Dhoni: జడేజాను భర్తీ చేయడం కష్టం.. అతడికి ఎవరూ సాటిరారు: ధోనీ

ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాను భర్తీ చేయడం కష్టమని, అతడికి ఎవరూ సాటిలేరని చెన్నై కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ అన్నాడు...

Updated : 13 May 2022 09:32 IST

ముంబయి: ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాను భర్తీ చేయడం కష్టమని, అతడికి ఎవరూ సాటిలేరని చెన్నై కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ అన్నాడు. గతరాత్రి ముంబయితో జరిగిన మ్యాచ్‌లో టాస్‌ వేసిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశాడు. జడేజాను మిస్‌ అవుతున్నారా అని అడిగిన ప్రశ్నకు ధోనీ ఇలా సమధానమిచ్చాడు. జడ్డూ లాంటి ఆటగాడు తమకు ఎలాంటి ప్రయోగాలు చేయడానికైనా ఉపయోగపడతాడని, ఫీల్డింగ్‌లోనూ అతడిని ఎవరూ భర్తీ చేయలేరని చెప్పాడు. ఇక మ్యాచ్‌లో ఓటమిపాలవ్వడంపై స్పందిస్తూ.. టీ20ల్లో 130 కన్నా తక్కువ స్కోరును కాపాడుకోవడం కష్టమని అన్నాడు.

‘ఈ మ్యాచ్‌లో మా బౌలర్లకు ఒక్కటే చెప్పాను. ఫలితం గురించి ఆలోచించకుండా కట్టుదిట్టంగా బంతులేయమన్నా. ముఖేశ్‌ చౌదరి, సిమర్జీత్‌ సింగ్‌ యువ బౌలర్లు చాలా గొప్పగా బౌలింగ్‌ చేశారు. ఇలాంటి తక్కువ స్కోర్ల గేమ్‌ వాళ్లకు ఆత్మవిశ్వాసం పెంపొందడానికి బాగా ఉపయోగపడుతుంది. వీళ్లిద్దరూ రాణించడం అద్భుతంగా ఉంది. ఇక బ్యాటింగ్‌ విషయంలో ఎవరైనా ఆరంభంలో కొన్ని బంతులు జాగ్రత్తగా ఆడాలి. లేకపోతే వికెట్లు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. వాటిని సరిగ్గా ఎదుర్కొంటే తర్వాత రాణించొచ్చు. కానీ, దురదృష్టంకొద్దీ మేం ఈరోజు విఫలమయ్యాం. ముంబయి బౌలర్లు చాలా గొప్పగా బౌలింగ్‌ చేశారు. మేం ఇంకాస్త మెరుగైన ప్రదర్శన చేయాల్సింది. అలాగే మా టీమ్‌లో కొంత మంది బ్యాట్స్‌మెన్‌ మంచి బంతులకు కూడా ఔటయ్యారు. రాబోయే మ్యాచ్‌ల్లో ఇలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడతారని ఆశిస్తున్నా’ అని మహీ పేర్కొన్నాడు. కాగా, ఈ మ్యాచ్‌లో చెన్నై నిర్దేశించిన 98 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ముంబయి 5 వికెట్లు కోల్పోయి 14.5 ఓవర్లలో ఛేదించింది. ఈ ఓటమితో చెన్నై ప్లేఆఫ్స్‌ అవకాశాలు పూర్తిగా కోల్పోయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని