గావస్కర్‌ ఏమైనా అనుకోని.. పర్లేదు: టిమ్‌పైన్‌

టీమ్‌ఇండియా మాజీ సారథి సునీల్‌ గావస్కర్‌ చేసిన వ్యాఖ్యలు తనని ఏమాత్రం ప్రభావితం చేయవని, తన గురించి ఏమైనా అనుకోవచ్చని ఆస్ట్రేలియా కెప్టెన్‌ టిమ్‌పైన్‌ అన్నాడు...

Published : 15 Jan 2021 03:50 IST

బ్రిస్బేన్‌: టీమ్‌ఇండియా మాజీ సారథి సునీల్‌ గావస్కర్‌ చేసిన వ్యాఖ్యలు తనని ఏమాత్రం ప్రభావితం చేయవని, తన గురించి ఏమైనా అనుకోవచ్చని ఆస్ట్రేలియా కెప్టెన్‌ టిమ్‌పైన్‌ అన్నాడు. మూడో టెస్టు చివరి రోజు భారత బ్యాట్స్‌మెన్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌(39*), హనుమ విహారి(21*) బ్యాటింగ్‌ చేస్తుండగా, పైన్‌ స్లెడ్జింగ్‌కు‌ పాల్పడిన సంగతి తెలిసిందే. అశ్విన్‌ను అతడు దూషించిన వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారడంతో అదే రోజు గావస్కర్‌ స్పందించాడు. ఆసీస్‌ కెప్టెన్‌గా పైన్‌ రోజులు దగ్గరపడ్డాయన్నాడు. ఈ మ్యాచ్‌లో పైన్‌ ప్రవర్తన బాగోలేదని, కొన్ని క్యాచ్‌లు కూడా వదిలేశాడని గావస్కర్‌ విమర్శించాడు.

కాగా, బ్రిస్బేన్‌ టెస్టు ముందు మీడియా సమావేశంలో ఓ విలేకరి ఇదే విషయాన్ని టిమ్‌పైన్‌తో ప్రస్తావించాడు. ‘గావస్కర్‌ మాటలు విన్నారా’ అని అడిగాడు. దానికి ఆస్ట్రేలియా కెప్టెన్‌.. ‘సన్నీ తన అభిప్రాయాలను వ్యక్తం చేశాడు. అవి నాపై ప్రభావం చూపవు. కాబట్టి ఆయన ఏం అనాలనుకున్నా అనుకోవచ్చు. దాంతో నేను చేసేదేం లేదు. నా కెరీర్‌ మొత్తం మంచి ప్రదర్శన చేశాను. కానీ, సిడ్నీ టెస్టులో అలా జరిగిపోయింది’ అని బదులిచ్చాడు. అయితే, ఈ వివాదాన్ని కొనసాగిస్తారా అని అడిగిన ప్రశ్నకు ‘నేను నాలానే ఉంటాను. ఇప్పటికి ఎన్ని టెస్టులు ఆడానో తెలీదు.. కానీ, ఆడినన్ని మ్యాచ్‌లు మంచి ఉద్దేశంతోనే ఆడాను. ఇక సిడ్నీలో జరిగింది వేరు. నేనెప్పుడు ఆరోగ్యకరమైన పోటీని ఇష్టపడతా. అయితే, స్టంప్‌మైక్‌ను దృష్టిలో పెట్టుకొని అందరినీ గౌరవించాలి’ అని పైన్‌ పేర్కొన్నాడు. 

అలాగే సిడ్నీలో పలు క్యాచ్‌లు వదిలేయడంపై స్పందించిన పైన్‌ అందుకు రెండు కారణాలున్నాయని చెప్పాడు. ఒకటి తాను కంగారు పడి క్యాచ్‌లు వదిశానని, ఇంకొకటి టెక్నికల్‌ సమస్యలతో వదిలేశానని సమర్థించుకున్నాడు. అలాగే స్టీవ్‌స్మిత్‌ ఉదంతంపై స్పందిస్తూ అదో అనవసరపు వివాదం అని వ్యాఖ్యానించాడు. అతడు రిషభ్‌పంత్ బ్యాటింగ్‌ గార్డ్‌ను చెరిపేయలేదని పేర్కొన్నాడు. గత మూడేళ్లుగా స్మిత్‌ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడో అందరికీ తెలుసన్నాడు. బాల్‌ టాంప్‌రింగ్‌ వివాదం తర్వాత ఏడాది పాటు నిషేధానికి గురై తిరిగి జట్టులోకి వచ్చినప్పటి నుంచీ అతడు ఇలాంటి వివాదాలు ఎదుర్కొంటున్నాడని పైన్‌ వివరించాడు. స్మిత్‌ ఇప్పుడు మంచి ఫామ్‌లో ఉన్నాడని, తనపై వచ్చే విమర్శలకు బ్యాట్‌తోనే సమాధానం చెబుతాడని చెప్పాడు. ఇక గబ్బా టెస్టులోనూ స్మిత్‌ చెలరేగిపోతాడని ఆసీస్‌ కెప్టెన్‌ ధీమా వ్యక్తం చేశాడు.

ఇవీ చదవండి..
స్టీవ్ స్మిత్ కథలో మరో మలుపు
ఇంగ్లాండ్‌ ఆటగాడికి కరోనా స్ట్రెయిన్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని