Tom Moody : హైదరాబాద్‌ జట్టుకు ఆ ఆల్‌రౌండరే కీలకం: టామ్‌ మూడీ

టీ20 టోర్నీలో ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ ముఖ్యభూమిక పోషిస్తాడని..

Published : 31 Mar 2022 01:33 IST

ముంబయి : టీ20 టోర్నీలో ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ ముఖ్యభూమిక పోషిస్తాడని హైదరాబాద్‌ ప్రధాన కోచ్‌ టామ్‌ మూడీ ఆశాభావం వ్యక్తం చేశాడు. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో సుందర్‌ (3-0-47-0) బౌలింగ్‌లో భారీగా పరుగులు సమర్పించుకున్నా.. బ్యాటింగ్‌లో మాత్రం (40: 14 బంతుల్లో 5 ఫోర్లు, 2  సిక్సర్లు) ధాటిగా ఆడాడు. ఈ క్రమంలో సుందర్‌ గురించి టామ్‌ మూడీ మాట్లాడుతూ.. ‘‘వాషింగ్టన్‌ సుందర్‌ అద్భుతమైన ఆల్‌రౌండర్‌ అని గుర్తించే మెగా వేలంలో కొనుగోలు చేశాం. అందుకే చెబుతున్నా వచ్చే మ్యాచుల్లో బ్యాటింగ్‌, బౌలింగ్‌పరంగా సుందర్ కీలక పాత్ర పోషిస్తాడు. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో దిగిన ఎనిమిదో స్థానం సుందర్‌కు శాశ్వతం కాదు. ఏ స్థానంలోనైనా ఆడేందుకు సిద్ధంగా ఉంటాడు’’ అని తెలిపాడు. ‘నో బాల్స్‌’ వేయడంపైనా ఘాటుగా స్పందించాడు. ఆటలో ‘నో బాల్స్‌’ వేయడం ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశాడు. 

ఆశావహ దృక్పథంతో ఉండాలి: కేన్‌

క్లిష్ట సమయాల్లో హుషారుగా, ఆశావహ దృక్పథంతో ఉండాలని హైదరాబాద్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ తన సహచరులకు సూచించాడు.  టీ20 లీగ్‌ సీజన్‌ను భారీ ఓటమితో ప్రారంభించిన విషయం తెలిసిందే. రాజస్థాన్‌పై 61 పరుగుల తేడాతో ఓడిపోయింది. మ్యాచ్‌ ఫలితంపై కేన్‌ విలియమ్సన్‌ మాట్లాడుతూ.. ‘‘చాలా బాగానే ఆరంభించాం. అయితే తొలుత స్పందించిన పిచ్‌ తర్వాత బ్యాటింగ్‌కు అనుకూలంగా మారింది. దీంతో ప్రత్యర్థి జట్టను ఆపడం కష్టమైంది. అయితే మా జట్టులోనూ ఎన్నో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. టీ20 గేమ్‌ అంటేనే ఇలా ఉంటుంది. అపజయాలను మరిచి సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలి. తర్వాతి ఆటకు చాలా రోజుల సమయం ఉంది కాబట్టి.. సరిదిద్దుకోవాల్సిన అంశాలపై మాట్లాడుకుంటాం. పొరపాట్ల నుంచి గుణపాఠాలు నేర్చుకుంటాం’’ అని కేన్‌ పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని