జంతువుల రంగుల లోకాన్ని చూపించే కెమెరా

జంతువులు, పక్షులు, తేనెటీగలకు ఈ ప్రపంచం ఏ విధంగా కనిపిస్తుంది? మనం చూసే రంగులు వాటికీ కనిపిస్తాయా? చాలామందికి ఇలాంటి సందేహం వచ్చే ఉంటుంది.

Published : 27 Mar 2024 00:09 IST

జంతువులు, పక్షులు, తేనెటీగలకు ఈ ప్రపంచం ఏ విధంగా కనిపిస్తుంది? మనం చూసే రంగులు వాటికీ కనిపిస్తాయా? చాలామందికి ఇలాంటి సందేహం వచ్చే ఉంటుంది. మరి దీన్ని తెలుసుకోవటమెలా? బ్రిటన్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్‌ ససెక్స్‌, అమెరికాకు చెందిన జార్జ్‌ మాసన్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తల పుణ్యమాని ఇదిప్పుడు సాధ్యమైంది. ప్రత్యేక కెమెరా వ్యవస్థ, సాఫ్ట్‌వేర్‌తో జంతువుల కోణంలో రంగుల దృశ్యాలను చూసే పద్ధతిని ఆవిష్కరించారు.

రంగులను చూసే గుణం జంతువులకు చాలా చాలా ముఖ్యం. ఆహారాన్ని గుర్తించటం, దాడుల నుంచి కాపాడుకోవటం, సమాచార ప్రసారం, సంచారం వంటి పనులకు ఇది తోడ్పడుతుంది. అయితే మనకు కనిపించే అన్ని రంగులనూ జంతువులు చూడలేవు. అలాగే జంతువులు చూసే కొన్ని రంగులను మనమూ చూడలేం. మన కళ్లు ఎరుపు, ఆకుపచ్చ, నీలం కాంతులను మాత్రమే చూడగలవు. వీటితో మిళితమైన రకరకాల వర్ణాలే మనకు కనిపిస్తుంటాయి. అదే చాలా జంతువులు మన దృశ్య పరిధిలో లేని అతినీలలోహిత కాంతి వంటి రంగులనూ చూస్తాయి. మనకు ఈ కాంతి కనిపించదు. తేనెటీగలు, కొన్ని పక్షులు పువ్వుల మీద అతినీలలోహిత కాంతి తీరు ఆధారంగానే మకరందం జాడను గుర్తిస్తాయి. కుక్కలు, ఎలుకల వంటి కొన్ని జంతువులకు ఎరుపు రంగు కనిపించదు. అవి నీలి, పసుపు రంగుల్లో ప్రపంచాన్ని వీక్షిస్తాయి. ఈ నేపథ్యంలో జంతువులు, పక్షులు, తేనెటీగల వంటి జీవులు రంగులను ఎలా గ్రహిస్తాయో అర్థం చేసుకోవటం పర్యావరణం, పరిణామం, ప్రవర్తన వంటి శాస్త్ర రంగాల్లో బాగా ఉపయోగపడుతుంది. డాక్యుమెంటరీలు, కళలు, విద్య వంటి వాటిల్లో జంతువుల గుణగణాలను మరింత కచ్చితంగా పేర్కొనటానికీ వీలుంటుంది.

ఎలా పనిచేస్తుంది?

మన కళ్లు అతినీలలోహిత కాంతిని చూడలేవు కదా. జంతువుల కోణంలో వీడియో తీసినా అదెలా కనిపిస్తుంది? మంచి సందేహమే. ఇందుకోసం శాస్త్రవేత్తలు కొన్ని ప్రత్యామ్నాయ రంగులను ఎంచుకున్నారు. దీన్నే అవాస్తవ వర్ణ దృశ్యం అని పిలుచుకుంటున్నారు. అంటే జంతువులకు కనిపించే రంగులను మనిషి దృశ్య పరిధిలోకి మార్చటం అన్నమాట. అతినీలలోహిత కాంతి నీలంగా, నీలం రంగు  ఆకుపచ్చగా మారి కనిపిస్తుంది. అయితే ఇలాంటి దృశ్యాలను గ్రహించటం అంత తేలికైన పనికాదు. వివిధ ఫిల్టర్లతో ఎన్నో ఫొటోలు తీయాల్సి ఉంటుంది. కదిలే దృశ్యాలను తీయటం అసలు సాధ్యమే కాదు. అతినీలలోహిత కాంతిని వికిరణం చెందించి, దాని గుండా దృశ్య కాంతి ప్రయాణించేలా చేసే ప్రత్యేక బీమ్‌ఫిల్టర్‌ సాయంతో శాస్త్రవేత్తలు ఇలాంటి అడ్డంకులను అధిగమించారు. తరచూ వాడే రెండు కెమెరాలను 3డీ ముద్రిత పెట్టెలో పెట్టి ఒకే సమయంలో అతినీలలోహిత కాంతి, దృశ్య కాంతి రెండింటినీ రికార్డు చేయటంలో విజయం సాధించారు. అనంతరం ఈ రికార్డులను ఒకదాని మీద మరోటి అమర్చి, ఒకో కెమెరా సెన్సర్‌ గ్రహించిన కాంతి మొత్తాన్ని లెక్కించారు. దీని ఆధారంగా జంతువుల కళ్లకు ఎంత కాంతి చేరుకుంటుందో అంచనా వేసి.. కంప్యూటర్‌ సాయంతో రంగులను ప్రక్షేపించి జంతువుల కోణంలో కనిపించే రంగుల దృశ్యాన్ని రూపొందించారు.

కొంగొత్త విషయాలు

వివిధ జంతువులు లోకాన్ని చూసే విధానంతో ఈ కొత్త కెమెరా వ్యవస్థ ప్రకృతిలోని అద్భుతమైన వైవిధ్యాన్ని, రంగుల శోభను కళ్లకు కట్టింది. ఉదాహరణకు- కొన్ని పువ్వులు మీది యూవీ ఆకారాలకు పుప్పొడిని వ్యాపింపజేసే తేనెటీగలు, పక్షుల వంటివి ఆకర్షితమవుతున్నట్టు పరిశోధకులు ప్రదర్శించారు. కొన్ని పువ్వులు జంతువులకు వేర్వేరు రంగుల్లో కనిపిస్తున్నట్టూ నిరూపించారు. అరటికాయలు మనకు ఆకుపచ్చగా కనిపిస్తే పక్షులకు నీలం రంగులో కనిపిస్తుండటం విచిత్రం. కొన్ని కీటకాలు, పక్షులు వర్ణదీప్తి కలిగుండటం విశేషం. సీతాకోకచిలుకలకు యూవీ వర్ణదీప్తి ఉంటే.. హమ్మింగ్‌బర్డ్‌కు ఎరుపు వర్ణదీప్తి ఉంటున్నట్ట వెల్లడైంది. నిజానికి జంతువులు ఈ ప్రపంచాన్ని ఎలా చూస్తాయనేది పూర్తిగా అవగతం కావటం ఎన్నటికీ జరిగే పనికాదు. కానీ జంతువుల కళ్లతో లోకాన్ని చాలావరకూ చూడటానికి ఈ పరిజ్ఞానం తోడ్పడుతుందనటం నిస్సందేహం. ఇది ఆచరణీయం, చవకైనది కావటం గమనార్హం. దీనికి వాడుకున్న సాఫ్ట్‌వేర్‌ ఓపెన్‌ సోర్స్‌ కావటం వల్ల ఎవరైనా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని