మనఫోన్‌ ఓఎస్‌

ఆండ్రాయిడ్‌ మొబైల్‌ఫోన్ల ఆపరేటింగ్‌ సిస్టమ్‌ (ఓఎస్‌) విషయంలో గూగులే శరణ్యం. దీనికి ప్రత్యామ్నాయం లేదు. దీంతో డిఫాల్ట్‌గా ఇన్‌స్టాల్‌ అయ్యే యాప్స్‌ కొన్నిసార్లు భద్రతకు కలిగించొచ్చు.

Published : 01 Feb 2023 00:12 IST

ఆండ్రాయిడ్‌ మొబైల్‌ఫోన్ల ఆపరేటింగ్‌ సిస్టమ్‌ (ఓఎస్‌) విషయంలో గూగులే శరణ్యం. దీనికి ప్రత్యామ్నాయం లేదు. దీంతో డిఫాల్ట్‌గా ఇన్‌స్టాల్‌ అయ్యే యాప్స్‌ కొన్నిసార్లు భద్రతకు కలిగించొచ్చు. మన డేటాను పలు టెక్‌ సంస్థలు వాడుకునే ప్రమాదం లేకపోలేదు. దీనికి పరిష్కారంగానే మనదైన మొబైల్‌ ఓఎస్‌ తయారైంది. దీని పేరు భారత్‌ ఓఎస్‌. భార్‌ఓఎస్‌ అనీ పిలుచుకుంటున్నారు. ఐఐటీ మద్రాస్‌కు చెందిన అంకుర సంస్థ జన్‌డీకే ఆపరేషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ తయారుచేసిన దీన్ని ఇటీవలే పరీక్షించారు కూడా. ఇంతకీ దీని కథేంటి?

భార్‌ఓఎస్‌ మనదైన సరికొత్త మొబైల్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌. గూగుల్‌ ఆండ్రాయిడ్‌, యాపిల్‌ ఐఓఎస్‌ మాదిరిగా స్మార్ట్‌ఫోన్లలోని కీలక ఇంటర్ఫేస్‌కు వీలు కల్పించే వినూత్న సాఫ్ట్‌వేర్‌. వ్యక్తిగత రక్షణ, గోప్యతకు పెద్ద పీట వేసే ఇది ఉచితంగానే అందుబాటులో ఉంటుంది. ఓపెన్‌సోర్స్‌ కూడా. సాంకేతికంగా చూస్తే భార్‌ఓఎస్‌ చాలావరకు ఆండ్రాయిడ్‌ మాదిరిగానే ఉంటుంది. రెండింటిలోని బేసిక్స్‌ అన్నీ ఒకటే. ఎందుకంటే ఇదీ ఆండ్రాయిడ్‌ ఓపెన్‌ సోర్స్‌ ప్రాజెక్ట్‌(ఏఓఎస్‌పీ)నే వాడుకుంటుంది. అయితే దీని ప్రత్యేకతలు దీనికి లేకపోలేదు.


మూడు ప్రత్యేకతలు

* గూగుల్‌ సర్వీసులు, యాప్స్‌ వంటివేవీ ఇందులో ఉండవు. సాధారణంగా ప్రిఇన్‌స్టాల్డ్‌ యాప్స్‌, సర్వీసులతో గూగుల్‌ మన డేటాను సంగ్రహిస్తుంది. కొన్నిసార్లు మన అనుమతితో సంబంధం లేకుండానే సమాచారాన్ని తీసేసుకుంటుంది. గూగుల్‌ ప్లే స్టోర్‌లోని ఇతర యాప్‌లూ థర్డ్‌ పార్టీ సర్వీసులతో సమాచారాన్ని పంచుకుంటాయి. భార్‌ఓఎస్‌తో ఇలాంటి ఇబ్బందులు తప్పుతాయి. ప్రిఇన్‌స్టాల్డ్‌ సర్వీసులు గానీ యాప్స్‌ గానీ ఉండవు. వినియోగదారులు తమకు అవసరమైన యాప్స్‌ను తామే ఇన్‌స్టాల్‌ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మరింత భద్రతను చేకూరుస్తుంది.

* భార్‌ఓఎస్‌కు ప్రత్యేకమైన యాప్‌ స్టోర్‌ కూడా ఉంటుంది. ఇది ఆర్గనైజేషన్‌-స్పెసిఫిక్‌ ప్రైవేట్‌ యాప్‌ స్టోర్‌ సర్వీసెస్‌ (పాస్‌) నుంచి విశ్వసనీయమైన యాప్స్‌ను అందిస్తుంది. పూర్తిగా తనిఖీ చేసి.. సంస్థల భద్రత, గోప్యత ప్రమాణాలకు సరిపోయిన యాప్స్‌ను మాత్రమే అందిస్తుంది. ఇది భద్రతకు ఎంతగానో తోడ్పడుతుంది. అలాగే ఆండ్రాయిడ్‌ కన్నా ఇది ఏపీకే యాప్స్‌ను తేలికగా అనుమతిస్తుంది. దీని ప్రత్యేక స్టోర్‌లో మనదేశం, మనదేశానికి చెందినవారి అవసరాలకు తగినట్టుగా రూపొందించిన యాప్‌లకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చే అవకాశమూ ఉంది.

* నేటివ్‌ ఓవర్‌ ఎయిర్‌ (నోటా) రూపంలో అప్‌డేట్స్‌కు భార్‌ఓఎస్‌ వీలు కల్పిస్తుంది. ఇవి తమకుతామే డౌన్‌లోడ్‌ అయ్యి, పరికరంలో ఇన్‌స్టాల్‌ అవుతాయి. వీటి కోసం మనం ప్రత్యేకించి చేయాల్సిందేమీ ఉండదు. అందువల్ల పరికరం ఎప్పటికప్పుడు లేటెస్ట్‌ వర్షన్‌తోనే పనిచేస్తుంది. తాజా సెక్యూరిటీ ప్యాచెస్‌, బగ్‌ ఫిక్స్‌లన్నీ దీంతోనే అందుతాయి.


ఎలా ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి?

ప్రస్తుతానికి దీని గురించి ఎలాంటి సమాచారం లేదు. మొబైల్‌ఫోన్లలో ఉన్న ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను తొలగించి కొత్తదాన్ని ఇన్‌స్టాల్‌ చేసుకోవటం చాలా రిస్క్‌తో కూడుకున్న పని. కాబట్టి టెక్‌ ఔత్సాహికులు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవటం మంచిది. ఇప్పటికైతే కొత్త, మున్ముందు వచ్చే పరికరాలకే భార్‌ఓఎస్‌ పరిమితమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. పాత పరికరాలకు అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. పైగా కఠినమైన గోప్యత, భద్రత అవసరమైన ప్రభుత్వ సంస్థల్లో పనిచేసేవారికే దీన్ని అందిస్తున్నారు. అయితే త్వరలోనే అందరికీ అందుబాటులోకి రావొచ్చు.


ఇంతకు ముందూ..

గూగుల్‌ ఆండ్రాయిడ్‌కు దేశీయ ప్రత్యామ్నాయాల రూపకల్పనకు ఇంతకుముందూ ప్రయత్నాలు జరిగాయి. భార్‌ఓఎస్‌కు ముందు నోయిడాకు చెందిన ఒక సంస్థ ఇండస్‌ఓఎస్‌ను సృష్టించింది. ప్రాంతీయ భాషలను ఉపయోగించేవారిని దృష్టిలో పెట్టుకొని దీన్ని తయారుచేశారు. అయితే విజయం సాధించలేదు. మైక్రోమాక్స్‌కు చెందిన ఫోన్లు ఇండస్‌ఓఎస్‌ వర్షన్‌తోనూ వచ్చాయి. కానీ ఆండ్రాయిడ్‌ మాదిరిగా ఆదరణ పొందలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని