Jio 5G Phone: జియో ‘గంగా’నా.. ‘హోలీ’నా? ఫీచర్లు మారలేదు, పేర్లు మారాయి!

రిలయన్స్‌ జియో త్వరలో 5జీ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేయనుంది. గతంలో ఈ ఫోన్‌ పేరు గంగా అని వార్తలు వెలువడ్డాయి. తాజాగా హోలీ అనే పేరు వినిపిస్తుంది. 

Published : 09 Dec 2022 20:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్‌ జియో మరో సంచలనానికి సిద్ధమైంది. త్వరలో బడ్జెట్‌ ధరలో 5జీ ఫోన్‌ను తీసుకురానుంది. గతేడాది తక్కువ ధరకు జియో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసిన జియో, ఈ ఏడాది అక్టోబరులో జియో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాగా బడ్జెట్‌ ధరకే 5జీ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఈ మేరకు జియో 5జీ ఫోన్‌ గీక్‌బెంచ్‌ లిస్టింగ్‌ (ఫోన్‌ పనితీరును విశ్లేషించి స్కోరింగ్ ఇచ్చే సంస్థ)కు వచ్చినట్లు సమాచారం. 

సాధారణంగా గీక్‌బెంచ్‌ లిస్టింగ్‌కు వచ్చిన నెల లేదా రెండు నెలల వ్యవధిలో ఫోన్లలను మార్కెట్లోకి విడుదల చేస్తారు. దీంతో ఈ ఫోన్‌ 2023 జనవరి లేదా ఫిబ్రవరిలో రావొచ్చని అంచనా. మరోవైపు ఈ ఫోన్‌ మదర్‌బోర్డ్‌కు ‘హోలీ’ అనే కోడ్‌ ఇవ్వడంతో ‘హోలీ’ పండుగకు విడుదల చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో కొత్త ఏడాది తొలి త్రైమాసికంలో ఎప్పుడైనా జియో 5జీ ఫోన్‌ మార్కెట్లోకి వస్తుందని అంచనా. గతంలో ఈ ఫోన్‌ పేరు ‘గంగా’ అని వార్తలు వెలువడ్డాయి. తాజాగా మదర్‌బోర్డ్‌కు ‘హోలీ’  పేరు ఇవ్వడంతో అదే పేరుతో విడుదల చేస్తారని టెక్‌ వర్గాలు భావిస్తున్నాయి. 

గీక్‌బెంచ్ లిస్టింగ్ ప్రకారం జియో 5జీ ఫోన్‌ ఫీచర్లు ఇవే. ఆండ్రాయిడ్‌ 12 ఆధారిత ప్రగతి ఓఎస్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది. ఇందులో స్నాప్‌డ్రాగన్‌ 480+ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. అడ్రెనో 619 జీపీయూ గ్రాఫిక్‌ కార్డ్‌ ఉంది.  90 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.5 అంగుళాల హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఈ ఫోన్‌లో మూడు కెమెరాలున్నాయి. వెనుక రెండు, ముందు ఒకటి. వెనుకవైపు 13 ఎంపీ, 2 ఎంపీ కెమెరాలతోపాటు ముందు 8 ఎంపీ కెమెరా ఉంది. 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 18 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ధర  రూ. 12 వేలలోపు ఉండొచ్చని మార్కెట్‌ వర్గాల అంచనా.  4 జీబీ ర్యామ్‌/ 32 జీబీ అంతర్గత స్టోరేజీ వేరియంట్లో లభిస్తుంది. డ్యూయల్‌ సిమ్‌ సపోర్ట్‌, మెమొరీ కార్డు ఆప్షన్‌ ఇస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని