పాస్‌వర్డ్‌ మేనేజర్‌ భద్రమేనా?

భద్రత, బ్యాకప్‌ టూల్స్‌గా పాస్‌వర్డ్‌ మేనేజర్స్‌ ఉపయోగపడతాయి. వీటితో పాస్‌వర్డ్‌లను గుర్తుపెట్టుకోవటం, ప్రతీసారీ పాస్‌వర్డ్‌ను టైప్‌ చేయటం తప్పుతాయి. కానీ చాలామంది వీటిని వాడుకోరు. హ్యాకర్లు పాస్‌వర్డ్‌లను దొంగిలించే ప్రమాదముందని భావించటం దీనికి ఒక కారణం. అందువల్ల ఇవి మంచివేనా? అనే అనుమానం కలుగుతుంటుంది.

Updated : 21 Feb 2024 09:18 IST

భద్రత, బ్యాకప్‌ టూల్స్‌గా పాస్‌వర్డ్‌ మేనేజర్స్‌ ఉపయోగపడతాయి. వీటితో పాస్‌వర్డ్‌లను గుర్తుపెట్టుకోవటం, ప్రతీసారీ పాస్‌వర్డ్‌ను టైప్‌ చేయటం తప్పుతాయి. కానీ చాలామంది వీటిని వాడుకోరు. హ్యాకర్లు పాస్‌వర్డ్‌లను దొంగిలించే ప్రమాదముందని భావించటం దీనికి ఒక కారణం. అందువల్ల ఇవి మంచివేనా? అనే అనుమానం కలుగుతుంటుంది.

మాస్టర్‌ పాస్‌వర్డ్‌ సాయంతో పాస్‌వర్డ్‌ మేనేజర్స్‌ డేటాను కాపాడతాయి. అంటే కేవలం ఒక పాస్‌వర్డ్‌ను గుర్తుంచుకుంటే చాలన్నమాట. ఇక్కడే చాలామందికి అనుమానం వస్తుంటుంది. సైబర్‌ నేరగాళ్లు, హ్యాకర్లు మాస్టర్‌ పాస్‌వర్డ్‌ను దొంగిలిస్తే ఖాతాల వివరాలన్నీ తెలిసిపోతాయి కదా అని భావిస్తుంటారు. అయితే అంతగా ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఎందుకంటే ఇలాంటి ప్రమాదం చాలా చాలా తక్కువ. విశ్వసనీయమైన పాస్‌వర్డ్‌ మేనేజర్లన్నీ జీరో-నాలెడ్జ్‌ మీద ఆధారపడి పనిచేస్తాయి. అంటే సర్వీసు ప్రొవైడర్‌తో మాస్టర్‌ పాస్‌వర్డ్‌ను షేర్‌ చేసుకోవన్నమాట. ఒకవేళ సర్వీసు ప్రొవైడర్ల భద్రత వ్యవస్థ కళ్లుగప్పి హ్యాకర్లు వారి సర్వర్లను అదుపులోకి తీసుకున్నా కూడా మాస్టర్‌ పాస్‌వర్డ్‌ను పట్టుకోలేరు. ఇది కేవలం మన వ్యక్తిగత పరికరాల్లోనే ఉంటుంది. లేదూ మన మెదడులో జ్ఞాపకముంటుంది. మరి మనం నిర్ణయించుకున్న  పాస్‌వర్డ్‌లతో కూడిన రిమోట్‌ సర్వర్‌ డేటాబేస్‌ను హ్యాకర్లు గుర్తిస్తే? అయినా ఏమీ కాదు. పాస్‌వర్డ్‌లన్నీ రహస్య సంకేతం (ఎన్‌క్రిప్ట్‌) రూపంలో నిల్వ ఉంటాయి. డీక్రిప్ట్‌ చేస్తే గానీ అవి తెలియవు. జీరో-నాలెడ్జ్‌ విధానం కారణంగా హ్యాకర్లుకు ఇది తెలిసే అవకాశం లేదు. ఇటీవల జరిగిన కొన్ని ఘటనలూ దీన్నే నిరూపిస్తున్నాయి. గత సంవత్సరం ఒక ప్రముఖ పాస్‌వర్డ్‌ మేనేజర్‌ మీద హ్యాకర్లు దాడి చేసి పాస్‌వర్డ్‌లతో పాటు కస్టమర్లకు సంబంధించిన బోలెడంత సమాచారాన్ని దొంగిలించారు. కానీ మాస్టర్‌ పాస్‌వర్డ్‌ తెలియకపోవటం వల్ల డేటాను డీక్రిప్ట్‌ చేయటం సాధ్యం కాలేదు. స్టోర్‌ అయిన వ్యక్తిగత వివరాలన్నీ అలాగే భద్రంగా ఉండటం గమనార్హం. నిజానికి మాస్టర్‌ పాస్‌వర్డ్‌ను ఊహించటమో.. లేదా మనం చెబితే తప్ప హ్యాకర్లు దాన్ని తెలుసుకోలేరు. మనం బలమైన మాస్టర్‌ పాస్‌వర్డ్‌ను నిర్ణయించుకొని, దాన్ని ఎవరికీ చెప్పనంతవరకూ భద్రతకు వచ్చిన ముప్పేమీ లేదు.

మాటిమాటికీ అవసరం లేకుండా..

కొన్నిసార్లు మాటిమాటికీ మాస్టర్‌ పాస్‌వర్డ్‌ను ఎంటర్‌ చేయటమూ చికాకు తెప్పించొచ్చు. దీనికీ పరిష్కారం లేకపోలేదు. మాస్టర్‌ పాస్‌వర్డ్‌ను ఎంటర్‌ చేసే కాల వ్యవధిని నిర్ణయించు కోవచ్చు మరి. గంటలు, రోజులు, వారాల వారీగా దీన్ని నిర్దేశించుకోవచ్చు. అనంతరం ఒకసారి లాగిన్‌ అయితే చాలు. నిర్ణయించుకున్న వ్యవధి లోపు తిరిగి ఎప్పుడు లాగిన్‌ అయినా పాస్‌వర్డ్‌లు వాటంతటవే ఫిల్‌ అవుతాయి. మన అవసరాలను బట్టి ఈ సమయాన్ని నిర్ణయించుకోవచ్చు.

మాస్టర్‌ పాస్‌వర్డ్‌నే మరచిపోతే?

పాస్‌వర్డ్‌ మేనేజర్‌కు మనం నిర్ణయించుకున్న మాస్టర్‌ పాస్‌వర్డ్‌ తెలియదు కదా. మరి మనమే దీన్ని మరచిపోతే? ఇలాంటి సమయాల్లో కొన్ని పాస్‌వర్డ్‌ మేనేజర్లు మన రిక్వెస్ట్‌ మేరకు అక్షరాలు, అంకెలతో కూడిన కోడ్‌ను లేదా క్యూఆర్‌ కోడ్‌ను జనరేట్‌ చేస్తాయి. దీంతో అకౌంట్‌ను అన్‌లాక్‌ చేసుకోవచ్చు. అవసరమైతే ఈ కోడ్‌ను ప్రింట్‌ తీసుకొని, భద్రమైన చోట దాచుకోవచ్చు. కానీ డిజిటల్‌ రూపంలో గానీ ఈమెయిల్‌లో గానీ సేవ్‌ చేసుకోవద్దు. అత్యవసర సమయాల్లో పాస్‌వర్డ్‌ మేనేజర్‌ను వాడుకోవటానికి విశ్వసనీయమైన వ్యక్తులకు యాక్సెస్‌ ఇవ్వచ్చు. కుటుంబ సభ్యులకు, స్నేహితులకు అందుబాటులో లేని చోట ఉన్నప్పుడిది ఉపయోగపడుతుంది. ఆయా వ్యక్తులు రిక్వెస్ట్‌ బటన్‌ను నొక్కితే మన అనుమతి కోరుతూ ఒక మేసేజ్‌ అందుతుంది. అవసరాన్ని బట్టి దీనికి అంగీకరించొచ్చు, తిరస్కరించొచ్చు.

  • అత్యవసర పరిస్థితులు ఎదురయ్యేంతవరకూ ఆగాల్సిన అవసరమేమీ లేదు. విశ్వసనీయమైన వ్యక్తులకు ఎప్పుడైనా యాక్సెస్‌ ఇవ్వచ్చు. చాలా పాస్‌వర్డ్‌ మేనేజర్లు ఒకే సాఫ్ట్‌వేర్‌ను వాడే ఇతరులకూ రహస్య వివరాలను షేర్‌ చేసుకునే సదుపాయం కల్పిస్తాయి. ఆయా సర్వీసుల్లో లాగిన్‌ అయినప్పుడు యూజర్‌నేమ్‌, పాస్‌వర్డ్‌లను చూపించకుండానే లాగిన్‌ కావటానికి వీలు కల్పిస్తాయి. ఈ యాక్సెస్‌ను ఎప్పుడైనా రద్దు చేసుకోవచ్చు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని