ఐఫోన్‌ కిటుకులు

ఐఫోన్‌లో ఎన్నో ఫీచర్లు. తెలియనివి ఎన్నెన్నో. తెలిసినా చప్పున గుర్తుకు రాకపోవచ్చు కూడా. కొత్తగా కొన్నవారైనా, తాజా వర్షన్‌కు అప్‌డేట్‌ చేసుకున్నవారైనా, చాలాకాలం నుంచి వాడుతున్నవారైనా.. వీటి గురించి తెలుసుకుంటే చిటికెలో పనులు పూర్తిచేసుకోవచ్చు.

Updated : 13 Mar 2024 04:17 IST

ఐఫోన్‌లో ఎన్నో ఫీచర్లు. తెలియనివి ఎన్నెన్నో. తెలిసినా చప్పున గుర్తుకు రాకపోవచ్చు కూడా. కొత్తగా కొన్నవారైనా, తాజా వర్షన్‌కు అప్‌డేట్‌ చేసుకున్నవారైనా, చాలాకాలం నుంచి వాడుతున్నవారైనా.. వీటి గురించి తెలుసుకుంటే చిటికెలో పనులు పూర్తిచేసుకోవచ్చు.

 మెయిల్‌ చిట్కాలు

  •  ఐఫోన్‌లో మెయిల్‌లో మెసేజ్‌ను కుడివైపునకు స్వైప్‌ చేస్తే మరిన్ని ఆప్షన్లు కనిపిస్తాయి. అన్‌రీడ్‌ మీద తాకితే చదవని మెయిళ్ల జాబితాలో చేరతాయి. రిమైండ్‌ మీ మీద ట్యాప్‌ చేస్తే తర్వాత ఎప్పుడు చూడాలనుకుంటున్నారో సమయాన్ని నిర్ణయించుకోవచ్చు. అదే ఎడమ వైపునకు మెయిల్‌ను జరిపితే బిన్‌, ఫ్లాగ్‌, మోర్‌ ఆప్షన్లు ప్రత్యక్షమవుతాయి. బిన్‌తో మెయిల్‌ను డిలీట్‌ చేయొచ్చు. ఫ్లాగ్‌తో ఫ్లాగ్‌ మార్కును పెట్టుకోవచ్చు. ఇక మోర్‌లో రిప్లై, ఫార్వర్డ్‌, ఆర్కయివ్‌ వంటివెన్నో ఉంటాయి. ఆయా అవసరాలకు వీటిని వాడుకోవచ్చు.
  •  మీ ఈమెయిల్‌ చిరునామా ఇవ్వకుండా మెయిల్‌ను పంపటానికి తోడ్పడేది హైడ్‌ మై ఈమెయిల్‌ ఫీచర్‌. మెయిల్‌ను పంపటానికి ముందు ఫ్రమ్‌ బాక్సు మీద ట్యాప్‌ చేస్తే సీసీ, బీబీసీ ఆప్షన్లు ఓపెన్‌ అవుతాయి. మరోసారి ఫ్రమ్‌ బాక్సు మీద తాకి హైడ్‌ మై ఈమెయిల్‌ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. ఇది ర్యాండమ్‌ అడ్రస్‌ను సృష్టిస్తుంది. దాన్ని మీ మెయిల్‌ బాక్సుకు ఫార్వర్డ్‌ చేస్తుంది.
  •  మెయిల్‌ను రాశాక వెంటనే కాకుండా నిర్ణీత సమయానికి పంపాలని అనుకుంటే సెండ్‌ బటన్‌ను కాసేపు అలాగే నొక్కి పట్టుకోవాలి. అప్పుడు సెండ్‌ లేటర్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది. దీని మీద తాకి తేదీ, సమయాన్ని నిర్ణయించుకోవచ్చు.
  •  మెయిళ్లను ఫార్మాట్‌ చేసుకోవాలంటే మెసేజ్‌ను టైప్‌ చేసినప్పుడు కీబోర్డు పైన కుడి మూలన ఉండే చెవ్‌రాన్‌ మీద తాకి, తర్వాత ఏఏ గుర్తును ఎంచుకుంటే ఫార్మాట్‌ కంట్రోళ్లు కనిపిస్తాయి.
  •  పొరపాటున మెయిల్‌ లేదా మెసేజ్‌ను పంపించినప్పుడు వాటిని కొద్దిసేపటి తర్వాత ఉపసంహ రించుకోవచ్చు కూడా. ఇందుకోసం మెయిల్‌లో 10 సెకండ్ల వరకూ అన్‌డూ సెండ్‌ ఆప్షన్‌ అందుబాటులో ఉంటుంది. మెయిల్‌ దిగువన ఈ బటన్‌ కనిపిస్తుంది. మెసేజెస్‌లోనైతే రెండు నిమిషాల వరకూ రీకాల్‌ చేసే అవకాశముంటుంది. పంపించిన మెసేజ్‌ మీద కాసేపు అదిమి పడితే అన్‌డూ సెండ్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది.

నోట్స్‌ యాప్‌లో..

నోట్‌లో వెబ్‌ అడ్రస్‌ను జత చేసుకోవచ్చు. అలాగే మరో నోట్‌కు లింక్‌ చేయొచ్చు. రాసిన నోట్‌లో లింక్‌ చేయాలనుకునే చోట వేలితో అదిమి పట్టాలి. మెనూలో చెవ్‌రాన్‌ మీద ట్యాప్‌ చేసి యాడ్‌ లింక్‌ను ఎంచుకోవాలి. వెబ్‌ అడ్రస్‌ను గానీ లింక్‌ చేయాలనుకునే నోట్‌ టైటిల్‌ను గానీ యాడ్‌ చేసుకోవాలి. కావాలనుకుంటే టెక్స్ట్‌ లింక్‌నూ ఎంచుకోవచ్చు.
క్యూఆర్‌ కోడ్‌ను ఓపెన్‌ చేయటానికీ ఐఫోన్‌ ఉపయోగపడుతుంది. కెమెరా యాప్‌ను ఓపెన్‌ చేసి క్యూఆర్‌ కోడ్‌ మీద ఫోకస్‌ చేస్తే.. దాన్ని గుర్తించి, పసుపు గీతల ఫ్రేమ్‌లో అమరుస్తుంది. కోడ్‌ వెబ్‌సైట్‌కు సంబంధించినదైతే తెర మీద దాని చిరునామా కనిపిస్తుంది.

ష్‌.. రహస్యం

విండోస్‌ లేదా ఆండ్రాయిడ్‌ పరికరాల్లో ఫేస్‌టైమ్‌తో కాల్‌ చేయటం సాధ్యం కాదు. కానీ యాపిల్‌ పరికరం నుంచి వచ్చే కాల్‌ను యాక్సెప్ట్‌ చేయొచ్చు. ఇందుకోసం ఐఫోన్‌లో ఫేస్‌టైమ్‌ యాప్‌ను ఓపెన్‌ చేసి క్రియేట్‌ లింక్‌ బటన్‌ ద్వారా లింకును సృష్టించుకోవాలి. దీన్ని ఆండ్రాయిడ్‌ లేదా విండోస్‌ పరికరానికి పంపించుకోవాలి. అవతలివారు గూగుల్‌ క్రోమ్‌లో లింకును ఓపెన్‌ చేసి ఫేస్‌టైమ్‌ కాల్‌ను యాక్సెప్ట్‌ చేస్తే చాలు. నేరుగా వెబ్‌ బ్రౌజర్‌ నుంచే మాట్లాడుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని