వీఎల్‌సీ మొరాయిస్తే?

విండోస్‌ వాడేవారిలో ఎక్కువమంది ఇష్టపడే వీడియో ప్లేయర్లలో ముందుగా చెప్పుకోవాల్సింది వీఎల్‌సీనే. తేలికగా వాడుకునే వీలుండటం, వైవిధ్యమైన ఫీచర్లు, బోలెడన్ని ఫైల్‌ ఫార్మాట్లను సపోర్టు చేయటం దీనికి ఎనలేని ఆదరణ తెచ్చిపెట్టింది.

Published : 22 Feb 2023 00:15 IST

విండోస్‌ వాడేవారిలో ఎక్కువమంది ఇష్టపడే వీడియో ప్లేయర్లలో ముందుగా చెప్పుకోవాల్సింది వీఎల్‌సీనే. తేలికగా వాడుకునే వీలుండటం, వైవిధ్యమైన ఫీచర్లు, బోలెడన్ని ఫైల్‌ ఫార్మాట్లను సపోర్టు చేయటం దీనికి ఎనలేని ఆదరణ తెచ్చిపెట్టింది. చాలా అప్లికేషన్ల మాదిరిగానే వీఎల్‌సీ సైతం కొన్నిసార్లు చికాకు పెట్టొచ్చు. వీడియోను సక్రమంగా ప్లే చేయకపోవటం, మాటిమాటికి ఆగిపోవటం వంటివి ఇబ్బంది కలిగించొచ్చు. అదృష్టవశాత్తు దీన్ని తేలికగానే సరిదిద్దుకోవచ్చు.

ఫైల్‌ ఫార్మాట్‌ తనిఖీ

వీఎల్‌సీ మీడియా ప్లేయర్‌ దాదాపు అన్నిరకాల వీడియో ఫార్మాట్లను సపోర్టు చేస్తుంది. కాకపోతే కొన్నింటిని ప్లే చేయలేకపోవచ్చు. మనం చూసే వీడియో ఈ జాబితాలోది అయితే మాటిమాటికీ ఆగిపోవచ్చు. కాబట్టి వీఎల్‌సీ దాన్ని సపోర్టు చేస్తుందో లేదో చూసుకోవాలి. ఒకవేళ సపోర్టు చేయకపోతే ఆ వీడియోను కన్వర్ట్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

హార్డ్‌వేర్‌ యాక్సిలరేషన్‌ను డిసేబుల్‌ చేయటం

వీఎల్‌సీలోని హార్డ్‌వేర్‌ యాక్సిలరేషన్‌ ఫీచర్‌ పరికరంలోని జీపీయూను వాడుకుంటుంది. దీని ద్వారా డీకోడింగ్‌ ప్రక్రియను వేగవంతం చేసుకుంటుంది. వీడియో మధ్యలో ఆగకుండా ప్లే అయ్యేలా చేస్తుంది. ఈ ఫీచర్‌లో లోపాలుంటే వీడియో ఆగుతూ, సాగుతూ వస్తుంటుంది. అయినప్పటికీ కొన్నిసార్లు దీన్ని డిసేబుల్‌ చేస్తే ఫలితం కనిపించొచ్చు. ఇందుకోసం వీఎల్‌సీ మీడియా ప్లేయర్‌ను ఓపెన్‌ చేసి.. టూల్స్‌ మీద క్లిక్‌ చేయాలి. మెనూలోంచి ప్రిఫరెన్సెస్‌ ద్వారా ఇన్‌పుట్‌/కోడ్స్‌ను ఎంచుకోవాలి. డ్రాప్‌డౌన్‌ మెనూలో ‘హార్డ్‌వేర్‌-యాక్సెలరేటెడ్‌ డీకోడింగ్‌’ అప్షన్‌ను డిసేబుల్‌ చేసుకొని, సేవ్‌ చేసుకోవాలి. తర్వాత వీఎల్‌సీని రిఫ్రెష్‌ చేయాలి.

పవర్‌ప్లాన్‌ను మార్చుకోవటం

విండోస్‌ కంప్యూటర్‌లో కఠిన పవర్‌ ప్రొఫైల్‌ను ఎనేబుల్‌ చేసుకుంటే యాప్స్‌ నెమ్మదిగా రన్‌ అవ్వచ్చు. దీంతో వీఎల్‌సీ మీడియా ప్లేయర్‌ పనిచేయటంలోనూ ఇబ్బంది కలగొచ్చు. కంప్యూటర్‌ పవర్‌ ప్లాన్‌ను హై పర్‌ఫార్మెన్స్‌కు మార్చుకోవటం ద్వారా దీన్ని నివారించుకోవచ్చు. ముందు విండోస్‌, ఆర్‌ బటన్లను కలిపి నొక్కి డైలాగ్‌ బాక్స్‌ను ఓపెన్‌ చేయాలి. కంట్రోల్‌ అని టైప్‌ చేస్తే కంట్రోల్‌ ప్యానెల్‌ కనిపిస్తుంది. దీన్ని ఓపెన్‌ చేసి, పవర్‌ ఆప్షన్స్‌ మీద క్లిక్‌ చేస్తే పవర్‌ ప్లాన్‌ కనిపిస్తుంది. ఇందులో హై పర్‌ఫార్మెన్స్‌ను ఎంచుకొని, సేవ్‌ చేసుకోవాలి.

క్యాచింగ్‌ వాల్యూ మార్చటం

వెబ్‌ నుంచి వీడియోను ప్లే చేసేటప్పుడు వీఎల్‌సీ కంటెంట్‌లోని కొంత భాగాన్ని గ్రహించుకొని పెట్టుకుంటుంది. ఇలా వేగంగా వీడియో ప్లే అయ్యేలా చేస్తుంది. ఒకవేళ వీడియో తడబడు తున్నట్టయితే నెట్‌వర్క్‌, ఫైల్‌ క్యాచీ సైజును పెంచుకోవటానికి ప్రయత్నించొచ్చు. ముందుగా పీసీలో వీఎల్‌సీ మీడియా ప్లేయర్‌ను ఓపెన్‌ చేసి, టూల్స్‌ ద్వారా ప్రిఫరెన్సెస్‌లోకి వెళ్లాలి. ఇందులోని ఆల్‌ ఆప్షన్‌ కిందుండే షో సెటింగ్స్‌ ద్వారా ఇన్‌పుట్‌/కోడెక్స్‌ను ఎంచుకోవాలి. ఇందులో అడ్వాన్స్‌డ్‌ ఆప్షన్‌ కింద కనిపించే ఫైల్‌ క్యాచింగ్‌ (ఎంఎస్‌) విభాగంలో వాల్యూను పెంచుకోవాలి. అలాగే నెట్‌వర్క్‌ క్యాచింగ్‌ (ఎంఎస్‌) విలువనూ పెంచుకొని, సేవ్‌ చేసుకోవాలి.

వీఎల్‌సీ ప్రిఫరెన్సెస్‌ రీసెట్‌ చేయటం

వీఎల్‌సీ పనితీరును మెరుగు పరచుకోవటానికి బోలెడన్ని సెటింగ్స్‌, ప్రిఫరెన్సెస్‌ అందుబాటులో ఉన్నాయి. అయితే కొన్ని ప్రిఫరెన్సులు సరిగా కాన్ఫిగర్‌ కావు. దీంతో విండోస్‌ ప్రవర్తన తీరు మారిపోవచ్చు. ఒకో ప్రిఫరెన్స్‌ను మార్చుకుంటూ రావటం కన్నా అన్నింటినీ రీసెట్‌ చేసి, తిరిగి మొదట్నుంచి పనిచేయించేలా చూసుకోవటం మంచిది. ఇందుకోసం టూల్స్‌ విభాగం ద్వారా ప్రిఫరెన్సెస్‌లోకి వెళ్లి ‘రీసెట్‌ ప్రిఫరెన్సెస్‌’ మీద క్లిక్‌ చేయాలి. వీటిని రీసెట్‌ చేయాలని అనుకుంటున్నారా అని డైలాగ్‌ బాక్స్‌లో కనిపిస్తుంది. అప్పుడు ఓకే మీద క్లిక్‌ చేయాలి. తర్వాత వీఎల్‌సీ అప్లికేషన్‌ని రీస్టార్ట్‌ చేయాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని