ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో అప్రమత్తం

కొద్ది రోజులుగా ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో జరుగుతున్న వరుస ఘటనల నేపథ్యంలో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దు వెంట అదనపు బలగాలను మోహరించారు. 20 రోజుల

Published : 24 Jan 2022 04:21 IST

అదనపు బలగాల మోహరింపు

ఈనాడు, హైదరాబాద్‌: కొద్ది రోజులుగా ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో జరుగుతున్న వరుస ఘటనల నేపథ్యంలో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దు వెంట అదనపు బలగాలను మోహరించారు. 20 రోజుల వ్యవధిలో పోలీసులతో జరిగిన ఎదురు కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు మరణించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో మావోయిస్టులు కూడా పలు హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. ఇన్ఫార్మర్ల నెపంతో హత్యలు చేయడంతో పాటు రోడ్డు నిర్మాణ పనుల్లో వినియోగిస్తున్న యంత్రాలను దహనం చేశారు. గత నెల రోజులుగా దాదాపు ప్రతిరోజూ భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల సరిహద్దుల్లో ఏదో ఒక ఘటన జరుగుతూనే ఉంది. అప్రమత్తమైన రాష్ట్ర పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా సరిహద్దుల్లో గస్తీ పెంచారు.   నిరంతరం కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. వాస్తవానికి కొంతకాలంగా మావోయిస్టులు రాష్ట్రంలోకి చొరబడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని పోలీసుల వద్ద సమాచారం ఉంది. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలు ఇందుకు అనుకూలంగా ఉన్నట్లు గుర్తించారు. వీటికి సమీపంలోని సుక్మా, బీజాపూర్‌, నారాయణపూర్‌ జిల్లాల్లో మావోయిస్టులకు పట్టు ఉండటం, రాష్ట్రంలోకి వచ్చేందుకు భౌగోళికంగా అనుకూల పరిస్థితులు ఉండటమే ఇందుకు కారణం. ఏడాది క్రితం రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు ఆదెల్లు అలియాస్‌ భాస్కర్‌ ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోకి ప్రవేశించి దాదాపు నెల రోజులపాటు పోలీసులకు దొరక్కుండా ముప్పుతిప్పలు పెట్టి మళ్లీ ఛత్తీస్‌గఢ్‌లోని సురక్షిత ప్రాంతానికి వెళ్లాడు. ఈసారి అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఛత్తీస్‌గఢ్‌ బృందాలతో కలిసి తెలంగాణ పోలీసులు ఉమ్మడి ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. ఒకసారి రాష్ట్రంలోకి వచ్చాక  కట్టడిచేయడం కష్టం కాబట్టి ఎట్టిపరిస్థితుల్లో ఎవరూ ప్రవేశించకుండా చూసేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని