లెక్కల్లో గూగుల్‌ సాయం

లెక్కలంటే చాలామంది విద్యార్థులకు హడల్‌. ఒకపట్టాన అర్థం కాకపోవటం, తగినంత సాధన చేయకపోవటం వల్ల గణిత సూత్రాలు, నిబంధనలు గుర్తుండవు. దీంతో లెక్కలను చేయటం కష్టమైపోతుంది.

Published : 06 Mar 2024 01:05 IST

లెక్కలంటే చాలామంది విద్యార్థులకు హడల్‌. ఒకపట్టాన అర్థం కాకపోవటం, తగినంత సాధన చేయకపోవటం వల్ల గణిత సూత్రాలు, నిబంధనలు గుర్తుండవు. దీంతో లెక్కలను చేయటం కష్టమైపోతుంది. కానీ నేటి డిజిటల్‌ యుగంలో చింత ఏల? గూగుల్‌ అండ ఉంటే ఎలాంటి లెక్కలనైనా చిటికెలో సాధించేయొచ్చు. ఇప్పుడిది మరింత సులభం కానుంది కూడా. ఎందుకంటే లెక్కల యాప్‌ ‘ఫొటోమ్యాథ్‌’ త్వరలో ఆండ్రాయిడ్‌ ఫోన్లకూ విస్తరించనుంది. లెక్కలను పరిష్కరించటంలో దీనికి మంచి పేరుంది. ఒకాయన తన ముగ్గురు పిల్లలకు లెక్కలను నేర్పటానికి ఫొటోమ్యాథ్‌ యాప్‌ను రూపొందించారు. అనతికాలంలోనే బాగా ఆదరణ పొందింది. ఇప్పటికే ఐఫోన్‌లో లక్షలాది మంది వాడుకుంటున్నారు. దీన్ని గూగుల్‌ సంస్థ కొనటం వల్ల యాప్‌ స్టోర్లలో అధికారికంగా గూగుల్‌ యాప్‌గా అందుబాటులోకి రానుంది. చిన్న చిన్న లెక్కల నుంచి పెద్ద పెద్ద గణనల వరకూ ఇది సులభంగా చేయగలదు. ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ వంటి సబ్జెక్టుల్లో కీలకమైన ఎన్నో భావనలనూ పరిష్కరించగలదు. ఫొటోమ్యాథ్‌ యాప్‌ను వాడుకోవటం చాలా తేలిక. ఫోన్‌ కెమెరా ముందు గణిత సమస్యను పెడితే చాలు. సమస్య అచ్చులో ఉన్నా, చేత్తో రాసిందయినా సరే. మిగతా పనంతా యాప్‌ కృత్రిమ మేధ చేసేస్తుంది. సమస్యను విశ్లేషించి, చిటికెలో అంచెల వారీగా జవాబును చూపిస్తుంది. జవాబులను కాపీ చేసుకోవటం ఒక్కటే కాదు.. ఆయా లెక్కల వెనక ఉన్న విధానాన్ని అర్థం చేసుకోవటానికీ ఇది తోడ్పడుతుంది. పిల్లల హోంవర్కును తనిఖీ చేయటానికీ తల్లిదండ్రులు దీన్ని వాడుకోవచ్చు. ఆఫ్‌లైన్‌లో పనిచేయటం వల్ల వై-ఫై అవసరమూ ఉండదు. అదనపు ఫీచర్లు కావాలంటే ఫొటోమ్యాథ్‌ ప్లస్‌ చందా తీసుకోవాల్సి ఉంటుంది. టెక్స్ట్‌బుక్‌ సొల్యూషన్లు, కదిలే బొమ్మల రూపంలో వివరణ, మరింత సోదాహరణ విశ్లేషణల వంటి ఫీచర్లను వాడుకోవచ్చు.  

ఎలా ఉపయోగించుకోవాలి?

  •  యాప్‌ స్టోర్‌ నుంచి ఫొటోమ్యాథ్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని, ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. అప్పటికే ఇన్‌స్టాల్‌ చేసి ఉంటే అప్‌డేట్‌ చేసుకోవాలి.
  • యాప్‌ను ఓపెన్‌ చేసి, అవసరమైన అనుమతులన్నీ ఇవ్వాలి.
  • గణిత సమస్యను ఫోన్‌ కెమెరా ముందు పెట్టాలి.
  • మార్క్‌ చేసిన ఫ్రేమ్‌లో సమస్య ఫిట్‌ అయ్యేలా చేయాలి.
  •  కింద ఉండే ఎర్రటి వృత్తం మీద క్లిక్‌ చేయాలి.
  •  తక్షణం జవాబు ప్రత్యక్షమవుతుంది. ఒకవేళ ఆ జవాబు ఎలా వచ్చిందో తెలుసుకోవాలంటే కింద కనిపించే ‘షో సాల్వింగ్‌ స్టెప్స్‌’ మీద క్లిక్‌ చేయాలి. అప్పడు స్టెప్స్‌ అన్నీ కనిపిస్తాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని