సంక్షిప్త వార్తలు

ఈపీఎఫ్‌వో పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, కార్మికులు, పింఛనుదారుల ఫిర్యాదుల పరిష్కారం కోసం ఈ నెల 29న ‘‘నిధి ఆప్‌కే నికత్‌’’ కార్యక్రమం చేపడుతున్నట్లు హైదరాబాద్‌ ప్రాంతీయ పీఎఫ్‌ కమిషనర్‌ అర్జున్‌ తుక్రాల్‌ తెలిపారు.

Updated : 27 Apr 2024 05:51 IST

29న ‘నిధి ఆప్‌కే నికత్‌’ కార్యక్రమం

ఈనాడు, హైదరాబాద్‌: ఈపీఎఫ్‌వో పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, కార్మికులు, పింఛనుదారుల ఫిర్యాదుల పరిష్కారం కోసం ఈ నెల 29న ‘‘నిధి ఆప్‌కే నికత్‌’’ కార్యక్రమం చేపడుతున్నట్లు హైదరాబాద్‌ ప్రాంతీయ పీఎఫ్‌ కమిషనర్‌ అర్జున్‌ తుక్రాల్‌ తెలిపారు. హైదరాబాద్‌ ప్రాంతీయ కార్యాలయ పరిధిలోకి వచ్చే రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, నల్గొండ జిల్లాల పరిధిలోని ఏడు ప్రాంతాల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 5.45 గంటల వరకు కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ప్రీమియం ఎక్స్‌ప్లోజివ్‌ లిమిటెడ్‌, కార్ఖానా (మేడ్చల్‌ జిల్లా), రామోజీఫిల్మ్‌సిటీ, హయత్‌నగర్‌ (రంగారెడ్డి), సుధాకర్‌ పీవీసీ సూర్యాపేట (సూర్యాపేట), ఎస్‌ఆర్‌ లాబొరేటరీ, చౌటుప్పల్‌ (భువనగిరి), కామినేని మెడికల్‌, నార్కట్‌పల్లి (నల్గొండ), సత్యం వెంచర్‌ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ (హైదరాబాద్‌), ఈపీఎఫ్‌వో ప్రాంతీయ కార్యాలయం, బర్కత్‌పుర (హైదరాబాద్‌)లో జరుగుతుందని తెలిపారు.


రీచ్‌ల గుత్తేదారులపై లారీ యజమానుల సంఘం ఫిర్యాదు

ఈనాడు, హైదరాబాద్‌: రీచ్‌లకు వెళ్లే లారీల్లో ఇసుక లోడింగ్‌ చేసే గుత్తేదారులు డబ్బులు వసూలు చేస్తున్నారంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఇసుక లారీల యజమానుల సంఘం ఫిర్యాదు చేసింది. గనుల శాఖ ముఖ్యకార్యదర్శి, టీఎస్‌ఎండీసీ ఎండీ మహేశ్‌దత్‌ ఎక్కానిని  శుక్రవారం సంఘం నేతలు ఎస్‌.యాదయ్యగౌడ్‌, లింగన్న, లింగస్వామి సచివాలయంలో కలిశారు. గుత్తేదారులపై చర్యలు తీసుకోవాలన్నారు. ‘భూపాలపల్లి, ములుగు, పెద్దపల్లి, కొత్తగూడెం జిల్లాల్లోని టీఎస్‌ఎండీసీ ఇసుక రీచుల్లో దొడ్డు ఇసుక నింపినందుకు ఒక్కో లారీకి గుత్తేదారులు రూ.3,500 వసూలు చేస్తున్నారు. సన్న ఇసుకకు లారీకి రూ.5 వేల నుంచి రూ.7 వేలు తీసుకుంటున్నారు’ అని వినతి పత్రంలో పేర్కొన్నారు. 


మోడల్‌ స్కూళ్ల ప్రవేశపరీక్ష కీ విడుదల

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలోని మోడల్‌ స్కూళ్లలో 6 నుంచి 10 తరగతుల్లో ప్రవేశాల కోసం ఈ నెల ఏడో తేదీన నిర్వహించిన పరీక్ష కీ, ప్రశ్నపత్రాలను వెబ్‌సైట్‌లో (https://telanganams.cgg.gov.in) అందుబాటులోకి తెచ్చినట్లు మోడల్‌ స్కూళ్ల అదనపు సంచాలకుడు శ్రీనివాసాచారి తెలిపారు. విద్యార్థులు తమ మార్కులను, సమాధానాలను సరిచూసుకోవాలని సూచించారు.


నర్సింగ్‌ ఆఫీసర్ల వేతన స్కేళ్లను స్థిరీకరించాలి

తెలంగాణ నర్సెస్‌ అసోసియేషన్‌

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో నర్సింగ్‌ ఆఫీసర్ల వేతన స్కేళ్లను స్థిరీకరించాలని తెలంగాణ నర్సెస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర వేతన సవరణ సంఘాన్ని కోరింది. శుక్రవారం తెలంగాణ నర్సెస్‌ అసోసియేషన్‌ అధ్యక్షురాలు జయమ్మ, ప్రధాన కార్యదర్శి మరియమ్మ ఇతర నేతలు వేతన సవరణ సంఘం ఛైర్మన్‌ శివశంకర్‌ని కలిసి వినతిపత్రం అందజేశారు. వైద్య ఆరోగ్యశాఖలోని వివిధ విభాగాల్లో నర్సింగ్‌ ఆఫీసర్లు విధులు నిర్వహిస్తున్నారని వీరికి వేతన స్కేల్‌ను స్థిరీకరించాలని, అర్హులకు వాహన సౌకర్యం కల్పించాలని కోరారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు