Published : 29/08/2021 02:27 IST

పేలుళ్ల సూత్రధారిని మట్టుబెట్టాం

ప్రమేయమున్న మరో ఐఎస్‌-కె నేతనూ తుదముట్టించాం: అమెరికా

వాషింగ్టన్‌: అఫ్గాన్‌లో ఆత్మాహుతి దాడికి సూత్రధారిగా ఉన్న ఉగ్రవాది సహా ఇద్దరు కీలక ముష్కరుల్ని అమెరికా బలగాలు మట్టుబెట్టాయి. తమ సైనికుల్లో 13 మంది ప్రాణాలను బలిగొన్న ఉగ్రవాదుల్ని విడిచిపెట్టేది లేదని ప్రతినబూనిన అగ్రరాజ్యం ఆ ప్రకారం శనివారం వైమానిక దాడులకు దిగింది. ఆ దేశం వెలుపలి నుంచి డ్రోన్లతో అఫ్గాన్‌ నాంగహార్‌ ప్రావిన్సులో దాడికి పాల్పడి ఇస్లామిక్‌ స్టేట్‌-ఖోరాసాన్‌ (ఐ.ఎస్‌.-కె) నేతను తుద ముట్టించినట్లు అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ అధికార ప్రతినిధి కెప్టెన్‌ బిల్‌ అర్బన్‌ తెలిపారు. ‘ప్రాథమిక సమాచారం ప్రకారం.. డ్రోన్‌ దాడిలో అనుకున్న లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తి చేశాం. దాడుల సూత్రధారిని, దానితో ప్రమేయం ఉన్న మరొకరిని సంహరించాం. ఇంకొకరు గాయపడ్డారు. సాధారణ పౌరుల ప్రాణాలకు ఎలాంటి అపాయం వాటిల్లలేదు’ అని వివరించారు. ఐ.ఎస్‌-కె సూత్రధారి గురువారం నాటి దాడుల్లో పాల్గొన్నదీ లేనిదీ వెంటనే స్పష్టం కాలేదు. అఫ్గాన్‌లో పేలుళ్ల తర్వాత అమెరికా ఇలాంటి ప్రతీకార దాడికి పాల్పడడం ఇదే తొలిసారి. కాబుల్‌ విమానాశ్రయం వెలుపల దాడికి పాల్పడినవారిని ఈ భూమ్మీద బతకనిచ్చేదే లేదని బైడెన్‌ విస్పష్టంగా చెప్పారని శ్వేతసౌధం పత్రికా వ్యవహారాల కార్యదర్శి జెన్‌సాకి విలేకరుల సమావేశంలో తెలిపారు. విమానాశ్రయం వద్ద ఆత్మాహుతి దాడులకు దిగిన ముష్కరులు ఆ తర్వాత కాల్పులకు పాల్పడడం వల్ల ప్రాణనష్టం మరింత పెరిగిందని అమెరికా అధికారులు చెబుతున్నారు.

కాబుల్‌లో మరో ఉగ్రదాడికి అవకాశం!
కాబుల్‌లో కొద్దిరోజుల్లో మరో ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని అమెరికా జాతీయ భద్రత బృందం అంచనా వేస్తోంది. ఈ విషయాన్ని బైడెన్‌కు ఈ బృందం తెలియపరిచింది. అక్కడి నుంచి ప్రజల్ని సురక్షితంగా తరలించడం అత్యంత ప్రమాదకరంగా ఉందని, ఇప్పటివరకు ఎన్నడూ ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదని తెలిపింది. కాబుల్‌ విమానాశ్రయంలో ఎంతో ధైర్యసాహసాలతో పనిచేస్తున్న అమెరికా బలగాలను పరిరక్షించుకునేందుకు వీలైనన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వివరించింది. అఫ్గాన్‌లో అమెరికా బలగాల ఉపసంహరణ పూర్తయిన తర్వాత కూడా.. ఆ దేశం నుంచి బయటకు రావాలనుకునేవారికి దౌత్య మార్గాల్లో సాయం అందించాల్సిందిగా విదేశీ వ్యవహారాల మంత్రిని బైడెన్‌ ఆదేశించినట్లు ఉన్నతాధికారి తెలిపారు.


ముందు జాగ్రత్తగా.. సీఐఏఔట్‌పోస్టును పేల్చేసిన అమెరికా

వాషింగ్టన్‌: కాబుల్‌లో అమెరికా తమ కీలక స్థావరం నామరూపాల్లేకుండా చేసింది. అక్కడ చేపట్టిన చర్యల ఆనవాళ్లేవీ తాలిబన్ల చేతికి చిక్కకుండా జాగ్రత్త పడింది. కాబుల్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల అమెరికా గూఢచర్య సంస్థ సీఐఏకి ‘ఈగల్‌ బేస్‌’ పేరుతో ఒక స్థావరం ఉంది. గురువారం ఉగ్రవాదులు ఆ విమానాశ్రయం వెలుపల ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డ గంటల వ్యవధిలోనే ఈ స్థావరాన్ని అమెరికా పేల్చివేసిందని ‘ది న్యూయార్క్‌ టైమ్స్‌’ కథనం వెల్లడించింది. అక్కడి సాధన సంపత్తి, కీలకపత్రాలు తాలిబన్ల చేతుల్లోకి వెళ్లకుండా దాన్ని పేల్చివేశారని తెలిపింది.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని