జీపీటీ దృష్టి!

టెక్నాలజీ రంగంలో ఇప్పుడు ఛాట్‌జీపీటీ పేరు మార్మోగుతోంది. ఆరంభమైనప్పటి నుంచే సంచలనాలు సృష్టిస్తోంది. రోజురోజుకీ కొత్త పోకడలు పోతోంది. ఆన్‌లైన్‌లో టెక్స్ట్‌ను సంగ్రహించి, మథించటంతోనే ఆగిపోలేదు.

Updated : 17 Apr 2024 00:39 IST

టెక్నాలజీ రంగంలో ఇప్పుడు ఛాట్‌జీపీటీ పేరు మార్మోగుతోంది. ఆరంభమైనప్పటి నుంచే సంచలనాలు సృష్టిస్తోంది. రోజురోజుకీ కొత్త పోకడలు పోతోంది. ఆన్‌లైన్‌లో టెక్స్ట్‌ను సంగ్రహించి, మథించటంతోనే ఆగిపోలేదు. డాల్‌-4 సమ్మేళనంతో మాటల ఆధారంగా ఇమేజ్‌లను సృష్టించటాన్నీ నేర్చుకుంది. ఇది చాలదన్నట్టు జీపీటీ-4 విజన్‌ రాకతో పుస్తకాలు, కరపత్రాల ఇమేజ్‌లను అవగతం చేసుకునే స్థితికీ చేరుకుంది. ఇది పురాతన గ్రంథాలు, శాసనాల లిపులనూ తేలికగా, త్వరగా అర్థం చేసుకోవటానికి తోడ్పడుతోంది. దీంతో ఎంతో సమయం, శ్రమ ఆదా అవుతాయి. ఇంతకీ జీపీటీ-4 వెనకాల ఉన్న పరిజ్ఞానమేంటి? ఇదెలా పనిచేస్తుంది?

విజన్‌తో కూడిన జీపీటీ-4 అనేది ఇమేజ్‌ల ఇన్‌పుట్‌ ఆధారంగా, వాటిలోని అంశాలను విశ్లేషించే పరిజ్ఞానం. దీన్ని ముద్దుగా జీపీటీ-4వీ అనీ పిలుచుకుంటున్నారు. ఛాట్‌జీపీటీకి మెదడులాంటి లార్జ్‌ లాంగ్వేజ్‌ మోడళ్ల (ఎల్‌ఎల్‌ఎం)కు ఇలా ఇమేజ్‌ ఇన్‌పుట్‌ వంటి అదనపు విధానాలను జోడించటమనేది కృత్రిమ మేధ (ఏఐ) పరిశోధన, అభివృద్ధిలో ఒక మైలురాయిగా భావించొచ్చు. బహుళ విధ ఛాట్‌బాట్‌.. అంటే టెక్స్ట్‌, ఇమేజ్‌, ఆడియోలతో కూడిన మల్టీమోడల్‌ ఛాట్‌బాట్‌ రూపకల్పన దిశగా దీన్ని గొప్ప ముందడుగుగా భావిస్తున్నారు. ఇమేజ్‌ను ఇన్‌పుట్‌గా ఇచ్చి, దాని మీద ప్రశ్నలు అడగటానికిది వీలు కల్పిస్తుంది. ఒక రకంగా దీన్ని ‘దృశ్య-ప్రశ్న, సమాధాన’ ప్రక్రియ అనుకోవచ్చు. జీపీటీ-4 విజన్‌ వినూత్న లార్జ్‌ మల్టీమోడల్‌ మోడల్‌ (ఎల్‌ఎల్‌ఎం) కాబట్టే టెక్స్‌, ఇమేజ్‌ లేదా టెక్స్ట్‌, ఆడియో వంటి వివిధ విధానాలతో సమాచారాన్ని తీసుకుంటుంది. వాటి ఆధారంగా ప్రతిస్పందనలను సృష్టిస్తుంది. నిజానికి ఇదేమీ తొలి ఎల్‌ఎల్‌ఎం కాదు. ఇప్పటికే ఇలాంటివి చాలానే ఉన్నాయి. కాగ్‌వీఎల్‌ఎం, ఎల్‌ఎల్‌ఏవీఏ, కాస్మోస్‌-2 వంటివి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. అయితే జీపీటీ-4 విజన్‌ రాకతో కొత్త సంచలనం మొదలు కావటం మాత్రం నిజం.

సామర్థ్యాలు ఏంటి?

ఫొటోలు, స్క్రీన్‌షాట్లు, డాక్యుమెంట్ల వంటి విజువల్‌ కంటెంట్‌ను విడమరచుకునే సామర్థ్యాలు జీపీటీ-4 విజన్‌ ప్రత్యేకత. తాజా వర్షన్‌ అయితే ఇమేజ్‌లోని వస్తువులనూ గుర్తిస్తుండటం గమనార్హం. గ్రాఫ్స్‌, ఛార్ట్స్‌ వంటి వాటిల్లోని సమాచారాన్ని అంచనా వేసి, విశ్లేషించగలదు కూడా. ఇమేజెస్‌లో ఉన్న చేతిరాత, ముద్రిత టెక్స్ట్‌నూ అంచనా వేయగలదు. కృత్రిమ మేధ పరిజ్ఞానం విషయంలో ఇదో గొప్ప మేలి మలుపు. దృశ్యాలను అర్థం చేసుకోవటం, వాటిల్లోని అంశాలను పదాల రూపంలో విశ్లేషించటం మధ్య ఇప్పటివరకూ ఉన్న ఖాళీని ఇది పూరించగలదు.

ఎంతో మేలు

పరిశోధకులకు, వెబ్‌ డెవలపర్లకు, డేటా అనలిస్టులకు, కంటెంట్‌ క్రియేటర్లకు జీపీటీ-4 విజన్‌ ఎంతగానో ఉపయోగపడగలదు. సాహిత్య పరిశోధనలో.. ముఖ్యంగా చారిత్రక డాక్యుమెంట్లు, రాత ప్రతులను అర్థం చేసుకోవటానికి దోహదం చేస్తుంది. చేత్తో రాసిన చారిత్రక డాక్యుమెంట్లు, శాసనాల వంటి వాటిని చదవటం, అర్థం చేసుకోవటం అంత తేలికైన పనికాదు. ఇందుకు చాలా సమయం పడుతుంది కూడా. అదే జీపీటీ-4 విజన్‌ అయితే సెకండ్లలోనే పని పూర్తి చేస్తుంది. మరింత కచ్చితత్వాన్ని సాధించేందుకు ఫలితాలను ఎన్నిసార్లయినా రిఫైన్‌ చేసుకోవచ్చు. అలాగే వెబ్‌ డెవలపర్లకూ ఎంతగానో సాయం చేస్తుంది. కేవలం డిజైన్‌ ఇమేజ్‌తోనే వెబ్‌సైట్‌ కోసం కోడ్‌ను రాసేయగలదు. కాగితం మీద గీసిన డిజైన్‌ ఇమేజ్‌నూ ఇన్‌పుట్‌గా తీసుకొని, కోడ్‌ రాయగలదు. డేటాను అంచనా వేయటం మరో ముఖ్యమైన పని. గ్రాఫ్స్‌లోని సమాచారాన్ని విశ్లేషించటమంటే చిన్న విషయం కాదు మరి. జీపీటీ-4 విజన్‌ను ఇప్పుడు డాల్‌-ఇతోనూ మేళవించాలనీ చూస్తున్నారు. అప్పుడు సోషల్‌ మీడియా కోసం సృజనాత్మక పోస్టులను సృష్టించటమూ సాధ్యమవుతుది. ఇది కంటెంట్‌ క్రియేటర్లకు ఎంతో అనువుగా ఉంటుంది.

పరిమితులు లేకపోలేదు

కచ్చితత్వం, విశ్వసనీయత విషయంలో జీపీటీ-4 విజన్‌ గొప్పదే కావొచ్చు గానీ అన్నిసార్లూ దోష రహితం కాకపోవచ్చు. ఇదీ కొన్ని తప్పులు చేయొచ్చు. అందువల్ల దీని ద్వారా తీసుకున్న సమాచారాన్ని ధ్రువీకరించుకోవటం మంచిది. కొన్ని విషయాల్లో పక్షపాతమూ చూపించొచ్చు. ఇమేజ్‌ల్లో ఉన్న కొందరు వ్యక్తులను వదిలేసేలా దీని మోడల్‌కు శిక్షణ ఇచ్చారు. దీన్నే ఓపెన్‌ ఏఐ సంస్థ ‘రిఫ్యూజల్‌’ ప్రవర్తనగా చెబుతోంది. కొన్ని పరిమితులు, అసంగతాలు ఉండటం వల్ల కచ్చితమైన శాస్త్రీయ, వైద్య సున్నిత అంశాల విశ్లేషణ వంటి పనులకు జీపీటీ-4 విజన్‌ను వాడుకోవద్దనీ సూచిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని