ఆన్‌లైన్‌ ఖాతాకు అథెంటికేటర్‌ భద్రత

ఆన్‌లైన్‌ ఖాతాలు ఇతరుల చేతికి చిక్కకుండా చూసుకోవటానికి టూ-ఫ్యాక్టర్‌ అథెంటికేషన్‌ (2ఎఫ్‌ఏ) ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఎస్‌ఎంఎస్‌ ఆధారిత 2ఎఫ్‌ఏ కన్నా అథెంటికేటర్‌ యాప్స్‌ను వాడుకుంటే మరింత శ్రేయస్కరం.

Published : 01 Mar 2023 00:10 IST

ఆన్‌లైన్‌ ఖాతాలు ఇతరుల చేతికి చిక్కకుండా చూసుకోవటానికి టూ-ఫ్యాక్టర్‌ అథెంటికేషన్‌ (2ఎఫ్‌ఏ) ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఎస్‌ఎంఎస్‌ ఆధారిత 2ఎఫ్‌ఏ కన్నా అథెంటికేటర్‌ యాప్స్‌ను వాడుకుంటే మరింత శ్రేయస్కరం. ఇందుకోసం ఎలాంటి మార్గాలున్నాయి?

ఆన్‌లైన్‌లో ఎన్నో ఖాతాలు. వీటిని భద్రంగా కాపాడుకోవటం ముఖ్యం. పాస్‌వర్డ్‌లున్నా కొన్నిసార్లు పనిచేయకపోవచ్చు. పాస్‌వర్డ్‌ లీక్స్‌తోనో, పదే పదే వాడే పాస్‌వర్డ్‌లతోనో హ్యాకర్లు తేలికగా ఛేదించొచ్చు. అందువల్ల టూ-ఫ్యాక్టర్‌ అథెంటికేషన్‌ (2ఎఫ్‌ఏ) సెట్‌ చేసుకోవటం తెలివైన ఉపాయం. ఇది భద్రతా లోపాలను అరికడుతుంది. అయితే అన్ని 2ఎఫ్‌ఏ ఆప్షన్లు ఒకేలా ఉండవు. అథెంటికేటర్‌ యాప్‌లైతే తేలికగా వాడుకోవచ్చు. ఇవి మరింత భద్రంగానూ ఉంటాయి. ఎస్‌ఎంఎస్‌ ఆధారిత అథెంటికేషన్‌ కన్నా ఇవి సురక్షితమనే చెప్పుకోవచ్చు. 2ఎఫ్‌ఏను సెట్‌ చేసుకుంటే ఏదైనా ఖాతాలోకి లాగిన్‌ అయ్యేటప్పుడు మన గుర్తింపును నిర్ధరించు కోవటానికి కోడ్‌ను ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. ఎస్‌ఎంఎస్‌ ఆధారిత అథెంటికేషన్‌ అయితే టెక్స్ట్‌ మెసేజ్‌ ద్వారా కోడ్‌ను పంపుతుంది. వీటిని సిమ్‌ స్వాపింగ్‌, టెక్స్ట్‌ మెసేజ్‌ ఫార్వర్డ్‌ ద్వారా హ్యాకర్లు అపహరించొచ్చు. అథెంటికేటర్‌ యాప్‌తోనైతే ఇలాంటి ప్రమాదముండదు. ఇది కోడ్‌ను తనలోనే లాక్‌ చేస్తుంది. ప్రతి 30 సెకండ్లకోసారి మారుస్తుంది. కొన్ని పాస్‌వర్డ్‌ మేనేజర్లు బిల్టిన్‌ అథెంటికేటర్లనూ కలిగుంటాయి. అయితే వీటికన్నా విడి యాప్‌ను వాడుకోవటమే ఎంతైనా మంచిది. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ పరికరాలకు ఇలాంటి యాప్‌లు చాలానే అందుబాటులో ఉన్నాయి.

* బిల్టిన్‌ టూల్‌: యాపిల్‌కు చెందిన బిల్టిన్‌ అథెంటికేటర్‌ మంచి టూల్‌. యాపిల్‌ వాడేవారికిది మంచి ఎంపిక. ఐఓఎస్‌ 16.3, మ్యాక్‌ఓఎస్‌ పరికరాల్లో దీన్ని వాడుకోవచ్చు.

* ఏజిస్‌ అథెంటికేటర్‌ యాప్‌: ఆండ్రాయిడ్‌ పరికరాలు గలవారు ఏజిస్‌ అథెంటికేటర్‌ యాప్‌ను ఎంచుకోవచ్చు. ఇది ఉచితంగానే అందుబాటులో ఉంటుంది ఓపెన్‌ సోర్స్‌ కూడా. యాజమాన్య వ్యవస్థలతో సంబంధం లేకపోవటం మరో మంచి విషయం. యాప్‌లో సేవ్‌ అయిన అన్ని కోడ్లను ఇది ఎన్‌క్రిప్ట్‌ చేసేస్తుంది. మన ఖాతాల్లోకి ఇతరులు చొరబడకుండా అడ్డుకుంటుంది.

* గూగుల్‌ అథెంటికేటర్‌: ఇది మరో మంచి అథెంటికేటర్‌ యాప్‌. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌.. రెండు రకాల పరికరాలకు అందుబాటులో ఉంటుంది. దీనికి క్లౌడ్‌ బ్యాకప్‌ ఉండదు. పరికరంలోనే కోడ్లు నిల్వ ఉంటాయి కాబట్టి మరింత భద్రంగా పనిచేస్తుంది. తేలికైన ఇంటర్ఫేస్‌తో కూడిన ఇది ఇంటర్నెట్‌ కనెక్షన్‌, మొబైల్‌ సర్వీస్‌ లేకపోయినా కోడ్లను స్వీకరిస్తుంది. ఇందులో డార్క్‌ థీమ్‌ ఆప్షన్‌ కూడా ఉంటుంది.

* ఆథీ: మంచి అథెంటికేటర్‌ యాప్స్‌లో ఆథీ కూడా ఒకటి. వేర్వేరు ఓఎస్‌లను సపోర్టు చేస్తుంది. పలు పరికరాలతో సింక్రనైజ్‌ అవుతుంది. బ్యాకప్‌ ఫీచర్‌ కూడా ఉంది. ఇవే ఆథీకి విశిష్ట 2ఎఫ్‌ఏ అథెంటికేటర్‌ యాప్‌గా గుర్తింపు  తెచ్చిపెట్టాయి. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ యాప్స్‌గానే కాదు.. క్రోమ్‌ ఎక్స్‌టెన్షన్‌ రూపంలో విండోస్‌, మ్యాక్‌ల మీదా అందుబాటులో ఉంటుంది. మిగతా 2ఎఫ్‌ఏ అథెంటికేటర్‌ యాప్‌ల మాదిరిగా ఫోన్‌ పోతే ఇది అకౌంట్‌ను లాక్‌ చేయదు. ఎందుకంటే దీనికి బ్యాకప్‌ ఫీచర్‌ ఉంది. దీంతో కొత్త ఫోన్‌ ద్వారా తేలికగా లాగిన్‌ కావొచ్చు. సెక్యూర్‌ కోడ్లను తిరిగి పొందొచ్చు.

* లాస్ట్‌పాస్‌ అథెంటికేటర్‌: దీన్ని వాడుకోవటం తేలిక. ఒక్క వెరిఫికేషన్‌తోనే గూగుల్‌, ఫేస్‌బుక్‌, అమెజాన్‌ వంటి ముఖ్యమైన సైట్లలో లాగిన్‌ కావొచ్చు. పరికరాన్ని ‘ట్రస్టెడ్‌’గానూ నమోదు చేసుకోవచ్చు. దీని మూలంగా ఆ పరికరంలో కోడ్‌లతో పనుండదు. 2ఎఫ్‌ఏతో ఖాతా అలాగే సురక్షితంగా ఉంటుంది.

* మైక్రోసాఫ్ట్‌ అథెంటికేటర్‌: గూగుల్‌ అథెంటికేటర్‌ మాదిరిగానే మైక్రోసాఫ్ట్‌ అథెంటికేటర్‌ కూడా మంచి ఎంపికే. ఇది మైక్రోసాఫ్ట్‌ ఖాతాలకు మల్టీ-ఫ్యాక్టర్‌ అథెంటికేషన్‌నూ సపోర్టు చేస్తుంది. ఖాతాల్లోకి లాగిన్‌ కావటానికి వెరిఫికేషన్‌ కోడ్‌ను టైప్‌ చేయాల్సిన పనిలేకుండా దీనికి అందే నోటిఫికేషన్‌ను ఆమోదిస్తే సరిపోతుంది.

* టీవోటీపీ అథెంటికేటర్‌:  ఇదీ బాగానే ఉపయోగపడుతుంది. ఇది ఖాతాలను క్లౌడ్‌లో బ్యాకప్‌ చేసుకోవటానికి.. ఎన్‌క్రిప్ట్‌ అయిన ఆఫ్‌లైన్‌ బ్యాకప్‌ను సృష్టించుకోవటానికి కూడా వీలు కల్పిస్తుంది. ఆథీ మాదిరిగానే క్రోమ్‌ ఎక్స్‌టెన్షన్‌ రూపంలోనూ అందుబాటులో ఉంది. అందువల్ల డెస్క్‌టాప్‌ మీద తేలికగా 2ఎఫ్‌ఏ సదుపాయాన్ని వాడుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని