విండోస్‌ పీసీతో ఐఫోన్‌ కాల్స్‌

ఐఫోన్‌ వాడేవారు ఫోన్‌తోనే కాదు.. మ్యాక్‌, ఐప్యాడ్‌ వంటి యాపిల్‌ పరికరాలతోనూ కాల్స్‌ చేసుకోవచ్చు. మెసేజ్‌లు పంపొచ్చు, అందుకోవచ్చు. కానీ విండోస్‌ పీసీతో ఇలాంటి సదుపాయం లేదు.

Published : 08 Mar 2023 00:42 IST

ఫోన్‌ వాడేవారు ఫోన్‌తోనే కాదు.. మ్యాక్‌, ఐప్యాడ్‌ వంటి యాపిల్‌ పరికరాలతోనూ కాల్స్‌ చేసుకోవచ్చు. మెసేజ్‌లు పంపొచ్చు, అందుకోవచ్చు. కానీ విండోస్‌ పీసీతో ఇలాంటి సదుపాయం లేదు. దీని గురించి ఇకపై చింతించాల్సిన పనిలేదు. విండోస్‌ 11తో కూడిన పీసీ ఉంటే త్వరలోనే ఐఫోన్‌ కాల్స్‌ చేసుకోవచ్చు. ఇందుకోసం మైక్రోసాఫ్ట్‌ సంస్థ ‘ఫోన్‌ లింక్‌ ఫర్‌ ఐఓఎస్‌’ ఫీచర్‌ను తీసుకొస్తోంది. ఇది యాపిల్‌ వినియోగదారులకు ఐమెసేజెస్‌ను వాడుకోవటానికి, ఫోన్‌ కాల్స్‌ చేసుకోవటానికి, అందుకోవటానికి వీలు కల్పిస్తుంది. ఇప్పటికే ఫోన్‌ లింక్‌ ఫీచర్‌ ప్రివ్యూయింగ్‌ను ఆరంభించారు. ప్రస్తుతం కొద్దిమందితోనే దీన్ని పరీక్షిస్తున్నారు. కొద్దిరోజుల్లో మరింత ఎక్కువ మందికి ఈ అవకాశం కల్పించనున్నారు. దీని ఫుల్‌ వర్షన్‌ను ఎప్పటికి అందుబాటులోకి తెస్తారన్నది ఇంకా ప్రకటించలేదు. ఫోన్‌ లింక్‌ ఫీచర్‌ బ్లూటూత్‌ ద్వారా ఐఓఎస్‌ పరికరాలను విండోస్‌ పీసీతో అనుసంధానం చేస్తుంది. అందుకేనేమో ప్రస్తుతానికి మామూలు కాల్స్‌, మెసేజ్‌లకే పరిమితం చేశారు. గ్రూప్‌ కాలింగ్‌, మీడియా షేర్‌ సదుపాయం కల్పించలేదు. ఏదేమైనా విండోస్‌ పీసీతో పనిచేస్తూ, అత్యవసరంగా ఐఫోన్‌ ద్వారా కాల్‌ చేసుకోవాలనుకునే వారికి.. మెసేజ్‌లు చూసుకోవాలని కోరుకునేవారికిది బాగా ఉపయోగపడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని