
Right To Repair: మీ ఐఫోన్ సమస్యను మీరే సరిచేయొచ్చు.. ఎలానో తెలుసా?
ఇంటర్నెట్‌డెస్క్: మనం వాడుతున్న ఫోన్, ట్యాబ్ లేదా పీసీలో ఏదైనా సమస్య వస్తే వెంటనే సర్వీస్ సెంటర్‌కు పరిగెత్తుకెళతాం. ఒకవేళ సమస్యపై అవగాహన ఉంటే.. అందుకు అవసరమైన టూల్స్ దొరికితే మనమే దాన్ని సరిచేస్తాం. అయితే ప్రతిసారీ ఇలా చేయడం సాధ్యంకాదు. ఎందుకంటే విడిభాగాలు దొరక్కపోవడం ప్రధాన కారణమైతే.. ఒకవేళ విడిభాగాలు దొరికినా ఎలా సరిచేయాలో తెలియపోవడం మరో కారణం. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు యాపిల్ కీలక నిర్ణయం తీసుకుంది.
యూజర్స్ తమ ఫోన్లలను ఇంటి వద్దనే రిపేర్ చేసుకునేలా విడిభాగాలు, రిపేర్ గైడ్‌లైన్స్‌ని యూజర్స్‌కి అందుబాటులోకి తీసుకురానుంది. త్వరలోనే దీన్ని ఆచరణలోకి తీసుకురానున్నట్లు వెల్లడించింది. దీంతో యూజర్స్ తమ యాపిల్ ఉత్పత్తుల్లో సమస్య తలెత్తితే అందుకు సంబంధించిన విడిభాగాన్ని ఆన్లైన్లో ఆర్డర్ చేసి ఇంటివద్దే దాన్ని రిపేర్ చేయొచ్చు. భద్రత, గోప్యత పరంగా కఠినమైన నిబంధనలు పాటించే యాపిల్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది? దీని వెనుక ఉన్న ఉద్యమం ఏంటి? దీనిపై టెక్ నిపుణులు ఏమంటున్నారో చూద్దాం...
రైట్ టు రిపేర్
అమెరికాలో చాలా మంది యూజర్స్ ‘మా ఫోన్లలను మేమే రిపేర్ చేసుకుంటాం’ అంటూ ‘రైట్ టు రిపేర్’ ఉద్యమాన్ని ప్రారంభించారు. దీని ద్వారా స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్స్, కంప్యూటర్లు తయారుచేసే సంస్థలు ఆయా ఉత్పత్తుల్లో ఏవైనా సమస్య తలెత్తితే వాటిని యూజర్స్ సరిచేసుకునేందుకు అవసరమైన స్పేర్‌పార్ట్స్, రిపేర్ గైడ్‌లైన్స్‌ను అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం.. రిపేర్‌కు అయ్యే ఖర్చు ఎక్కువగా ఉండటమే. అందుకే యాపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్ అమెజాన్ వంటి వాటితోపాటు ఇతర టెక్ దిగ్గజ సంస్థలు తయారుచేసే ఉత్పత్తులకు సంబంధించిన విడిభాగాలు యూజర్స్‌కి అందుబాటులో ఉంచాలని గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే నాణ్యమైన విడిభాగాలు అందుబాటులో లేని కారణంగా ఇది కార్యరూపం దాల్చలేదు. ఈ నేపథ్యంలో యాపిల్ తాజా నిర్ణయం హర్షణీయమని యూఎస్ పబ్లిక్ ఇంట్రెస్ట్ రీసెర్చ్ గ్రూప్ డైరెక్టర్ నాథన్ ప్రోక్టర్ అన్నారు.
యాపిల్ విడిభాగాలు ఎలా?
యాపిల్ రైట్ టు రిపేర్ ప్రోగ్రాంలో భాగంగా యూజర్ తమ ఫోన్లో స్క్రీన్, బ్యాటరీ, కెమెరా వంటి వాటిలో సమస్య తలెత్తినా, మ్యాక్ కంప్యూటర్లు, ఐపాడ్లలో సమస్య ఉత్పన్నమైనా వాటికి సంబంధించిన విడిభాగాలను ఆన్లైన్లో ఆర్డర్ చేయొచ్చు. యాపిల్ కంపెనీ విడిభాగాలతోపాటు వాటిని ఎలా సరి చేయాలనే దానికి సంబంధించి గైడ్‌లైన్స్‌ను కూడా పంపుతుంది. దాంతో యూజర్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లకుండా ఇంట్లోనే రిపేర్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఐఫోన్ 12 స్క్రీన్ పాడైతే కొత్త దానికోసం సుమారు రూ.15,000 వరకు ఛార్జ్ చేస్తున్నారు. దీనికి సర్వీస్ ఛార్జ్ అదనం. దీంతో రిపేర్ అయ్యే ఖర్చుతో కొత్త ఫోన్ కొనొచ్చనే భావన యూజర్స్‌లో నెలకొంది. ఒకవేళ ఇంటివద్ద రిపేర్ చేసే వెసులుబాటు ఉంటే యూజర్‌పై కాస్త భారం తగ్గుతుందని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల యూజర్స్ కూడా సర్వీస్ సెంటర్ల చుట్టూ తిరగాల్సిన అవసరంలేదు.
ప్రస్తుతం మార్కెట్లో ఐఫోన్లతో పాటు ఇతర బ్రాండెడ్ ఫోన్లకు సంబంధించి తక్కువ ధరలో విడిభాగాలు అందుబాటులో ఉన్నాయి. అయితే అవేవీ కంపెనీ తయారుచేసినవి కావు. ఒకరకంగా వాటిని నకిలీవిగా చెప్పుకోవచ్చు. కానీ పనితీరులో మాత్రం కంపెనీ ఉత్పత్తులకు ఏ మాత్రం తీసిపోవు. అయితే కంపెనీ తయారుచేసిన నాణ్యమైన ఉత్పత్తులు పొందాలంటే మాత్రం కాస్త ధర చెల్లించక తప్పనిసరి.
అప్పడు వ్యతిరేకించి.. ఇప్పుడు సరేనంటూ
రైట్ టు రిపేర్ ఉద్యమం మొదలైన తొలినాళ్లలో యాపిల్ దాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. దానివల్ల వినియోగదారుల డేటా గోప్యతకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందని ఆరోపించింది. అయితే యాపిల్ తమ ఉత్పత్తుల రిపేర్‌కు సంబంధించి కొన్ని ప్రత్యేకమైన సాఫ్ట్వేర్లు, టూల్స్ ఉపయోగిస్తుందని.. వాటిని బహిర్గతం చేయడం ఇష్టంలేకే డేటా గోప్యతను కారణంగా చూపుతుందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. తాజా నిర్ణయంతో గ్యాడ్జెట్ల రిపేర్‌కు సంబంధించి యాపిల్ వంటి దిగ్గజ సంస్థ సరికొత్త ప్రమాణాలను పాటిస్తుండటంతో.. ఇతర కంపెనీలు సైతం ఇదే విధానాన్ని అనుసరిస్తాయనే అభిప్రాయాన్ని టెక్ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ నిర్ణయంతో సర్వీస్ ఛార్జీల భారం తగ్గుతుందని యూజర్స్ భావిస్తున్నారు.
► Read latest Gadgets & Technology News and Telugu News
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.