డ్యూగూ.. సూర్యుడికే అన్న!

డ్యూగూ గ్రహ శకలం సూర్యుడి కన్నా ముందే పుట్టిందా? దీని నమూనాల ప్రాథమిక విశ్లేషణలో ఈ విషయమే వెల్లడైంది. ఇప్పుడిదే ఆశ్చర్యం కలిగిస్తోంది.

Updated : 13 Mar 2024 06:40 IST

డ్యూగూ గ్రహ శకలం సూర్యుడి కన్నా ముందే పుట్టిందా? దీని నమూనాల ప్రాథమిక విశ్లేషణలో ఈ విషయమే వెల్లడైంది. ఇప్పుడిదే ఆశ్చర్యం కలిగిస్తోంది.

జపాన్‌కు చెందిన అంతరిక్ష సంస్థ 2018లో డ్యూగూ వద్దకు హయబుస 2 వ్యోమనౌకను ప్రయోగించింది. ఇది దాని ఉపరితలం నమూనాలను సంగ్రహించి, భూమికి పంపించింది. అవి రెండేళ్ల తర్వాత ఆస్ట్రేలియాలోని ఓ ఎడారిలో పడ్డాయి. కార్బన్‌తో నిండిన అత్యంత ప్రాచీన గ్రహ శకల నమూనాలను సంగ్రహించటం ఇదే తొలిసారి. ప్రాథమిక విశ్లేషణలో డ్యూగూ వయసు సూర్యుడి కన్నా ఎక్కువేనని తేలటం విచిత్రం! దీనిలోని కర్బన, సేంద్రియ పదార్థాలు మునుపెన్నడూ అధిక ఉష్ణోగ్రతలకు గురికాకపోవటం గమనార్హం. అంటే సౌర వ్యవస్థ శివారులో.. కనీసం గురుడి కక్ష్యకు ఆవల డ్యూగూ ఏర్పడిందన్నమాట. అది ఏమాత్రం లోపలికి ఉన్నా సూర్యుడు ఏర్పడే తొలినాళ్లలో ఆ వేడికి కరిగిపోయి ఉండేది. దాని రసాయన స్వరూపం మారిపోయి ఉండేది. డ్యూగూ రసాయన విశ్లేషణలో తేలిన మరో విచిత్రం నీటి ఆనవాళ్లు. ఒకప్పుడు దీనిలో బోలెడంత మంచు ఉండేదనటానికిది నిదర్శనం. ఇదీ సూర్యుడి కన్నా ముందే పుట్టిందనే విషయాన్ని తెలియజేస్తోంది. ఒకవేళ సూర్యుడికి సమీపంలో ఏర్పడినట్టయితే మంచంతా ఆవిరయ్యుండేది. నిజానికి డ్యూగూ వంటి గ్రహ శకలాలు సూర్యుడికి చాలా దూరంలో ఏర్పడి ఉండొచ్చని శాస్త్రవేత్తలు చాలాకాలంగా అనుమానిస్తున్నారు. కానీ ఇప్పటివరకూ రుజువు చేయటం సాధ్యం కాలేదు. ఎందుకంటే గ్రహ శకలానికి సంబంధించిన పదార్థాలు భూమికి చేరుకునే క్రమంలో గంటకు లక్షలాది కిలోమీటర్ల వేగంతో వాతావరణం నుంచి దూసుకు రావాల్సి ఉంటుంది. ఆ ఘర్షణకు గ్రహశకలాల అసలు స్వరూపం పూర్తిగా మారిపోతుంది. డ్యూగూ నమూనాలను అంతరిక్షం నుంచే సంగ్రహించటం వల్ల వాస్తవ చిత్రాన్ని తెలుసుకోవటానికి వీలవుతోంది.

 ఎలా ఏర్పడింది?

సూర్యుడిలో అణు సంయోజనం జరగటానికి, నక్షత్రంగా ఏర్పడటానికి ముందు చుట్టుపక్కల తిరిగే పదార్థాలతో డ్యూగూ వంటి కర్బనంతో నిండిన గ్రహశకలాలు ఏర్పడ్డాయని చెప్పుకోవచ్చు. నిజానికి గ్రహాల కన్నా ముందే డ్యూగూ ఏర్పడి ఉండొచ్చు కూడా. ఆ వెంటనే గురుడు లేదా శని గ్రహం గురుత్వాకర్షణ తాకిడితో ఆస్టరాయిడ్‌ బెల్ట్‌లోకి చేరుకుంది. కోట్లాది ఏళ్లుగా అక్కడే ఉండిపోయింది.

ఉపయోగమేంటి?

సౌర వ్యవస్థ చరిత్ర, దాని తీరుతెన్నులు, జీవం పుట్టుకకు మూలం వంటి ఎన్నో విషయాలను తెలుసుకోవటానికి డ్యూగూ నమూనాలు తోడ్పడొచ్చు. అదెలాగంటే?

  • ప్రాచీన పదార్థాలు: సౌర వ్యవస్థలో అత్యంత ప్రాచీన పదార్థాలు డ్యూగూలో ఉన్నాయి. అవి 460 కోట్ల ఏళ్ల క్రితం సౌర వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచీ మారకుండా అలాగే ఉండటం గమనార్హం. వీటి విశ్లేషణతో గతానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు.
  •  గ్రహాల ఏర్పాటు: సౌర వ్యవస్థ ఎలా రూపుదిద్దుకుంది? గ్రహాలు ఎలా ఏర్పడ్డాయి? అనేవి అర్థం చేసుకోవటానికీ డ్యూగూ నమూనాలు ఉపయోగపడగలవు. గ్రహ శకలం భౌతిక ధర్మాలు, పదార్థ సమ్మేళనాల ఆధారంగా వీటిని పసిగట్టొచ్చు.
  •  కర్బన సమ్మేళనాలు: ప్రాణుల పుట్టుకకు మూలమైన కర్బన సమ్మేళనాలు డ్యూగూలో ఉన్నాయి. వీటిపై అధ్యయనం చేయటం ద్వారా భూమ్మీద జీవం ఎలా పుట్టిందో అర్థం కావొచ్చు. విశ్వంలో ఇతర చోట్ల జీవులుండే అవకాశముందేమో తెలుసుకోవచ్చు.
  • అంతరిక్ష వాతావరణం: డ్యూగూ ఉపరితలం సౌర గాలులు, విశ్వ కిరణాల వంటి అంతరిక్ష వాతావరణ ప్రభావానికి గురైంది. దీని నమూనాల విశ్లేషణతో గ్రహ శకలాల మీద, సౌరవ్యవస్థలో గాలిలేని వస్తువుల మీద అంతరిక్ష వాతావరణం ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుస్తుంది.
  •  భవిష్యత్‌ ప్రయోగాలు: నీరు, ఖనిజాల వంటి వాటి కోసం గ్రహశకలాలను తవ్వటం ఉపయుక్తమేనా? కాదా? అనేవి తెలుసుకోవటానికీ డ్యూగూ నమూనాల విశ్లేషణ తోడ్పడుతుంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని