Published : 26 May 2022 05:32 IST

కాంగ్రెస్‌ను వీడిన సిబల్‌

పార్టీకి సీనియర్‌ నేత రాజీనామా

స్వతంత్ర అభ్యర్థిగా రాజ్యసభకు నామినేషన్‌...

మద్దతు ప్రకటించిన ఎస్పీ

ఈనాడు, దిల్లీ: ఎన్నికల్లో వరుస ఓటములతో కుదేలవుతున్న కాంగ్రెస్‌కు మరో గట్టి షాక్‌ తగిలింది. కేంద్ర మాజీ మంత్రి, సీనియర్‌ నేత కపిల్‌ సిబల్‌ పార్టీకి రాజీనామా చేశారు. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) మద్దతుతో రాజ్యసభకు స్వతంత్ర అభ్యర్థిగా ఆయన నామినేషన్‌ దాఖలు చేశారు. కాంగ్రెస్‌కు తాను ఈ నెల 16నే రాజీనామా చేశానని సిబల్‌ తెలిపారు. రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్‌ వేసేందుకు బుధవారం లఖ్‌నవూ వచ్చిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘‘రాజీవ్‌ గాంధీ (మాజీ ప్రధానమంత్రి) వల్లే నేను కాంగ్రెస్‌లో చేరాను. పార్టీతో నాది మూడు దశాబ్దాలకు పైగా అనుబంధం. ఇంత సుదీర్ఘ బంధాన్ని తెంచుకోవడం సులువు కాదు. కానీ మనసు చెప్పేది వింటూ కొన్నిసార్లు ఇలాంటి నిర్ణయాలు తీసుకోక తప్పదు. కాంగ్రెస్‌తో నాకు విభేదాలేమీ లేవు. ఆ పార్టీ సిద్ధాంతాలకు నేను చేరువగానే ఉన్నా’’ అని పేర్కొన్నారు. ప్రజాసమస్యలపై రాజ్యసభలో స్వతంత్రుడిగా గొంతెత్తాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాజపాపై ప్రతిపక్ష పార్టీలు ఐక్యంగా పోరాడటం చూడాలన్నది తన కల అని వ్యాఖ్యానించారు. అందుకోసం తనవంతుగా కృషిచేయనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్‌ అధిష్ఠానంపై అసమ్మతి గళం వినిపించిన జి-23 నేతల్లో సిబల్‌ ఒకరు. కొన్నాళ్లుగా పార్టీ కార్యకలాపాలకు ఆయన దూరంగా ఉంటున్నారు.

ఎస్పీ మద్దతు వెనక..
సిబల్‌ ప్రముఖ న్యాయవాది. ఎస్పీ సీనియర్‌ నాయకుడు ఆజం ఖాన్‌ బెయిలు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ఇటీవల సమర్థంగా వాదనలు వినిపించారు. ఆయనకు బెయిలు వచ్చేలా చేశారు. గతంలో ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌, ఆయన బాబాయ్‌ శివపాల్‌ యాదవ్‌ల మధ్య పార్టీ గుర్తుపై పోరు తలెత్తినప్పుడు ఎన్నికల సంఘం ఎదుట అఖిలేశ్‌ తరఫున సిబల్‌ వాదనలు వినిపించారు. సైకిల్‌ గుర్తు ఆయనకే దక్కేలా చేశారు. ఈ రెండింటికీ కృతజ్ఞతగా సిబల్‌ను ఎస్పీ రాజ్యసభకు పంపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎలాంటి షరతులు లేకుండానే అఖిలేష్‌ తనకు మద్దతు ప్రకటించినట్లు ఆయన తాజాగా వెల్లడించారు. సిబల్‌ ప్రస్తుతం యూపీ నుంచి కాంగ్రెస్‌ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆయన పదవీకాలం జులై 4తో ముగియనుంది. కొత్తగా యూపీ నుంచి మొత్తం 11 మంది రాజ్యసభకు ఎన్నిక కానున్నారు. సిబల్‌కు మద్దతిస్తున్నట్లు అఖిలేశ్‌ స్పష్టం చేశారు. నామినేషన్‌ వేసేటప్పుడు ఆయన వెంట ఎస్పీ అధినేత ఉండటం గమనార్హం.

కాంగ్రెస్‌ పరిధి చాలా పెద్దది: కె.సి.వేణుగోపాల్‌
సిబల్‌ నిష్క్రమణపై కాంగ్రెస్‌ తూతూమంత్రంగా స్పందించింది. ఆయన రాజీనామాపై కోచిలో విలేకర్లు అడిగిన ప్రశ్నకు పార్టీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్‌ స్పందిస్తూ.. జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్‌ పరిధి చాలా విస్తృతమైనదని పేర్కొన్నారు. హరియాణాలో ఇటీవలే 8 మంది మాజీ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరారని.. అలాంటి పరిణామాలకు మాత్రం తగిన ప్రాధాన్యత దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

వరుస నిష్క్రమణలు
సీనియర్‌ నాయకులు ఒక్కొక్కరుగా రాజీనామా చేస్తుండటం కాంగ్రెస్‌ను తీవ్రంగా కలవరపెడుతోంది. ఇటీవల ఆ పార్టీ చింతన శిబిరం నిర్వహిస్తున్న సమయంలోనే పంజాబ్‌ పీసీసీ మాజీ అధ్యక్షుడు సునీల్‌ జాఖడ్‌ భాజపాలోకి మారారు. తర్వాత గుజరాత్‌ కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు హర్దిక్‌ పటేల్‌ పార్టీని వీడారు. నాలుగు దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకొని కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి అశ్వినీ కుమార్‌ ఈ ఏడాది ఫిబ్రవరిలో కాంగ్రెస్‌ను వీడారు. మరో కేంద్ర మాజీ మంత్రి ఆర్‌పీఎన్‌ సింగ్‌ కూడా యూపీ ఎన్నికలకు ముందు హస్తం పార్టీకి రాంరాం చెప్పి భాజపా గూటికి వెళ్లారు.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని