ఐఓఎస్‌ అప్‌డేట్‌ చేసుకున్నారా?

సరికొత్త ఫీచర్లతో యాపిల్‌ సంస్థ ఐఓఎస్‌ 16.4 అప్‌డేట్‌ను విడుదల చేసింది. సాధారణంగా ఐఓఎస్‌ అప్‌డేట్లు సెక్యూరిటీ లోపాలను పూరించటానికి, సెటింగ్స్‌ను స్వల్పంగా మార్చటానికి తోడ్పడుతుంటాయి.

Published : 29 Mar 2023 00:06 IST

సరికొత్త ఫీచర్లతో యాపిల్‌ సంస్థ ఐఓఎస్‌ 16.4 అప్‌డేట్‌ను విడుదల చేసింది. సాధారణంగా ఐఓఎస్‌ అప్‌డేట్లు సెక్యూరిటీ లోపాలను పూరించటానికి, సెటింగ్స్‌ను స్వల్పంగా మార్చటానికి తోడ్పడుతుంటాయి. ఇదే సమయంలో కొత్త ఎమోజీలనూ అందిస్తుంటాయి. వినియోగదార్లకు ఇష్టమైన ఫీచర్ల పనితీరును మరింత మెరుగు పరుస్తుంటాయి. అందుకే కొత్త అప్‌డేట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవటానికి ఆసక్తి చూపుతుంటాయి. ఈసారి అప్‌డేట్‌తో ఎలాంటి సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయో చూద్దాం.

ప్రమాద గుర్తింపు మెరుగ్గా..

ఐఫోన్‌ 14తో వచ్చిన క్రాష్‌ డిటెక్షన్‌ మంచి ఫీచర్‌. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు, ఐఫోన్‌ను అందుకోలేని స్థితిలో ఉంటే ఇది తనకు తానే అత్యవసర నంబరుకు ఫోన్‌ చేసేస్తుంది. ఎమెర్జెన్సీ కాంటాక్టులనూ అప్రమత్తం చేస్తుంది. దురదృష్టవశాత్తు స్కీయింగ్‌ చేయటం వంటి వేగంగా పరుగెత్తే సందర్భాలనూ ఇది కారు ప్రమాదంగా భావిస్తుంది. దీన్ని నివారించటానికి కొత్త అప్‌డేట్‌తో క్రాష్‌ డిటెక్షన్‌ ఫీచర్‌ను మెరుగుదిద్దారు. ఆప్టిమైజేషన్‌ సదుపాయాన్ని జోడించారు.


31 కొత్త ఎమోజీలు

ప్పుడంతా ఎమోజీలతోనే స్పందిస్తున్నారు. ఏ భావాన్ని వెలిబుచ్చటానికైనా వీటినే వాడుకుంటున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఐఓఎస్‌ తాజా అప్‌డేట్‌తో 31 కొత్త ఎమోజీలను ప్రవేశపెట్టింది. నిజానికి వీటి సంఖ్య 21 కానీ చర్మం రంగుల వంటి తేడాలను పరిగణనలోకి తీసుకొని చూస్తే అదనంగా పది ఎమోజీలు కనిపిస్తాయి. వణికే ముఖం, లేత గులాబీ గుండె, నెడుతున్న రెండు చేతులు, వై-ఫై గుర్తు, విసనకర్ర, వివిధ రకాల జంతువులు, వస్తువులు వంటివెన్నో కొత్తగా అందుబాటులోకి వచ్చాయి.


వాయిస్‌ ఐసోలేషన్‌

ఫోన్‌ మాట్లాడుతున్నప్పుడు అవతలివారి గొంతు స్పష్టంగా వినిపించేలా చేయటం దీని ప్రత్యేకత. చుట్టుపక్కల ధ్వనులను ఇది నిలువరిస్తుంది. అంటే మార్కెట్లో, జన సంచారం ఎక్కువగా ఉన్న చోట్ల మాట్లాడుతున్నా మాటలు బాగా వినిపిస్తాయన్నమాట. చుట్టుపక్కల వాళ్లు గట్టిగా మాట్లాడుకుంటున్నా ఇబ్బందేమీ ఉండదు. అవతలివారికి వినిపిస్తుందో లేదోనని గట్టిగట్టిగా మాట్లాడటమూ తప్పుతుంది. కాల్‌ చేస్తున్నప్పుడు కంట్రోల్‌ సెంటర్‌ను ఓపెన్‌ చేసి, మైక్‌ మోడ్‌ ద్వారా వాయిస్‌ ఐసోలేషన్‌ ఫీచర్‌ను ఎనేబుల్‌ చేసుకోవచ్చు.


వెబ్‌ యాప్‌ నోటిఫికేషన్స్‌

త సంవత్సరం జరిగిన వరల్డ్‌వైడ్‌ డెవలపర్స్‌ సదస్సులోనే వెబ్‌ యాప్‌ నోటిఫికేషన్లను పంపించటానికి డెవలపర్లకు అనుమతించే ఫీచర్‌ను యాపిల్‌ పరిచయం చేసింది. దీన్ని సఫారీ కోసం మ్యాక్‌ఓస్‌ వెంచురా అప్‌డేట్‌తో అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు దీన్ని ఐఓఎస్‌ డెవలపర్లకూ వర్తింపజేసింది. తగు అనుమతులు తీసుకున్న తర్వాత వెబ్‌ యాప్‌ నోటిఫికేషన్లను పంపటానికిది వీలు కల్పిస్తుంది. హోంస్క్రీన్‌కు వెబ్‌ యాప్‌ను పిన్‌ చేసుకున్నట్టయితే దీని సదుపాయాలను పొందొచ్చు. యాప్స్‌ మాదిరిగానే వెబ్‌సైట్లు కూడా నోటిఫికేషన్లు పంపే వీలుండటం వల్ల ఐఫోన్‌ ఒకరకంగా మ్యాక్‌ మాదిరిగా కనిపిస్తుందని అనుకోవచ్చు. అయితే వెబ్‌సైట్లు కాకుండా వెబ్‌ యాప్స్‌ మాత్రమే నోటిఫికేషన్లు పంపే వీలుంటుందని తెలుసుకోవాలి.


పాడ్‌కాస్ట్స్‌కు కొత్త సదుపాయాలు

యాపిల్‌ పాడ్‌కాస్ట్స్‌ ఫీచర్‌ మరింత మెరుగైంది. ఇప్పుడు పాడ్‌కాస్టర్‌ లేదా పాడ్‌కాస్ట్‌ నెట్‌వర్క్‌కు సంబంధించిన వేర్వేరు షోలను ఛానెల్స్‌ మెనూలో జాబితాగా చూడొచ్చు. తర్వాత వినాలనుకునే భాగాలను అప్‌ నెక్స్ట్‌ ఫీచర్‌లో సేవ్‌ చేసుకోవచ్చు. సబ్‌స్క్రయిబ్‌ చేసుకోని భాగాలనూ సేవ్‌ చేసుకోవచ్చు. కావాలనుకుంటే వీటిని జాబితాలోంచి తొలగించుకోవచ్చు కూడా. ప్లే కాని భాగాలు ఇంకా ఎన్ని ఉన్నాయి? ఏదైనా పాడ్‌కాస్ట్‌లో ఏవైనా భాగాలు మిగిలి ఉన్నాయా? అనేవీ తెలుసుకోవచ్చు. కార్‌ప్లే సపోర్టు ఉన్నట్టయితే అప్‌ నెక్స్ట్‌, రీసెంట్లీ ప్లేయిడ్‌ ఫీచర్లను కారులోనూ చూసుకోవచ్చు. బ్రౌజ్‌ ట్యాబ్‌లో ప్రత్యేక రికమెండేషన్లనూ తెలుసుకోవచ్చు.


డూప్లికేట్స్‌ ఆల్బమ్‌

ఫొటో లైబ్రరీలో డూప్లికేట్‌ ఫొటోలు ఉంటే ఎక్కువ స్టోరేజీని ఆక్రమిస్తాయి. వీటిని ఎప్పటికప్పుడు గుర్తించి, తొలగించుకోవటం మంచిది. డూప్లికేట్స్‌ ఆల్బమ్‌ ఈ పనే చేస్తుంది. కొత్త అప్‌డేట్‌తో ఇది మరింత మెరుగైంది. ఐక్లౌడ్‌ షేర్డ్‌ ఫొటో లైబ్రరీలోని డూప్లికేట్‌ ఫొటోలనూ వెతికి, డిలీట్‌ చేసేస్తుంది. దీంతో కుటుంబం, స్నేహితులతో దిగిన మంచి ఫొటోల మీద ఎక్కువ దృష్టి పెట్టటానికి వీలుంటుంది.


మరికొన్ని ఫీచర్లు

వెదర్‌ యాప్‌లో మ్యాప్స్‌ కోసం వాయిస్‌ ఓవర్‌ సపోర్టును వాడుకోవచ్చు.

మిరుమిట్లు గొలిపే కాంతులను గుర్తిస్తే వీడియో తనకు తానే మసకగా మారేలా సెట్‌ చేసుకోవచ్చు.

పిల్లలు ఏదైనా కొంటున్నప్పుడు ఆస్క్‌ టు బై రిక్వెస్ట్‌ ఆప్షన్‌ తల్లిదండ్రుల పరికరంలో కచ్చితంగా కనిపించేలా చేయొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని