Dynamic Island: ఆండ్రాయిడ్ ఫోన్‌లో డైనమిక్‌ ఐలాండ్‌ ఫీచర్‌.. ఎలా ఎనేబుల్ చేయాలంటే?

ఐఫోన్‌ 14 ప్రోలోని డైనమిక్‌ ఐలాండ్‌ (Dynamic Island) ఫీచర్‌ను ఆండ్రాయిడ్ ఫోన్లలో ఎలా ఎనేబుల్ చేయాలో చూద్దాం..

Updated : 29 Oct 2023 10:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐఫోన్‌ 14 (iPhone 14) సిరీస్‌ విడుదలైనప్పటి నుంచి ధర, ఫీచర్లు గురించి చర్చ జరుగుతోంది. ధర ఎక్కువైనా అమ్మకాల్లో జోరు తగ్గలేదని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. వీటితోపాటు ఐఫోన్‌ 14 ప్రోలోని డైనమిక్‌ ఐలాండ్‌ (Dynamic Island) ఫీచర్‌ గురించి నెట్టింట్లో విపరీతమైన చర్చ మొదలైంది. ఐఫోన్‌ 14 ప్రో (iPhone 14 Pro), ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌ (iPhone 14 Pro Max) మోడల్స్‌లో మాత్రమే ఈ ఫీచర్‌ ఉంది. దీంతో ఇతర ఐఫోన్ మోడల్స్‌లో ఈ ఫీచర్‌ ఎందుకు లేదనే వాదన మొదలైంది. మరోవైపు డైనమిక్ ఐలాండ్‌ ఫీచర్‌ను ఆండ్రాయిడ్ (Android) యూజర్లు కూడా ఉపయోగించుకునే వెసులుబాటు ఉందని టెక్‌ వర్గాలు తెలిపాయి. మరి, డైనమిక్‌ ఐలాండ్‌ ఫీచర్‌ ఎలా పనిచేస్తుంది? ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఈ ఫీచర్‌ను ఎలా ఎనేబుల్ చేయాలనే సమాచారంపై  ఓ లుక్కేద్దామా..


డైనమిక్ ఐలాండ్‌

యాపిల్‌ (Apple) కంపెనీ ఐఫోన్‌లో టాప్‌నాచ్ డిస్‌ప్లేను ఇస్తోంది. సెల్ఫీ కెమెరా, హియరింగ్ స్పీకర్‌ కోసం ఈ తరహాలో డిజైన్‌ చేసింది. ఐఫోన్ 14 విడుదలకు ముందు పంచ్‌హోల్ లేదా అండర్‌ డిస్‌ప్లే కెమెరాతో స్క్రీన్‌ ఉంటుందనే ఊహాగానాలు వెలువడ్డాయి. టెక్ వర్గాల అంచనాలకు భిన్నంగా యాపిల్‌ టాప్‌నాచ్‌ డిస్‌ప్లే ఇచ్చింది. కానీ, టాప్‌నాచ్‌కు, ఫోన్‌ ఫ్రేమ్‌కు మధ్య డిస్‌ప్లే ఇస్తూ కొత్తగా స్క్రీన్‌ను డిజైన్‌ చేసింది. దాంతోపాటు టాప్‌నాచ్‌కు అదనపు ఫీచర్లను జోడించింది. నోటిఫికేషన్లు, కాల్స్‌ లేదా ఏవైనా అలర్ట్‌ మెసేజ్‌లు వచ్చినప్పుడు టాప్‌నాచ్‌ సైజ్‌ సాధారణ స్థాయి నుంచి యూజర్‌ దృష్టిని ఆకర్షించేలా పెద్దగా మారుతుంది. దానిపై టాప్‌ చేసి యూజర్‌ ఆయా సర్వీసులను యాక్సెస్‌ చేయొచ్చు.

డైనమిక్‌ ఫీచర్‌ను ఐఫోన్‌ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌ మోడల్స్‌లోనే ఇస్తుండటం, యూజర్లకు ఈ ఫీచర్‌ బాగా నచ్చడంతో ఇతర యాపిల్ యూజర్లతోపాటు, ఆండ్రాయిడ్ యూజర్లు సైతం ఈ ఫీచర్ తమకు కావాలని కోరుతున్నారు. ఇది యాపిల్ తీసుకొచ్చిన ఫీచర్‌ కావడంతో ఆండ్రాయిడ్ యూజర్లకు ఈ ఫీచర్‌ అందుబాటులో ఉండదని భావించారు. కానీ, ఆండ్రాయిడ్ యూజర్లు సైతం డైనమిక్‌ ఐలాండ్‌ను ఉపయోగించుకునేలా ప్లేస్టోర్‌లో యాప్‌ అందుబాటులో ఉంది. 


ఆండ్రాయిడ్‌లో డైనమిక్‌ ఐలాండ్‌ 

  • ఈ ఫీచర్‌ కోసం ఆండ్రాయిడ్‌ యూజర్లు ప్లేస్టోర్‌ నుంచి డైనమిక్‌ స్పాట్‌ (Dynamic Spot) అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. 
  • ఇన్‌స్టాలేషన్‌ పూర్తయ్యాక, యాప్ ఓపెన్ చేసి నెక్ట్స్‌ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే, యాప్‌ అనుమతులు కోరుతూ జాబితాను చూపిస్తుంది.
  • మీరు ఏయే యాప్‌ నోటిఫికేషన్లు చూడాలనుకుంటున్నారో వాటికి అనుమతులు ఇచ్చి ‘డన్‌’ బటన్‌పై క్లిక్ చేయాలి. 
  • తర్వాత ఫోన్‌ సెట్టింగ్స్‌ ఓపెన్ చేసి పాప్-అప్‌ సెట్టింగ్స్‌లో టాప్‌నాచ్‌లో డైనమిక్‌ ఐలాండ్ ఫీచర్‌ నోటిఫికేషన్లు ఎలా చూపించాలనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ప్రక్రియ పూర్తయితే  ఫీచర్‌ ఆండ్రాయిడ్ ఫోన్‌లో పనిచేయడం ప్రారంభిస్తుంది. 
  • ఈ యాప్‌ ఉచిత, సబ్‌స్క్రిప్షన్‌ వెర్షన్లలో అందుబాటులో ఉంది. యాప్‌లో అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు కావాలంటే మాత్రం ₹ 99తో సబ్‌స్క్రైబ్‌ చేసుకోవాల్సిందే. 

Note: ప్రస్తుతం ఈ యాప్‌ ఎర్లీ యాక్సెస్‌ (Early Access) వెర్షన్‌లో అందుబాటులో ఉంది. కాబట్టి, యూజర్లు యాప్‌ను వినియోగించే సమయంలో కొన్ని టెక్నికల్‌ బగ్స్‌ వచ్చే అవకాశం ఉంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని