రోడ్డు గుంతలను పూడ్చే రోబో

గుంతలు లేని రోడ్లను ఒకసారి తలచుకోండి. ఆ ప్రయాణం ఎంత హాయిగా ఉంటుందో! ఊహించుకుంటేనే ఎంత సంతోషం కలుగుతుందో కదా. అదే నిజమైతే? అది సాకారం కావటం మరెంతో దూరంలో లేదు.

Published : 17 Apr 2024 00:20 IST

గుంతలు లేని రోడ్లను ఒకసారి తలచుకోండి. ఆ ప్రయాణం ఎంత హాయిగా ఉంటుందో! ఊహించుకుంటేనే ఎంత సంతోషం కలుగుతుందో కదా. అదే నిజమైతే? అది సాకారం కావటం మరెంతో దూరంలో లేదు. అధునాతన రోడ్డు నిర్వహణ టెక్నాలజీలు దీన్ని నిజం చేయనున్నాయి. కొన్ని కంపెనీలు ఇందుకోసం ప్రత్యేకించి కృషి చేస్తున్నాయి. ఉదాహరణకు- రోబోటిజ్‌3డీ అనే కంపెనీయే తీసుకోండి. ఇది అటనమస్‌ రోడ్‌ రిపేర్‌ సిస్టమ్‌ (ఏఆర్‌ఆర్‌ఈఎస్‌) అనే వినూత్న టెక్నాలజీని రూపొందించింది. దీనిలోని కొత్త విభాగాల్లో ఒకటి ఏఆర్‌ఆర్‌ఈఎస్‌ ఐ. పేరుకు తగ్గట్టే ఇది రోడ్లను పరిశీలిస్తుంది. వాటి నాణ్యత మీదా నిరంతరం నిఘా వేస్తుంది. వేర్వేరు వాహనాలకు అమర్చటానికి వీలుగా ఉండే ఇది రోడ్లను నిశితంగా స్కాన్‌ చేస్తుంది. ఉపరతలంలో చిన్న చిన్న పగుళ్ల దగ్గరి నుంచి పెద్ద పెద్ద గుంతల వరకూ అన్నింటినీ చిత్రీకరిస్తుంది. ఆ సమాచారాన్ని కేంద్ర విభాగానికి చేరవేస్తుంది. ఏఆర్‌ఆర్‌ఈఎస్‌ వ్యవస్థలో మరో కీలకమైన అంశం ప్రివెంట్‌ అనే ఏఐ ఆధారిత రోబో. ఇది తనకు తానే లేదా రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా ఆదేశాలను అందుకుంటూ రోడ్ల మీద తిరుగుతుంది. ముందు జాగ్రత్తగా చిన్న పగుళ్లను వెంటనే పూడుస్తుంది. అవి పెద్ద గుంతలుగా మారకుండా చూస్తుంది. రోడ్లు నునుపుగా ఉండేలా, ఎక్కువ కాలం మన్నేలా చేస్తుంది. మరి పెద్ద గుంతల సంగతేంటి? ఇందుకోసం ఏఆర్‌ఆర్‌ఈఎస్‌ అల్ట్రా అనే మరో అధునాతన మరమ్మతు వ్యవస్థనూ కంపెనీ రూపొందిస్తోంది. ఇలాంటి కొత్త కొత్త పరిజ్ఞానాల రూపకల్పన ఊపందుకుంటే, విస్తృతంగా అందుబాటులోకి వస్తే మున్ముందు ఎగుడు దిగుడు రోడ్ల మీద కుదుపుల ప్రయాణాలకు కాలం చెల్లినట్టే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని