ఎనిమిదేళ్లలో తెలంగాణకేం చేశారు?

తెలంగాణ పర్యటనకొచ్చిన ప్రధాని మోదీ ఎనిమిదేళ్లలో రాష్ట్రానికేం చేశారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. భాజపా-తెరాసల మధ్య చీకటి సంబంధముందని తెలంగాణ సమాజం నమ్ముతోందన్నారు.

Published : 27 May 2022 04:58 IST

 ప్రధాని మోదీకి రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ

తెరాస-భాజపాది చీకటి సంబంధమని విమర్శ

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ పర్యటనకొచ్చిన ప్రధాని మోదీ ఎనిమిదేళ్లలో రాష్ట్రానికేం చేశారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. భాజపా-తెరాసల మధ్య చీకటి సంబంధముందని తెలంగాణ సమాజం నమ్ముతోందన్నారు. ఈ మేరకు ఆయన మోదీకి బహిరంగ లేఖ రాశారు. తాజా విద్యుత్‌, విద్యాసంస్కరణల విషయంలో జాతీయవిధానాన్ని పైకి వ్యతిరేకిస్తూ.. అంతర్లీనంగా తెరాస ప్రభుత్వం ఆమోదముద్ర వేయడమే దీనికి నిదర్శనమన్నారు.

లేఖలోని ముఖ్యాంశాలు

* గత పార్లమెంట్‌ సమావేశాల్లో మా మనోభావాలను గాయపరుస్తూ మీరు మాట్లాడిన తీరు అభ్యంతరకరం.

* కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్‌ కుటుంబానికి ఏటీఎంలా మారిందని జేపీనడ్డా ఆరోపించారు. మీరు కాళేశ్వరంలో అవినీతిని ఎలా సహిస్తున్నారు? 

* భాజపా అభ్యర్థిని గెలిపిస్తే ఆర్మూర్‌లో పసుపుబోర్డు ఏర్పాటు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఏమైంది?

* విభజన హామీలను విస్మరించారు.

* ఒడిశాలో నైనీ కోల్‌మైన్స్‌ టెండర్లలో అవినీతిపై కేంద్ర బొగ్గుశాఖ మంత్రికి ఫిర్యాదు చేశాను. ఈ కుంభకోణం వెనక కేసీఆర్‌ బంధువుల పాత్ర ఉందని వివరాలిచ్చినా స్పందించలేదు.

* కృష్ణా జలాల విషయంలో కేంద్రం వైఖరికి తోడు కేసీఆర్‌, జగన్‌ ఆడుతున్న క్రీడతో తెలంగాణ నష్టపోతోంది. కర్ణాటకలోని అప్పర్‌భద్ర ప్రాజెక్టుకు జాతీయహోదా ఇచ్చిన మీకు.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు ఇవ్వడంలో ఇబ్బందేంటి.. ఇలా పలు ప్రశ్నలు సంధించారు.

అధికార దాహం తప్ప తెలంగాణ హితం లేదు

బేగంపేటలో మోదీ ప్రసంగంలో అధికారదాహం తప్ప తెలంగాణహితం లేదని రేవంత్‌రెడ్డి ట్విటర్‌లో విమర్శించారు. కాంగ్రెస్‌ ఇచ్చిన ఐటీఐఆర్‌ ప్రాజెక్టును రద్దు చేసిన మోదీ.. హైదరాబాద్‌ను టెక్నాలజీ హబ్‌గా మార్చుతామనడం హాస్యాస్పదమన్నారు. గోబ్యాక్‌ మోదీ అంటూ హ్యాష్‌ టాగ్‌ జత చేశారు.

అమెరికాకు రేవంత్‌

రేవంత్‌రెడ్డి గురువారం కుటుంబ సమేతంగా అమెరికా పర్యటనకు వెళ్లారు. వచ్చే నెల 7వ తేదీ వరకు అక్కడే ఉంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని