అంధులకు దారిచూపు

కొత్త భవనాల్లోకి వెళ్తే కళ్లు కనిపించినా తికమక పడతాం. ఇక చూపు కోల్పోయినవారైతే? ఇలాంటివారికి తోడ్పడే రెండు ప్రయోగాత్మక స్మార్ట్‌ఫోన్‌ యాప్‌లను యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా పరిశోధకులు రూపొందించారు

Published : 28 Feb 2024 00:11 IST

కొత్త భవనాల్లోకి వెళ్తే కళ్లు కనిపించినా తికమక పడతాం. ఇక చూపు కోల్పోయినవారైతే? ఇలాంటివారికి తోడ్పడే రెండు ప్రయోగాత్మక స్మార్ట్‌ఫోన్‌ యాప్‌లను యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా పరిశోధకులు రూపొందించారు. ఇవి ఫోన్‌లో బిల్టిన్‌గా ఉండే మోషన్‌ సెన్సర్లు, కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో పనిచేస్తాయి. మోషన్‌ సెన్సర్లు దారిని పసిగడితే, భవనంలో తిరుగు తున్నప్పుడు కదలికలను ఏఐ రికార్డు చేస్తుంది. మామూలుగా దారిచూపే యాప్‌లు కెమెరాల మీద ఆధారపడతాయి. ఇలాంటి ఫోన్లను చేత్తో పట్టుకునే తిరగాల్సి ఉంటుంది. వీటిని దొంగలెవరైనా దోచుకోవచ్చు. కింద పడిపోతే వెతుక్కోవటం కష్టం కావచ్చు. ఈ కొత్త ఫోన్‌ యాప్‌లతో ఇలాంటి చిక్కులేవీ ఉండవు. జేబులో పెట్టుకున్నా దారిని ‘చూపిస్తాయి’. ఒక యాపేమో స్పేషియల్‌ సెన్సింగ్‌, అప్‌లోడ్‌ చేసిన భవనం మ్యాప్‌ ఆధారంగా ఆయా గదుల్లోకి ఎలా వెళ్లాలో తెలియజేస్తుంది. హెడ్‌ఫోన్‌ లేదా వైబ్రేషన్ల ద్వారా దారి పొడవునా సూచనలు అందజేస్తుంది. రెండో యాప్‌ సైతం ఇలాగే పనిచేస్తుంది. కాకపోతే భవనంలో తిరుగుతున్నప్పుడు మొత్తమంతా రికార్డు చేస్తుంది. దీన్ని వెనక్కి ప్లే చేయటం ద్వారా భవనం నుంచి తేలికగా బయటకు రావటానికి అవసరమైన సూచనలు అందజేస్తుంది. ఈ యాప్‌లను ఇప్పటికే కొందరి మీద పరీక్షించారు కూడా. చాలావరకూ మంచి ఫలితం కనిపించింది. అందువల్ల త్వరలోనే బయటి ప్రపంచానికి పరిచయం చేయాలని పరిశోధకులు భావిస్తున్నారు. దారిచూపటానికి తోడ్పడే ఇలాంటి ఇతర వ్యవస్థల మాదిరిగా ఇవి కాంతి పుంజాలను వెదజల్లవు. భవన యజమానులు కొత్తగా హార్డ్‌వేర్ల వంటివి ఇన్‌స్టాల్‌ చేయాల్సిన అవసరమూ ఉండదు. భవనాల మ్యాప్‌లను అప్‌లోడ్‌ చేస్తే చాలు. అందువల్ల కొత్తగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అన్ని భవనాల ఫొటోలు ఎవరు అప్‌లోడ్‌ చేస్తారని అనుకుంటున్నారేమో. మున్ముందు ఈ ప్రక్రియను ఆటోమేట్‌ చేయటానికి ప్రజలు, సంస్థలు తమ భవనాల మ్యాప్‌లను అప్‌లోడ్‌ చేయటానికీ పరిశోధకులు ఆన్‌లైన్‌ టూల్‌ను రూపొందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని