సహారా పూవై పూచెనే...

సహారా అనగానే ఇసుక దిబ్బలే గుర్తుకొస్తాయి. ప్రపంచంలో అతిపెద్ద ఎడారి ఇదే. సుమారు 92 లక్షల కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇసుక దిబ్బలతో మేట వేసుకుపోయిన ఇది అప్పుడప్పుడూ పచ్చగా కళకళలాడుతూ ఉంటుందంటే నమ్ముతారా?

Updated : 20 Sep 2023 22:20 IST

సహారా అనగానే ఇసుక దిబ్బలే గుర్తుకొస్తాయి. ప్రపంచంలో అతిపెద్ద ఎడారి ఇదే. సుమారు 92 లక్షల కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇసుక దిబ్బలతో మేట వేసుకుపోయిన ఇది అప్పుడప్పుడూ పచ్చగా కళకళలాడుతూ ఉంటుందంటే నమ్ముతారా? గత సహస్రాబ్దిలో కొంతకాలం పచ్చటి గడ్డి, నదులు, సరస్సులు, హిప్పోపాటమస్‌ వంటి నీటి జీవులతో కళకళలాడుతూ ఉండేదని తాజా అధ్యయనం ఒకటి పేర్కొంటోంది. ఇలాంటి ‘హరిత దశలు’ ఎప్పుడెప్పుడు, ఎలా ఏర్పడతాయో కూడా వివరిస్తోంది. సూర్యుడి చుట్టూ భూమి తిరగటంలో తలెత్తే మార్పులు దీనికి కారణమని భావిస్తున్నారు. గతంలో అప్పుడప్పుడూ సహారాలో చెట్లు మొలుస్తుండేవని ఇప్పటికే చాలా పరిశోధనలు గట్టిగా చెబుతున్నాయి. ఆఫ్రికా వెలుపల వృక్షాలు పెరగటంలో ‘ఉత్తర ఆఫ్రికా తేమ దశలు’ కీలక పాత్ర పోషించాయని.. తొలి మానవులతో పాటు రకరకాల జీవజాతులు ప్రపంచమంతా విస్తరించటానికి దోహదం చేశాయని పరిశోధకులు భావిస్తుంటారు. అయితే సహారా ఎడారిలో హరిత దశలు ఎలా ఏర్పడ్డాయో తెలియదు. దీన్ని కనుగొనటానికే పరిశోధకులు కంప్యూటర్‌ సిమ్యులేషన్‌ పద్ధతితో అధ్యయనం చేశారు. భూమి తన అక్షం మీద ఊగులాడటంలో మార్పులు సహారా హరిత దశలకు కారణం కావొచ్చని గుర్తించారు. ఈ మార్పులు సుమారు 21వేల సంవత్సరాలకు ఒకసారి తలెత్తుతున్నట్టూ కనుగొన్నారు. భూమి తన అక్షం మీద ఊగిసలాడటంలో తలెత్తే మార్పులతో ఉత్తరార్ధ గోళంలో వేసవి కాలాలు చాలా వేడిగా ఉంటాయి. ఫలితంగా పశ్చిమ ఆఫ్రికా రుతుపవన వ్యవస్థ బలోపేతమవుతుంది. దీంతో సహారాలో వానలు ఎక్కువగా కురుస్తాయి. ఎడారి అంతటా గడ్డి భూముల వంటి వాతావరణం ఏర్పడుతుంది. ఇక్కడ తేమ దశలు మంచు యుగంలో ఏర్పడటం లేదనీ అధ్యయనంలో తేలింది. ఎందుకంటే మంచు యుగంలో చాలావరకు ఎత్తయిన ప్రాంతాల్లో మంచు ఫలకాలు పరచుకుంటాయి. ఇవి వాతావరణాన్ని చల్లబరచి, తేమ దశలను అణచేస్తాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని