యాపిల్‌ వాచ్‌ మాయ!

ఇటీవల స్మార్ట్‌వాచ్‌లకు ఆదరణ పెరుగుతోంది. వీటిల్లో యాపిల్‌ వాచ్‌ తీరే వేరు. ఇది ఐఫోన్‌కు మంచి తోడు.

Published : 01 Feb 2023 00:12 IST

టీవల స్మార్ట్‌వాచ్‌లకు ఆదరణ పెరుగుతోంది. వీటిల్లో యాపిల్‌ వాచ్‌ తీరే వేరు. ఇది ఐఫోన్‌కు మంచి తోడు. నోటిఫికేషన్లు మేనేజ్‌ చేయటానికి, కాల్స్‌ చేసుకోవటానికి, ఐఫోన్‌ను తాకకుండానే కొన్ని యాప్స్‌తో పనులు చేసుకోవటానికీ తోడ్పడుతుంది. హెల్త్‌ అండ్‌ ఫిట్‌నెస్‌ యాప్‌ శరీర సౌష్టవాన్ని మెరుగు పరచుకోవటానికి దోహదం చేస్తుంది. దీన్నుంచి అందే నోటిఫికేషన్లు అన్నింటికన్నా పైన కనిపిస్తూ.. ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుంటాయి. యాక్టివిటీ యాప్‌, నోటిఫికేషన్‌ సెంటర్‌, వాచ్‌ ఫేసెస్‌ వంటివే కాదు.. ఇంకెన్నో ఫీచర్లు దీని సొంతం. మీరూ యాపిల్‌ వాచ్‌ కొన్నారా? ఎక్కడ నుంచి ఆరంభించాలో తెలియటం లేదా? అయితే కొన్ని చిట్కాలు, ఫీచర్ల గురించి తెలుసుకోవాల్సిందే.


యాప్‌ లాంచర్‌గా డాక్‌

యాపిల్‌ వాచ్‌లో డాక్‌ గురించి చాలామందికి తెలియదనే చెప్పుకోవచ్చు. సైడ్‌ బటన్‌ను నొక్కినప్పుడు ఇది కనిపిస్తుంది. అయితే దీని పేరు తికమకకు గురిచేస్తుంది. ఇది ఐఫోన్‌లో యాప్‌ స్విచర్‌ మాదిరిగా డిఫాల్ట్‌గా రీసెంట్‌ యాప్స్‌ను చూపిస్తుంది. అంతేకాదు, దీన్ని యాప్‌ లాంచర్‌గానూ వాడుకోవచ్చు. ఇందుకోసం వాచ్‌ యాప్‌ను ఓపెన్‌ చేసి డాక్‌ను సెలెక్ట్‌ చేసుకోవాలి. రీసెంట్స్‌ నుంచి ఫేవరట్‌లోకి మార్చుకోవాలి. తరచూ వాడే యాప్స్‌ను ఫేవరట్‌లో యాడ్‌ చేసుకుంటే చాలు. సైడ్‌ బటన్‌ను నొక్కగానే డాక్‌లో అవన్నీ జాబితా రూపంలో కనిపిస్తాయి. వీటి మీద ట్యాప్‌ చేసి యాప్‌ను లాంచ్‌ చేసుకోవచ్చు.


సైలెంట్‌ మోడ్‌ను ప్రయత్నించండి

యాపిల్‌ వాచ్‌ను ధరిస్తే కలిగే గొప్ప మేలు ఐఫోన్‌ దగ్గర లేకపోయినా పనులు చేసుకునే వీలుండటం. తరచూ ఎన్నో మెసేజ్‌లు, కాల్స్‌ వస్తుంటాయి. వీటన్నింటినీ ఐఫోన్‌ను తాకకుండానే చేసుకోవచ్చు. అంటే గంటల కొద్దీ ఐఫోన్‌ను సైలెంట్‌ మోడ్‌లో పెట్టినా వాచ్‌తోనే చాలావరకు పని కానీయొచ్చు. అయితే డిఫాల్ట్‌గా యాపిల్‌ వాచ్‌ కూడా ప్రతి నోటిఫికేషన్‌కు శబ్దం చేస్తుంది. ఇదీ కొన్నిసార్లు చికాకు పరచొచ్చు. మరి దీన్నీ సైలెంట్‌ మోడ్‌లో పెట్టుకుంటే? వాచ్‌ ఫేస్‌ను స్వైప్‌ చేసి కంట్రోల్‌ సెంటర్‌లోకి వెళ్లాలి. బెల్‌ గుర్తు మీద ట్యాప్‌ చేసి సైలెంట్‌ మోడ్‌ను ఎంచుకోవాలి. దీంతో నోటిఫికేషన్‌ అందినప్పుడు వాచ్‌ నెమ్మదిగా మణికట్టు మీద తడుతుంది. వాచ్‌ను తాకితేనే తెర వెలుగుతుంది.


తెలివిగా నోటిఫికేషన్స్‌ మేనేజ్‌

ఎల్లప్పుడూ చేతికి యాపిల్‌ వాచ్‌ను ధరిస్తే వచ్చే నోటిఫికేషన్లను చూడటానికే సమయం సరిపోతుంది. ఒకవేళ వాచ్‌ ధరించకపోతే ఏమేం నోటిఫికేషన్లు వచ్చాయో అనే గాబరా మొదలవుతుంది. ఇలాంటి ఇబ్బందిని తప్పించుకోవటానికి ఆయా నోటిఫికేషన్లను డిసేబుల్‌ చేసుకునే సదుపాయమూ ఉంది. దీన్ని నోటిఫికేషన్‌ సెంటర్‌ నుంచి సెట్‌ చేసుకోవాలి. నోటిఫికేషన్‌ను ఎడమ వైపునకు స్వైప్‌ చేసి.. మెనూ బటన్‌ మీద ట్యాప్‌ చేయాలి. తర్వాత ‘టర్న్‌ ఆఫ్‌ ఆన్‌ యాపిల్‌ వాచ్‌’ను ఎంచుకోవాలి. కావాలంటే ‘డెలివర్‌ క్వైట్లీ’ ఆప్షన్‌నూ ఎంచుకోవచ్చు. ఇది సౌండ్‌, వైబ్రేషన్‌లను డిసేబుల్‌ చేస్తుంది. ఐఫోన్‌ ద్వారానూ నోటిఫికేషన్స్‌ అందకుండా చూసుకోవచ్చు. నిజానికిదే తేలికైన మార్గం. ఐఫోన్‌లో సెటింగ్స్‌ ద్వారా నోటిఫికేషన్స్‌లోకి వెళ్లి, ‘మిర్రర్‌ ఐఫోన్‌ అలర్ట్స్‌ ఫ్రం’ విభాగంలోకి వెళ్లాలి. వాచ్‌కు ఏయే యాప్స్‌ నుంచి నోటిఫికేషన్లు అందొద్దని అనుకుంటే వాటిని ఎంచుకుంటే చాలు.


నేరుగా రాతతో రిప్లయి

యాపిల్‌ వాచ్‌కు నోటిఫికేషన్‌ వచ్చినప్పుడు దాని మీద ట్యాప్‌ చేసి, రిప్లయిని ఎంచుకొని త్వరగా సమాధానం ఇస్తాం. ఇందుకు చాలా ఆప్షన్లే ఉన్నాయి. మైక్‌ బటన్‌ను నొక్కి జవాబు ఇవ్వచ్చు. ఎమోజీ గానీ ముందే రాసి ఉన్న మెసేజ్‌లను గానీ పంపించొచ్చు. కానీ చాలామందికి తెలియని ఫీచర్‌ మరోటుంది. అదే స్క్రిబుల్‌ టూల్‌. ‘ఏ ఐకాన్‌ విత్‌ ద హ్యాండ్‌’ ఆప్షన్‌ మీద ట్యాప్‌ చేస్తే ఇది ఓపెన్‌ అవుతుంది. దీంతో అక్షరాలు రాయొచ్చు. యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 7, ఆ తర్వాత వర్షన్‌ వాచ్‌లు వాడుతున్నట్టయితే క్వెర్టీ కీబోర్డునూ వాడుకోవచ్చు. దీంతో పెద్ద మెసేజ్‌లు రాయటం కష్టం. ఎందుకంటే తెర చిన్నగా ఉంటుంది. మూడు నాలుగు పదాల మెసేజ్‌లైతే తేలికగా రాయొచ్చు. పెద్ద మెసేజ్‌లు రాయాలనుకుంటే కస్టమైజ్డ్‌ మెసేజ్‌ రిప్లయిస్‌ను సెట్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని