అశ్లీల బెదిరింపుల వలలో పడకుండా

ఆన్‌లైన్‌లో నగ్న చిత్రాలు, వీడియోలతో బెదిరించటాన్ని అడ్డుకోవటానికి ఇన్‌స్టాగ్రామ్‌ కొత్తగా న్యూడిటీ ప్రొటెక్షన్‌ ఫీచర్‌ను ప్రవేశపెట్టనుంది. ఇన్‌స్టాగ్రామ్‌ డీఎంలలో ఉండే ఈ ఫీచర్‌ దానంతటదే నగ్న చిత్రాలను పసిగడుతుంది.

Published : 17 Apr 2024 00:19 IST

న్‌లైన్‌లో నగ్న చిత్రాలు, వీడియోలతో బెదిరించటాన్ని అడ్డుకోవటానికి ఇన్‌స్టాగ్రామ్‌ కొత్తగా న్యూడిటీ ప్రొటెక్షన్‌ ఫీచర్‌ను ప్రవేశపెట్టనుంది. ఇన్‌స్టాగ్రామ్‌ డీఎంలలో ఉండే ఈ ఫీచర్‌ దానంతటదే నగ్న చిత్రాలను పసిగడుతుంది. నగ్న చిత్రాలను షేర్‌ చేయటానికి ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకునేలా చేస్తుంది. ఇది మెషిన్‌ లెర్నింగ్‌ సాయంతో ఇన్‌స్టాగ్రామ్‌ డీఎంల ద్వారా పంపే నగ్న చిత్రాలను విశ్లేషిస్తుంది. ఈ ఫీచర్‌ పరికరంలోనే ఫొటోలను విశ్లేషిస్తుంది. ఎవరికైనా రిపోర్టు చేస్తే తప్ప ఇన్‌స్టాగ్రామ్‌ను నిర్వహించే మెటా కంపెనీ సైతం వీటిని యాక్సెస్‌ చేయలేదు. మాయోపాయాలతో ఆన్‌లైన్‌లో నగ్న చిత్రాలను సేకరించి, డబ్బులు ఇవ్వకుంటే వాటిని కుటుంబ సభ్యులకు, మిత్రులకు చూపిస్తామనే మోసాలు ఇటీవల ఎక్కువవుతున్నాయి. ఇలాంటి వాటి బారినపడకుండా చూసుకోవటానికి ఈ కొత్త ఫీచర్‌ ఉపయోగపడుతుంది. పద్దెనిమిదేళ్ల లోపు వయసువారి ఇన్‌స్టాగ్రామ్‌ యాప్‌లో ఇది డిఫాల్ట్‌గానే ఆన్‌ అయ్యింటుంది. పెద్దవారైతే ఆన్‌ చేసుకోవాలని నోటిఫికేషన్‌ రూపంలో ప్రోత్సహిస్తుంది. దీన్ని ఆన్‌ చేసుకున్నాక ఎవరైనా నగ్న చిత్రాలను పంపిస్తుంటే అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తుంది. ఒకవేళ మనసు మార్చుకుంటే అన్‌సెండ్‌ చేసుకునే సదుపాయమూ ఉంటుంది. అసభ్య ఫొటోలను పంపిస్తున్నప్పుడు మెటా సేఫ్టీ టిప్స్‌లోకి వెళ్లేలా చేస్తుంది కూడా. ఎవరైనా వాటిని స్క్రీన్‌షాట్‌ తీయొచ్చని, ఫార్వర్డ్‌ చేయొచ్చని గుర్తుచేస్తుంది. లేదూ ఫొటోలు, వీడియోలను అందుకున్నవారితో మున్ముందు సంబంధాలు మారే అవకాశముందనీ హితవు చెబుతుంది. డీఎంలలో అవాంఛిత నగ్న చిత్రాలను మసకగా చేయటం, వార్నింగ్‌ స్క్రీన్‌ కింద పెట్టటం ద్వారా వాటిని చూడకుండా కూడా ఈ ఫీచర్‌ అడ్డుకుంటుంది. వాటికి స్పందించొద్దని చెప్పటంతో పాటు పంపినవారిని బ్లాక్‌ చేసుకోవటానికీ వీలు కల్పిస్తుంది. కావాలనుకుంటే రిపోర్టు కూడా చేయొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని