ఆండ్రాయిడ్‌ ఫీచర్లు అదరహో!

ఆండ్రాయిడ్‌ ఫోన్లలో బోలెడన్ని మంచి ఫీచర్లున్నాయి. ఫోన్‌ను మరింత సమర్థంగా వాడుకోవటానికి తోడ్పడే వీటిల్లో కొన్నింటి గురించి చాలామందికి తెలియనే తెలియదు. మామూలు కాల్స్‌, మెసేజ్‌ల వంటి పనులనూ ఇవి ఇంకాస్త సులభం చేస్తాయి.

Published : 08 Mar 2023 00:43 IST

ఆండ్రాయిడ్‌ ఫోన్లలో బోలెడన్ని మంచి ఫీచర్లున్నాయి. ఫోన్‌ను మరింత సమర్థంగా వాడుకోవటానికి తోడ్పడే వీటిల్లో కొన్నింటి గురించి చాలామందికి తెలియనే తెలియదు. మామూలు కాల్స్‌, మెసేజ్‌ల వంటి పనులనూ ఇవి ఇంకాస్త సులభం చేస్తాయి. అలాంటి కొన్ని ఫీచర్లు ఇవిగో..

ఒక చేత్తోనే..

ఏమాటకామాటే చెప్పుకోవాలి. రోజురోజుకీ ఫోన్లు పెద్దగా అవుతున్నాయి. అరచేతిలో పట్టనంతగానూ తయారవుతున్నాయి. రెండు చేతులను ఉపయోగిస్తే గానీ వాడుకోలేం. టిఫిన్‌ చేస్తున్నపుడో, కాఫీ తాగుతున్నప్పుడో ఒక చేత్తోనే ఫోన్‌ను వాడుకోవాలంటే? ఇందుకు ‘వన్‌ హ్యాండ్‌ మోడ్‌’ బాగా ఉపయోగపడుతుంది. ఇది యూజర్‌ ఇంటర్ఫేస్‌ పై అర్ధభాగాన్ని కిందికి జరుపుతుంది. దీంతో నోటిఫికేషన్లు, యాప్‌ కంటెంట్‌ వంటి వాటిని ఒక చేత్తోనే చూసుకోవచ్చు. ఈ ఫీచర్‌ను సెట్‌ చేసుకోవటం ఒకో ఫోన్‌లో ఒకోలా ఉంటుంది. ఆండ్రాయిడ్‌ 12, అంతకన్నా ఎక్కువ వర్షన్‌ ఫోన్లలో సెటింగ్స్‌ యాప్‌ను ఓపెన్‌ చేసి ‘వన్‌ హ్యాండెండ్‌ మోడ్‌’ అని సెర్చ్‌ చేస్తే ఆప్షన్‌ కనిపిస్తుంది. దీన్ని టర్న్‌ ఆన్‌ చేసుకుంటే చాలు.

తెర విభజన

ఒకేసారి ఎక్కువ పనులు చేసేవారికిది ఎంతో మేలు చేస్తుంది. అందరూ రెండు స్మార్ట్‌ఫోన్లు కొనుక్కోలేరుగా. ఎన్ని పనులైనా ఒక్కదాంతో చేయాల్సిందే. ఇలాంటి సమయాల్లోనే స్ప్లిట్‌ స్క్రీన్‌ ఫీచర్‌ తోడు నిలుస్తుంది. దీంతో ఫోన్‌ తెర రెండుగా విడిపోతుంది. ఒక యాప్‌ పైన, మరో యాప్‌ కింద సెట్‌ చేసుకొని ఒకేసారి రెండింటినీ వాడుకోవచ్చు. ఇందుకోసం హోం స్క్రీన్‌ అడుగున ఉండే రీసెంట్‌ యాప్స్‌ గుర్తు మీద క్లిక్‌ చేయాలి. ఈ గుర్తు కొన్ని ఫోన్లలో మూడు నిలువు గీతలుగా, కొన్ని ఫోన్లలో చదరంగా కనిపిస్తుంది. ఇందులో స్ప్లిట్‌ స్క్రీన్‌లో వాడుకోవటానికి వీలుండే యాప్స్‌ ఉంటాయి. రీసెంట్‌ యాప్స్‌ మీద తాకగానే మెనూ కనిపిస్తుంది. ఇందులో స్ప్లిట్‌ స్క్రీన్‌ను ఎంచుకోవాలి. అవసరమైన యాప్‌ను ఎంచుకొని దీనికి జోడిస్తే చాలు. అది పైన కనిపిస్తుంది. కింది తెరలో మరో యాప్‌ను ఓపెన్‌ చేసుకోవచ్చు. పని ముగిశాక ఎగ్జిట్‌ బటన్‌ను నొక్కితే తిరిగి మామూలు తెర కనిపిస్తుంది. స్ప్లిట్‌ స్క్రీన్‌ను సెట్‌ చేసుకోవటం ఆయా ఫోన్లను బట్టీ మారొచ్చు.

తెలివైన తాళం

ఇంట్లో ఉన్నప్పుడు మన ఫోన్‌ను ఇతరులు చూసే అవకాశం తక్కువ. ఇలాంటి సురక్షిత ప్రాంతాల్లో ఫోన్‌ లాక్‌ కాకుండా స్మార్ట్‌ లాక్‌ ఫీచర్‌ ఉపయోగపడుతుంది. ఇది లొకేషన్‌ను తనకు తానే గుర్తించి, అథెంటికేషన్‌ లాక్‌ను తొలగిస్తుంది. దీంతో ఫోన్‌ను చూసుకోవటం తేలికవుతుంది. మాటిమాటికి అన్‌లాక్‌ చేయాల్సిన అవసరముండదు. ఆయా లొకేషన్లు మారగానే తిరిగి సెట్‌ చేసుకున్న లాకింగ్‌ సిస్టమ్‌కు మళ్లుతుంది. సెటింగ్స్‌లోకి వెళ్లి స్మార్ట్‌ లాక్‌ అని టైప్‌ చేస్తే ఫీచర్‌ కనిపిస్తుంది. దీన్ని ఓపెన్‌ చేయటానికి పిన్‌, ప్యాటర్స్‌ లేదా పాస్‌వర్డ్‌ ఎంటర్‌ చేయాలి. తర్వాత మూడు ఆప్షన్లు కనిపిస్తాయి. ఇందులో ట్రస్టెడ్‌ ప్లేసెస్‌ను ఎంచుకుంటే ఆ ప్రాంతాల్లోకి వెళ్లగానే ఫోన్‌ దానంతటదే అన్‌లాక్‌ అవుతుంది. అక్కడ్నుంచి రాగానే లాక్‌ పడుతుంది. ఇందులో ట్రస్టెడ్‌ డివైసెస్‌, ఆన్‌ బాడీ డిటెక్షన్‌ ఆప్షన్లు కూడా ఉంటాయి. అవసరాన్ని బట్టి వీటిని ఎంచుకోవచ్చు.

పదాల అనువాదం

విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడి భాష తెలిసి ఉండటం తప్పనిసరి. లేకపోతే పట్టణాలు, దుకాణాల పేర్లు, వెళ్లే దారి తెలుసుకోవటం కష్టమవుతుంది. చేతిలో ఆండ్రాయిడ్‌ ఫోన్‌ ఉంటే ఇది తేలికే. కెమెరా యాప్‌తో ఫొటో తీస్తే చాలు టెక్స్ట్‌ అంతా అనువాదమైపోతుంది. గూగుల్‌ లెన్స్‌ ఫీచర్‌ గొప్పతనం. ఫోన్‌లో గూగుల్‌ యాప్‌ను ఓపెన్‌ చేసి.. సెర్చ్‌ పట్టీకి కుడివైపున ఉండే కెమెరా గుర్తును ట్యాప్‌ చేయాలి. అడిగిన అనుమతులకు అంగీకరించాలి. అప్పటికే ఫోన్‌లో ఉన్న స్క్రీన్‌ షాట్ల వంటి ఫొటోల్లోని టెక్స్ట్‌ను అనువాదం చేయటానికైతే వాటిని యాప్‌లోకి చేర్చి ట్యాప్‌ చేసి.. పేజీ అడుగున ట్రాన్స్‌లేట్‌ బటన్‌ను తాకితే ఇంగ్లిష్‌లోకి అనువాదమైపోతుంది. అప్పటికప్పుడు అనువదించుకోవాలనుకుంటే- కెమెరా ముందుకు ట్రాన్స్‌లేట్‌ చేయాలనుకునే దాన్ని తీసుకొచ్చి.. ట్రాన్స్‌లేట్‌ బటన్‌ను తాకాలి. అది ఇంగ్లిష్‌లోకి అనువాదమైపోతుంది. కావాలంటే పైన కనిపించే బాక్స్‌ ద్వారా భాషను మార్చుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని