Coca Cola Phone : కోలా ఫోన్‌ కాదు.. కోకాకోలా స్పెషల్‌ ఎడిషన్‌.. ఫీచర్లివే!

కోకాకోలా కంపెనీ కోలా ఫోన్‌ పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు కొద్దిరోజుల కిత్రం వార్తలు వెలువడ్డాయి. తాజాగా దీనిపై రియల్‌మీ కంపెనీ స్పష్టతనిచ్చింది.

Published : 02 Feb 2023 21:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొద్దిరోజుల క్రితం శీతల పానీయాల ఉత్పత్తి సంస్థ కోకాకోలా (Coca Cola), రియల్‌మీ (Realme) కలిసి కొత్త స్మార్ట్‌ఫోన్‌ (Smartphone)ను మార్కెట్లోకి తీసుకురానుందనే వార్తలు వెలువడ్డాయి. తాజాగా దీనికి సంబంధించిన వివరాలను రియల్‌మీ వెల్లడించింది. ఇది కోలా ఫోన్‌ కాదనీ, కేవలం ప్రత్యేక ఎడిషన్‌గా  మాత్రమే  తీసుకొస్తున్నట్లు తెలిపింది. ఫిబ్రవరి 10న కోకాకోలా ఎడిషన్‌ (Coca Cola Edition) పేరుతో రియల్‌మీ 10 ప్రో 5జీ (Realme 10 Pro 5G) స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. మరి ఈ ఫోన్‌ ధర, ఫీచర్లను చూద్దాం. 

రియల్‌మీ 10 ప్రో 5జీ కోకా కోలా ఎడిషన్‌లో 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో  6.7 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఆండ్రాయిడ్ 13 ఆధారిత రియల్‌మీ యూఐ 4 ఓఎస్‌తో పనిచేస్తుంది. స్నాప్‌డ్రాగన్‌ 695 5జీ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇందులో మూడు కెమెరాలున్నాయి. వెనుక రెండు, ముందు ఒకటి. వెనుకవైపు 108 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు, 2 ఎంపీ ప్రొట్రెయిట్‌ కెమెరా ఇస్తున్నారు. ముందుభాగంలో 16 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు. 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది.

ఈ ఫోన్‌ 6 జీబీ ర్యామ్‌/128 జీబీ స్టోరేజ్‌, 8 జీబీ/128 జీబీ వేరియంట్లలో లభిస్తాయి. ప్రస్తుతం భారత్‌లో ఈ మోడల్‌ ప్రారంభ ధర రూ. 18,999గా ఉంది. కోకాకోలా ప్రత్యేక ఎడిషన్‌ ధర రూ. 20 వేల నుంచి రూ. 25 వేల మధ్య ఉంటుందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కోకాకోలా అభిమానుల కోసం ఈ ప్రత్యేక ఎడిషన్‌ను విడుదల చేస్తున్నట్లు సమాచారం. గతంలో కూడా రియల్‌మీ కంపెనీ మార్వెల్‌ సంస్థతో కలిసి రియల్‌మీ జీటీ నియో 3 థోర్‌ ఎడిషన్‌ (Realme GT Neo 3  Thor Edition)ను తీసుకొచ్చింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని