సమ్మె యోచన మాని అభివృద్ధికి తోడ్పడండి

సింగరేణిలో కార్మిక సంఘాలు ఈ నెల 9 నుంచి తలపెట్టిన 3 రోజుల సమ్మెతో సంస్థ ప్రగతికి నష్టం వాటిల్లుతుందని, సమ్మెను విరమించుకుని అభివృద్ధికి సహకరించాలని అన్ని సంఘాలకు ఆ సంస్థ యాజమాన్యం విజ్ఞప్తి చేసింది.

Published : 04 Dec 2021 05:06 IST

కార్మిక సంఘాలకు సింగరేణి విజ్ఞప్తి

ఈనాడు, హైదరాబాద్‌: సింగరేణిలో కార్మిక సంఘాలు ఈ నెల 9 నుంచి తలపెట్టిన 3 రోజుల సమ్మెతో సంస్థ ప్రగతికి నష్టం వాటిల్లుతుందని, సమ్మెను విరమించుకుని అభివృద్ధికి సహకరించాలని అన్ని సంఘాలకు ఆ సంస్థ యాజమాన్యం విజ్ఞప్తి చేసింది. తెలంగాణలో నాలుగు బొగ్గు బ్లాక్‌లను వేలం వేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘంతోపాటు ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, హెచ్‌ఎంఎస్‌, సీఐటీయూ, బీఎంఎస్‌లు ఇచ్చిన సమ్మె నోటీసుపై శుక్రవారం సింగరేణి ఉన్నతాధికారులు హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో ఆ సంఘాల నాయకులతో చర్చలు జరిపారు. బొగ్గు గనుల కేటాయింపుపై కేంద్రం దేశవ్యాప్త విధానపరమైన నిర్ణయం తీసుకున్నందునే తెలంగాణలోనూ నాలుగు బొగ్గు గనులను వేలం వేస్తున్నారని, ఇక్కడ సమ్మె చేయడం సమస్యకు పరిష్కారం కాదని అధికారులు వివరించారు.  ఇప్పుడు స్పందించకపోతే భవిష్యత్‌లో ఇబ్బందులు పడాల్సి వస్తుందన్న ఉద్దేశంతో సమ్మె బాట పడుతున్నామని యాజమాన్యానికి స్పష్టం చేశారు. ఈ చర్చల్లో సంఘాల నాయకులు వెంకట్రావు, మిర్యాల రాజిరెడ్డి, కెంగర్ల మల్లయ్య, వాసిరెడ్డి సీతారామయ్య, జనక్‌ ప్రసాద్‌, ఎస్‌.నర్సింహారెడ్డి, రియాజ్‌ అహ్మద్‌, జక్కుల నారాయణ, రాజిరెడ్డి,  మధు, యాదగిరి సత్తయ్య, మాధవ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని