Andhra News: ‘మూడు’ మారదు!

మూడు రాజధానుల విషయంలో ముందుకు వెళ్లేందుకే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అధికార వికేంద్రీకరణే తమ విధానమని స్పష్టం చేసింది. మూడు రాజధానుల బిల్లును మరోసారి అసెంబ్లీలో పెట్టే విషయంలో మాత్రం స్పష్టత రాలేదని తెలిసింది.

Updated : 04 Mar 2022 05:50 IST

అధికార వికేంద్రీకరణే ప్రభుత్వ విధానం  
ఏజీ, సీఆర్‌డీఏ అధికారులతో ఏపీ సీఎం జగన్‌ కీలక సమీక్ష
అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లుపై రాని స్పష్టత

ఈనాడు, అమరావతి: మూడు రాజధానుల విషయంలో ముందుకు వెళ్లేందుకే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అధికార వికేంద్రీకరణే తమ విధానమని స్పష్టం చేసింది. మూడు రాజధానుల బిల్లును మరోసారి అసెంబ్లీలో పెట్టే విషయంలో మాత్రం స్పష్టత రాలేదని తెలిసింది. అమరావతిపై హైకోర్టు గురువారం తీర్పు వెలువరించిన నేపథ్యంలో... ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తన క్యాంపు కార్యాలయంలో కీలక సమీక్ష నిర్వహించారు. ఆర్థిక, పురపాలక శాఖల మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, బొత్స సత్యనారాయణ, అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరాం, సీఆర్‌డీఏ అధికారులతో చర్చించారు. న్యాయస్థానం ఆదేశాల అమలుకు ఉన్న అవకాశాలు, అమరావతిలో అభివృద్ధి ఎలా? దానికి ఎంత మేర ఖర్చు అవుతుందనే ప్రాథమికాంశాలపై చర్చించినట్లు సమాచారం. ‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కోర్టు చెప్పిన కాల పరిమితిలోపు అభివృద్ధి చేయడం ఎంతవరకు సాధ్యం? హైకోర్టుకు అఫిడవిట్‌ను సమర్పించేటప్పుడు అందులో ఈ అంశాలనూ పొందుపరిస్తే ఎలా ఉంటుంది’ అనే విషయాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది.

సుప్రీంకు వెళ్లడంపై ఆచితూచి అడుగులు

‘పాలనా వికేంద్రీకరణ అంశాన్ని ప్రజల ముందుంచాలి. గతంలో చెప్పినట్లే మూడు రాజధానుల అంశంపై రాష్ట్ర ప్రజలందరి అభిప్రాయాలనూ తీసుకుందాం’ అని సమావేశంలో నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. హైకోర్టు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించాలా? వద్దా..? అనే అంశంపై ఆచితూచి ముందుకు వెళ్లాలన్న భావన సమావేశంలో వ్యక్తమైనట్లు తెలిసింది.

ప్రజాభిప్రాయం తెలుసుకుంటాం

ముఖ్యమంత్రితో సమావేశానంతరం అక్కడే మంత్రి బొత్స సత్యనారాయణ విలేకరులతో మాట్లాడుతూ... ‘మూడు రాజధానులపై రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజల అభిప్రాయాలనూ తీసుకుంటాం. అధికార వికేంద్రీకరణకు నూటికి నూరు శాతం కట్టుబడి ఉన్నాం. రైతులకు ప్లాట్లను అభివృద్ధి చేసి ఇవ్వడమనేది సమయం, ఖర్చు, కావాల్సిన నిధులు అనే మూడు అంశాలతో ముడిపడి ఉంది. మూడు నెలల్లో ఏరకంగా ఇస్తారు. ప్రాక్టికల్‌గానే ఇది మాట్లాడుతున్నా తప్ప ఎవరినో కించపరిచేందుకు అనడం లేదు’ అని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని