Afghan crisis: అఫ్గాన్‌లో తాలిబన్ల ప్రతీకారేచ్ఛ

అఫ్గానిస్థాన్‌లో పరిస్థితులు రోజురోజుకూ మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. ప్రతీకారం జోలికి వెళ్లబోమని ఇన్నాళ్లూ చెప్పుకొంటూ వచ్చిన తాలిబన్లు..

Updated : 21 Aug 2021 06:17 IST

గత ప్రభుత్వానికి సహకరించిన వారికోసం అన్వేషణ

ఓ జర్నలిస్టు బంధువు ప్రాణాలు బలితీసుకున్న ముఠా

భారత కాన్సులేట్‌ ఆఫీసుల్లో సోదాలు

గత నెల్లో 9 మంది హజారాల హత్య : ఆమ్నెస్టీ

కాబుల్‌: అఫ్గానిస్థాన్‌లో పరిస్థితులు రోజురోజుకూ మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. ప్రతీకారం జోలికి వెళ్లబోమని ఇన్నాళ్లూ చెప్పుకొంటూ వచ్చిన తాలిబన్లు.. ఆ ఒట్టు తీసి గట్టు మీద పెట్టేసినట్లు స్పష్టమవుతోంది. తమపై పోరాటంలో అమెరికా నేతృత్వంలోని బలగాలకు, అఫ్గాన్‌ ప్రభుత్వానికి సహకరించిన కీలక వ్యక్తుల గురించి వారు అన్వేషణ ముమ్మరం చేశారు. ఇంటింటికీ తిరుగుతూ సోదాలు నిర్వహిస్తున్నారు. జర్మనీకి చెందిన వార్తాసంస్థలో పనిచేస్తున్న ఓ జర్నలిస్టు కోసం వెతుకుతూ.. ఆయన సమీప బంధువును తాలిబన్లు పొట్టనపెట్టుకోవడం కలకలం సృష్టిస్తోంది. హజారా మైనారిటీ వర్గానికి చెందిన తొమ్మిది మందిని గత నెల్లో వారు క్రూరంగా చంపేసిన సంగతి కూడా తాజాగా బయటపడింది. దీంతో ప్రజల్లో భయాందోళనలు మరింత పెరిగాయి. మహిళల హక్కులను గౌరవిస్తామని ప్రకటించి వారం రోజులు కూడా కాకముందే.. విధులకు హాజరు కాకుండా వారిని తాలిబన్లు అడ్డుకుంటుండటమూ పలు అనుమానాలకు తావిస్తోంది.

* హజారాలపై మళ్లీ ఉక్కుపాదం

మానవ హక్కుల కోసం పోరాడే ‘ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌’ సంస్థ.. తాలిబన్ల క్రూరత్వానికి సంబంధించి తాజాగా కీలక విషయాలను బయటపెట్టింది. ఈ సంస్థ కథనం ప్రకారం.. అఫ్గాన్‌లో గజనీ ప్రావిన్సులోని ముందరఖ్త్‌ గ్రామంలో తాలిబన్లు గత నెల 4-6 తేదీల మధ్య విధ్వంసం సృష్టించారు. హజారా వర్గం ప్రజలే లక్ష్యంగా దాడులకు తెగబడ్డారు. తొమ్మిది మంది ప్రాణాలను పొట్టనపెట్టుకున్నారు. వారిలో ఆరుగుర్ని కాల్చిచంపగా, మిగతా ముగ్గుర్ని చిత్రవధ చేసి చంపేశారు. వాస్తవానికి హత్యల సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని అంచనా. ఒకప్పటి తాలిబన్ల అరాచక పాలనను ఈ హత్యలు గుర్తుచేస్తున్నాయని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ సెక్రటరీ జనరల్‌ ఆగ్నెస్‌ కాలమర్డ్‌ పేర్కొన్నారు. హజారాలు షియా ముస్లింలు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు వారిపై తాలిబన్లు ఉక్కుపాదం మోపారు.

* జర్నలిస్టు బంధువులపై దాడి

మీడియా స్వేచ్ఛను హరించబోమని ఇటీవల ప్రకటించిన తాలిబన్లు ఆ మాట కూడా తప్పారు. జర్మనీకి చెందిన ‘డాట్షె విల్లె’ వార్తాసంస్థలో సంపాదకుడిగా ఉన్న ఓ వ్యక్తి కోసం అఫ్గాన్‌లో వారు కొన్ని రోజులుగా వెతుకుతున్నారు. ఈ క్రమంలో బుధవారం సదరు జర్నలిస్టు బంధువులపై దాడి చేశారు. వారిలో ఒకరు మృత్యువాతపడగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. తాలిబన్లు వెతుకుతున్న జర్నలిస్టు ప్రస్తుతం జర్మనీలో ఉన్నట్లు సమాచారం. తాజా హత్యను డాట్షె విల్లె డైరెక్టర్‌ జనరల్‌ పీటర్‌ లింబర్గ్‌ ఖండించారు. తమ సంస్థకు చెందిన మరో ముగ్గురు జర్నలిస్టుల కోసం కూడా తాలిబన్లు వెతుకుతున్నట్లు సమాచారముందని చెప్పారు. మరోవైపు- గత అఫ్గాన్‌ ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన వ్యక్తులతో పాటు అమెరికా నేతృత్వంలోని విదేశీ బలగాలకు సహకారం అందించినవారి పేర్లతో తాలిబన్లు బ్లాక్‌లిస్ట్‌ను తయారుచేసుకున్నారని నార్వేకు చెందిన ‘రిప్టో నార్వేజియన్‌ సెంటర్‌ ఫర్‌ గ్లోబల్‌ అనలైసెస్‌’ ఓ నివేదికలో వెల్లడించింది. వారికోసం అన్వేషిస్తున్నారని తెలిపింది. జాబితాలోని పలువురికి.. తాలిబన్‌ మిలటరీ కమిషన్‌ పేరిట ఇప్పటికే బెదిరింపు లేఖలు కూడా పంపారని పేర్కొంది.

* మహిళల విధులకు అడ్డగింత

మహిళల హక్కులను పరిరక్షిస్తామన్న మాటనూ తాలిబన్లు నిలబెట్టుకోవడం లేదు. తాను కార్యాలయంలోకి వెళ్లకుండా తాలిబన్లు నిలువరించారని రేడియో టెలివిజన్‌ అఫ్గానిస్థాన్‌ యాంకర్‌ షబ్నమ్‌ఖాన్‌ దవ్రాన్‌ తాజాగా వెల్లడించారు. తనకు కూడా ఇదే పరిస్థితి ఎదురైందని మరో మహిళా జర్నలిస్టు ఖదీజా తెలిపారు.

* విమానాశ్రయానికి వేలమంది..

కాబుల్‌ విమానాశ్రయానికి శుక్రవారం కూడా వేలమంది పోటెత్తారు. వాస్తవానికి నగరవ్యాప్తంగా తాలిబన్లు చెక్‌పాయింట్లు పెట్టి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అఫ్గానీలు విమానాశ్రయానికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. దొరికినవారిని చితకబాదిమరీ వెనక్కి పంపుతున్నారు. ఎలాగోలా ముష్కరుల కళ్లుగప్పి, అతికష్టమ్మీద జనం విమానాశ్రయానికి చేరుకుంటున్నారు.

* ఐక్యతకు పిలుపునిచ్చిన ఇమామ్‌లు

కాబుల్‌ నగరాన్ని తాలిబన్లు ఆక్రమించుకున్నాక వచ్చిన తొలి శుక్రవారం కావడంతో.. ఏవైనా ఉద్రిక్తతలు తలెత్తుతాయేమోనని ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అలాంటివేమీ లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కొన్ని మసీదులకు గత 2-3 శుక్రవారాలతో పోలిస్తే ఎక్కువ జనం రావడం గమనార్హం. మరోవైపు- దేశం విడిచి వెళ్లకుండా ప్రజల్లో ధైర్యం నింపాలని, ఐక్యత కోసం పిలుపునివ్వాలని ఇమామ్‌లకు తాలిబన్లు మార్గదర్శకాలు జారీ చేశారు. తదనుగుణంగా పలువురు ఇమామ్‌లు ప్రసంగాలు చేశారు.

* 31 తర్వాతే ప్రభుత్వ ఏర్పాటు!

అఫ్గానిస్థాన్‌ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ ఈ నెల 31తో ముగియనుంది. అప్పటివరకు కీలక చర్యలేవీ చేపట్టకుండా అమెరికాకు, తాలిబన్లకు మధ్య ఒప్పందం ఉందని అఫ్గాన్‌ అధికారి ఒకరు తెలిపారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటు, కీలక నిర్ణయాల ప్రకటన వంటి చర్యలకు ముష్కర ముఠా ఈ నెలాఖరు వరకు దూరంగా ఉండే అవకాశముందని చెప్పారు.

* పాక్‌ రక్షణలో తాలిబన్‌ అధినేత?

తాలిబన్లు అఫ్గాన్‌ను ఆక్రమించినా.. వారి అధినేత హైబతుల్లా అఖుంద్‌జాదా ఇప్పటికీ బహిరంగంగా కనిపించకపోవడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆయన ఎక్కడున్నారన్నదీ ప్రశ్నార్థకంగా మారుతోంది. ఈ నేపథ్యంలో విదేశీ నిఘా సంస్థలు అందించిన సమాచారాన్ని విశ్లేషించిన భారత వర్గాలు.. అఖుంద్‌జాదా ప్రస్తుతం పాకిస్థాన్‌ సైన్యం రక్షణలో ఉండొచ్చని అంచనా వేస్తున్నాయి. అమెరికా డ్రోన్‌ దాడుల్లో అఖ్తర్‌ మన్సూర్‌ హతయ్యాక.. ఆయన స్థానంలో తాలిబన్ల సుప్రీం లీడర్‌గా 2016 మేలో అఖుంద్‌జాదా నియమితులయ్యారు. ఆరు నెలలుగా తాలిబన్‌ నేతలకు కూడా ఆయన కనిపించలేదు.


భారత కాన్సులేట్‌లలో తనిఖీలు

ప్రపంచ దేశాలతో దౌత్య సంబంధాలను కోరుకుంటున్నామని పైకి చెప్తున్న తాలిబన్లు.. వాస్తవంలో మాత్రం అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. కాందహార్‌, హెరాత్‌లలోని భారత కాన్సులేట్‌ల్లోకి వారు చొరబడ్డారు. తనిఖీలు నిర్వహించారు. అధికారవర్గాల సమాచారం ప్రకారం.. కాందహార్‌, హెరాత్‌లలో ఇప్పటికే మూసివేసిన భారత కాన్సులేట్‌ కార్యాలయాల్లోకి తాలిబన్లు బుధవారం ప్రవేశించారు. పలు కీలక పత్రాల కోసం వెతికారు. అనంతరం కార్యాలయాల ముందు నిలిపి ఉంచిన కార్లను తీసుకెళ్లారు. కాబుల్‌లోని భారత రాయబార కార్యాలయంలో మాత్రం తనిఖీలేవీ జరగలేదని అక్కడి సిబ్బంది స్పష్టం చేశారు. కాబుల్‌లో రాయబార కార్యాలయాన్ని ఖాళీ చేయొద్దని, అక్కడి సిబ్బంది భద్రతకు తాము భరోసా ఇస్తామని కతర్‌లోని తాలిబన్‌ కార్యాలయం నుంచి భారత్‌కు సందేశం వచ్చినట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని