TS News: ఎముకల గూడులాంటి తల్లిని రోడ్డు మీద వదిలేశారు..

తన రక్తమాంసాలను పిల్లలకు పంచి చివరకు ఎముకల గూడులా మారిందామె.. తనువంతా బిడ్డలకే ధారపోసి ఎండు కట్టెలా మిగిలిపోయిన అమ్మ.. ఇంతచేసినా ఆమె మాత్రం అయినవారికి బరువైపోయింది. జీవిత చరమాంకంలో

Updated : 30 Dec 2021 09:17 IST

రోడ్డు పక్కన కవర్లతో గూడు కట్టి వదిలేసిన వైనం

వృద్ధురాలు మధురమ్మ

పెద్దపల్లి, న్యూస్‌టుడే: తన రక్తమాంసాలను పిల్లలకు పంచి చివరకు ఎముకల గూడులా మారిందామె.. తనువంతా బిడ్డలకే ధారపోసి ఎండు కట్టెలా మిగిలిపోయిన అమ్మ.. ఇంతచేసినా ఆమె మాత్రం అయినవారికి బరువైపోయింది. జీవిత చరమాంకంలో కంటికి రెప్పలా చూసుకోవాల్సిన పిల్లలు కన్నతల్లిని నిర్దాక్షిణ్యంగా వదిలించుకున్నారు.. నిర్దయగా తీసుకొచ్చి వీధిలోకి విసిరేశారు.. అమానుషమైన.. హృదయ విదారకమైన ఈ ఘటన పెద్దపల్లిలో బుధవారం చోటుచేసుకుంది. స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానం ప్రహరీని ఆనుకొని బుధవారం ట్రీగార్డులు, ప్లాస్టిక్‌ కవర్లతో కట్టిన ఓ గూడు స్థానికులకు కనిపించింది. ఏమిటా అని దగ్గరకు వెళ్లి చూస్తే అందులో గుర్తుతెలియని వృద్ధురాలు ఒంటరిగా దీనంగా కనిపించింది. తడారిన కళ్లలో దైన్యం.. ఆర్చుకుపోయిన గుండెల్లో కొండంత వేదన! తన పేరు బండి మధునమ్మ అని, ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారని మాత్రమే తడుముకుంటూ చెబుతోంది. తమది ఏ ఊరో.. ఏ ప్రాంతమో చెప్పలేని దయనీయ స్థితిలో ఉందామె.. మాట తడబడుతుండగా కనీసం బిడ్డల పేర్లు చెప్పలేకపోతుండడంతో స్థానికులు సఖీ కేంద్రం నిర్వాహకులకు సమాచారం ఇచ్చారు. లయన్స్‌క్లబ్‌ ఎలైట్‌ ప్రతినిధి అశోక్‌కుమార్‌ అక్కడికి చేరుకొని ఆ అభాగ్యురాలికి ఆహారం అందించారు. అనంతరం సఖీ కేంద్రానికి తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని