Telangana Budget 2022: వ్యవ‘సాయం’ పుష్కలం

వ్యవసాయ రంగానికి ప్రభుత్వం పుష్కలంగా నిధులు కేటాయించింది. రైతుబంధు, రైతుబీమా పథకాలకు గత బడ్జెట్‌కన్నా స్వల్పంగా నిధులు పెంచింది. అవసరమైతే అదనంగా కూడా కేటాయిస్తామంది. రాష్ట్ర వ్యవసాయ రంగంలో అత్యంత ఎక్కువ నిధులు కేటాయించిన

Updated : 08 Mar 2022 05:36 IST

 రైతుబంధు, రైతుబీమా పథకాలకు దండిగా నిధులు

వ్యవసాయశాఖకు 2022-23లో కేటాయింపులు రూ.24,254 కోట్లు

ఈనాడు, హైదరాబాద్‌ : వ్యవసాయ రంగానికి ప్రభుత్వం పుష్కలంగా నిధులు కేటాయించింది. రైతుబంధు, రైతుబీమా పథకాలకు గత బడ్జెట్‌కన్నా స్వల్పంగా నిధులు పెంచింది. అవసరమైతే అదనంగా కూడా కేటాయిస్తామంది. రాష్ట్ర వ్యవసాయ రంగంలో అత్యంత ఎక్కువ నిధులు కేటాయించిన పథకం రైతుబంధు. దీనికి రూ.14,800 కోట్లు ఇచ్చారు. ప్రస్తుత ఏడాది(2021-22) రూ.14,400 కోట్లు రైతుల ఖాతాల్లో వేయగా వచ్చే ఏడాదికి మరో రూ.400 కోట్లు పెంచి కేటాయించారు. గత నాలుగేళ్లలో ఈ పథకం కింద 63 లక్షల ఖాతాల్లో రూ.50,448 కోట్లు జమచేసినట్లు సర్కారు తెలిపింది. ఈ పథకంతో రైతులు అప్పుల ఊబి నుంచి బయటపడ్డారని వివరించింది. రైతుబీమాకు రూ.1,466 కోట్లు కేటాయించింది. గత మూడేళ్లలో 75 వేలకు పైగా కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.3,775 కోట్ల పరిహారాన్ని ఎల్‌ఐసీ అందజేసినట్లు బడ్జెట్‌లో పేర్కొంది. తెలంగాణ ఏర్పాటుకు ముందు ఏడాది 2013-14లో ఇక్కడ వ్యవసాయ రంగ వృద్ధిరేటు 4 శాతం కాగా 2019-20 నాటికి 29 శాతానికి పెరిగిందని వివరించింది.

రూ.75 వేల లోపు వారికి రుణమాఫీ

రాష్ట్రం ఏర్పడిన తరవాత 2014-18 మధ్య తొలివిడతలో నాలుగు దఫాలుగా 35.32 లక్షల మంది రైతుల రుణాల మాఫీకి రూ.16,144 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. 2018 డిసెంబరులో రెండో విడత రుణమాఫీని ప్రకటించాక ఇప్పటివరకూ 5.12 లక్షల మంది రైతుల బాకీలను మాఫీ చేసినట్లు సర్కారు తెలిపింది. ఈ నెలాఖరులోగా రూ.50 వేలలోపు అప్పు ఉన్నవారందరి రుణాలను మాఫీ చేస్తామని చెప్పింది. 2018 డిసెంబరు 11 నాటికి బ్యాంకులకు రూ.75 వేలలోపు కట్టాల్సిన రైతుల రుణాల మాఫీకి వచ్చే ఏడాది(2022-23)లో నిధులు విడుదల చేస్తామని స్పష్టం చేసింది.

* అదనంగా 2.50 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పాం సాగు విస్తీర్ణం పెంచేందుకు రూ.1,000 కోట్లను కేటాయించింది. 

*  పశుసంవర్ధకశాఖకు రూ.2,768.68 కేటాయించగా.. అందులో రాయితీపై గొల్లకుర్మలకు గొర్రెలను పంపిణీ చేసేందుకు రూ.1,000 కోట్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఒక్కొక్కరికి 20 గొర్రెలు, ఒక పొట్టేలును యూనిట్‌గా పంపిణీ చేస్తారు. ఇందులో లబ్ధిదారుడి వాటా పోను ప్రభుత్వ వాటా కట్టేందుకు ఈ నిధులు వినియోగిస్తారు.

* వ్యవసాయ యంత్రాలకు గత బడ్జెట్‌లో రూ.1,500 కోట్లు కేటాయించగా తాజాగా రూ.500 కోట్లు మాత్రమే ఇచ్చారు.

* పంటల ధరలు పడిపోయినప్పుడు ప్రభుత్వం నేరుగా మద్దతు ధరకు రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు ఉద్దేశించిన ‘మార్కెట్‌ జోక్య నిధి’కి గత బడ్జెట్‌లో రూ.500 కోట్లు ఇవ్వగా ఈ ఏడాది రూ.100 కోట్లు మాత్రమే కేటాయించారు.

* ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు పదేళ్లలో తెలంగాణ ప్రాంతంలో అప్పటి వ్యవసాయశాఖ రూ.7,994 కోట్లు ఖర్చుపెడితే.. రాష్ట్రం ఏర్పడిన ఏడేళ్లలోనే రూ.83,989 కోట్లు వెచ్చించినట్లు ప్రభుత్వం వివరించింది.

* వచ్చే ఏడాదికి వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్‌ శాఖల పద్దు కింద రూ.24,254.35 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్‌లో రూ.25,000 కోట్లు కేటాయించగా సవరించిన అంచనాల్లో ఈ మొత్తాన్ని రూ.21 వేల కోట్లుగా పేర్కొంది.

వ్యవసాయ, ఉద్యానశాఖలకు పద్దు కేటాయింపులు(రూ.కోట్లలో)

 రైతు బంధు: 14,800
 రైతు బీమా: 1,466
వ్యవసాయ యంత్రాలు: 500
ఆయిల్‌పాం పంట: 1,000
గొర్రెల పెంపకం: 1,000
ఉద్యానశాఖ: 994.65
మార్కెట్‌ జోక్య నిధి: 100 
సేంద్రియ సేద్యం: 75 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని