వై-ఫై డేటాను ఎవరైనా దొంగిలిస్తున్నారా?

ప్రస్తుతం ఎక్కువమంది వైర్‌లెస్‌ నెట్‌వర్క్‌లే వాడుతున్నారు. అయితే సొంతంగా ఇంటర్నెట్‌ కనెక్షన్‌ తీసుకోవటానికి బదులు ఇరుగుపొరుగు కనెక్షన్‌ను వాడుకోవాలని ప్రయత్నించేవారూ లేకపోలేదు.

Published : 23 Nov 2022 00:47 IST

ప్రస్తుతం ఎక్కువమంది వైర్‌లెస్‌ నెట్‌వర్క్‌లే వాడుతున్నారు. అయితే సొంతంగా ఇంటర్నెట్‌ కనెక్షన్‌ తీసుకోవటానికి బదులు ఇరుగుపొరుగు కనెక్షన్‌ను వాడుకోవాలని ప్రయత్నించేవారూ లేకపోలేదు. దీంతో ఇంటర్నెట్‌ వేగం తగ్గుతుంది. సమస్యలు సృష్టిస్తుంది. మరి వై-ఫైని ఎవరైనా దొంగతనంగా వాడుకుంటుంటే తెలుసుకునేదెలా? ఒకవేళ అలా వాడుకుంటుంటే ఆపటమెలా?

వరైనా వై-ఫైని చాటుగా వాడుకుంటున్నారేమో అనేది తెలుసుకోవటానికి సులువైన మార్గం రూటర్‌ మీదుండే లైట్లను తనిఖీ చేయటం. రూటర్‌కు చాలా లైట్లు ఉండటం చూసే ఉంటారు. ఇంటర్నెట్‌ కనెక్టివిటీ, తీగతో అనుసంధానించిన కనెక్షన్లు, వైర్‌లెస్‌ యాక్టివిటీ వంటి వాటిని ఇవి చూపుతాయి. కాబట్టి ఒకసారి నెట్‌వర్క్‌ నుంచి అన్ని పరికరాలను డిస్‌కనెక్ట్‌ చేసి చూడండి. వైర్‌లెస్‌ యాక్టివిటీని సూచించే లైటుని గమనించండి. పరికరాలను డిస్‌కనెక్ట్‌ చేసినా ఇదింకా మిణుకు మిణుకుమని వెలుగుతుంటే వై-ఫైని ఎవరో దొంగిలిస్తున్నారనే అర్థం. అయితే ఇది అనుమానాన్ని తేలికగా, త్వరగా నివృత్తి చేసుకోవటానికి తోడ్పడే మార్గమే తప్ప పెద్దగా చేయగలిగిందేమీ లేదు.

డివైస్‌ రూటర్‌ జాబితా తనిఖీ

అనుసంధానమైన పరికరాల జాబితాను రూటర్‌ అడ్మినిస్ట్రేటివ్‌ కన్సోల్‌ ద్వారా తెలుసుకోవచ్చు. వెబ్‌ బ్రౌజర్‌ విండోలో రూటర్‌ ఐపీని ఎంటర్‌ చేసి ఇందులో తేలికగా లాగిన్‌ కావొచ్చు. దీనిలో నెట్‌వర్క్‌కు అనుసంధానమైన పరికరాల జాబితా మొత్తం కనిపిస్తుంది. ఐపీ అడ్రస్‌లు, మ్యాక్‌ అడ్రస్‌లు, పరికరాల పేర్లన్నింటినీ చూడొచ్చు. వీటిని మన పరికరాలతో పోల్చి చూసుకుంటే ఇతరులకు సంబంధించినవి ఏవనే విషయం తెలుస్తుంది.

* కంప్యూటర్‌లో నెట్‌వర్క్‌ మానిటరింగ్‌ సాఫ్ట్‌వేర్‌తోనూ మన నెట్‌వర్క్‌కు అనుసంధానమైన ఇతరుల పరికరాలను గుర్తించొచ్చు. ఇలాంటి టూల్స్‌లో అధునాతన ఫీచర్లూ ఉంటాయి. థర్డ్‌పార్టీ టూల్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవటానికి ముందు రూటర్‌కు సొంత సాఫ్ట్‌వేర్‌ ఉందేమో చూసుకోవటం మంచిది.

దొంగతనాన్ని ఆపేదెలా?

వై-ఫై నెట్‌వర్క్‌ని ఎవరో దొంగిలిస్తున్నారని గుర్తించాం. కానీ దాన్ని ఆపేదెలా? ముందుగా నెట్‌వర్క్‌ని కాపాడటానికి తోడ్పడే సెక్యూరిటీ ప్రొటోకాల్‌ను తనిఖీ చేయాలి. డబ్ల్యూఈపీ, డబ్ల్యూపీఏ వంటి కాలం చెల్లిన సెక్యూరిటీ ప్రొటోకాళ్లకు బదులు డబ్ల్యూపీఏ2-ఏఈఎస్‌ వంటి మరింత అధునాతన ప్రొటోకాళ్లను వాడుకోవాలి. తర్వాత చేయాల్సిన పని కఠినమైన పాస్‌వర్డ్‌లను పెట్టుకోవటం. అలాగే ఈ పాస్‌వర్డ్‌లను ప్రతి రెండు నెలలకోసారి మార్చుకోవాలి కూడా. కఠినమైన పాస్‌వర్డ్‌తో నెట్‌వర్క్‌లోకి ఇతరులు చొరబడకుండా చూసుకోవచ్చు. తరచూ పాస్‌వర్డ్‌ను మార్చుకుంటే.. ఒకవేళ ఎవరైనా దాన్ని ఛేదించినా రెండు నెలల తర్వాత తరిమేయొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని