లో కాంస్యం గెలుచుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్‌ నిఖత్‌ జరీన్‌ (48-50కేజీ) కూడా తుది నాలుగులో చోటు సంపాదించింది. క్వార్టర్స్‌లో ఆమె 5-0తో హెలెన్‌ జోన్స్‌ను ఓడించి పతకాన్ని ఖాయం చేసుకుంది. నిఖత్‌కు ఇదే తొలి కామన్వెల్త్‌ క్రీడలు. ఇక 21 ఏళ్ల నీతూ క్వార్టర్స్‌లో తన ముష్టిఘాతాలతో ప్రత్యర్థి నికోల్‌ క్లైడ్‌ (నార్తర్న్‌ ఐర్లాండ్‌)ను బెంబేలెత్తించింది. క్లైడ్‌ పరిస్థితి బాగా లేకపోవడంతో మూడో రౌండ్‌ను రద్దు చేశారు.

మనోళ్ల సత్తా: కామన్వెల్త్‌ క్రీడల్లో తెలంగాణ బాక్సర్లు నిఖత్‌ జరీన్‌, మహమ్మద్‌ హుసాముద్దీన్‌ దూసుకెళ్తున్నారు. ఇప్పటికే సెమీస్‌ చేరి పతకం ఖాయం చేసిన ఈ నిజామాబాద్‌ బాక్సర్లు.. ఇప్పుడిక పసిడి వేటలో కొనసాగుతున్నారు. ఛాంపియన్‌గా నిలవాలనే పట్టుదల ప్రదర్శిస్తున్నారు. కట్టుబాట్లను దాటి.. అడ్డంకులను అధిగమించి.. సవాళ్లకు ఎదురు నిలిచి ఈ ఏడాది తొలిసారి ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌గా నిలిచిన 26 ఏళ్ల నిఖత్‌ సూపర్‌ ఫామ్‌లో ఉంది. అదే దూకుడుతో తన మొట్టమొదటి కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణం సాధించాలని చూస్తోంది. మహిళల 50 కేజీల విభాగంలో రింగ్‌లో ప్రత్యర్థులపై పంచ్‌లతో విరుచుకుపడుతున్న ఆమెకు ఆ దిశగా పెద్దగా పోటీ లేదనే చెప్పాలి. ఆమె ఇలాగే నిలకడగా రాణిస్తే తన కెరీర్‌లో తొలి కామన్వెల్త్‌ క్రీడల పసిడి సాధించడం కష్టమేమీ కాదు. ఇక 2018 గోల్డ్‌కోస్ట్‌ క్రీడల్లో కాంస్యంతో మెరిసిన హుసాముద్దీన్‌ ఈ సారి పతక రంగు మార్చాలనే లక్ష్యంతో ఉన్నాడు. అందుకోసం తీవ్రంగా శ్రమించి క్రీడల బరిలో దిగిన అతను.. ప్రత్యర్థులపై ముష్టిఘాతాలు కురిపిస్తున్నాడు. బాక్సింగ్‌ కుటుంబం నుంచి వచ్చిన 28 ఏళ్ల అతను 57 కేజీల విభాగంలో అదరగొడుతున్నాడు. శనివారం సెమీస్‌లో ఈ ఇద్దరు బాక్సర్లు ఆడనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని