Kishan Reddy: కేసీఆర్‌ నియంతృత్వ పాలన పోవాల్సిందే

తెలంగాణలో నియంతృత్వ పాలనకు చరమగీతం పాడాల్సిన తరుణం ఆసన్నమైందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. నిజమైన ప్రజాపాలన భాజపాతోనే సాధ్యమని.. ఉద్యమకారులు, కవులు, కళాకారులు తమ పార్టీలోకి రావాలంటూ ఆయన ఆహ్వానించారు.

Updated : 24 Sep 2022 15:09 IST

నిజమైన ప్రజాపాలన కోసం భాజపాకు మద్దతివ్వాలి: కిషన్‌రెడ్డి
మరో రెండు, మూడు ఉపఎన్నికలకు సీఎం కుట్ర: బండి సంజయ్‌
2023లో తెరాస పాలనకు పాతర: ఈటల

భాజపా రాష్ట్ర కార్యాలయ ఆవరణలో నిర్వహించిన స్వాగత సభలో ఈటల రాజేందర్‌ను సత్కరిస్తున్న బండి సంజయ్‌. పక్కన ఇంద్రసేనారెడ్డి, వివేక్‌, కిషన్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి 

ఈనాడు, హైదరాబాద్‌, గన్‌ఫౌండ్రి, నారాయణగూడ, న్యూస్‌టుడే: తెలంగాణలో నియంతృత్వ పాలనకు చరమగీతం పాడాల్సిన తరుణం ఆసన్నమైందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. నిజమైన ప్రజాపాలన భాజపాతోనే సాధ్యమని.. ఉద్యమకారులు, కవులు, కళాకారులు తమ పార్టీలోకి రావాలంటూ ఆయన ఆహ్వానించారు. హుజూరాబాద్‌ ఉపఎన్నికలో విజయం సాధించాక ఈటల రాజేందర్‌ తొలిసారి పార్టీ రాష్ట్ర కార్యాలయానికి శనివారం సాయంత్రం వచ్చారు. విజయోత్సవర్యాలీతో వచ్చిన ఆయనకు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. అనంతరం పార్టీ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన స్వాగతసభలో భాజపా ముఖ్యనేతలు రాజేందర్‌ను సన్మానించారు. కిషన్‌రెడ్డి మాట్లాడుతూ..  హుజూరాబాద్‌లో ప్రజాస్వామ్యాన్ని హత్య చేసేందుకు తెరాస ప్రభుత్వం ప్రయత్నించిందని, ఈటలను గెలిపించుకుని ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అన్నారు.

ప్రభుత్వం మెడలు వంచి వరి కొనుగోలు చేయిస్తాం

హుజూరాబాద్‌లో ఓటమితో భాజపాని చూసి భయపడుతున్న సీఎం కేసీఆర్‌ మరో రెండు, మూడు ఉప ఎన్నికల కుట్రకు తెరలేపుతున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. ‘రాష్ట్రమంతా దళితబంధు అమలు కోసం 9న హైదరాబాద్‌లో డప్పులమోత కార్యక్రమం నిర్వహిస్తాం. నిరుద్యోగభృతి, ఉద్యోగాల భర్తీ కోసం లక్షల మంది నిరుద్యోగులతో మిలియన్‌మార్చ్‌ నిర్వహించి 16న ట్యాంక్‌బండ్‌ను దిగ్బంధిస్తాం. దమ్ముంటే సీఎం అడ్డుకోవాలి’ అని సవాలు విసిరారు. ధాన్యం యాసంగిలో పండించొద్దని ఓ మంత్రి ప్రకటించారు. రైతాంగం వరి పండించి తీరుతుంది. ప్రభుత్వం మెడలు వంచి పంటంతటినీ భాజపా కొనుగోలు చేయిస్తుంది’ అని సంజయ్‌ పేర్కొన్నారు.

ఆట మొదలైంది

తెలంగాణలో కేసీఆర్‌ రాజ్యాంగం అమలవుతోందని ఈటల విమర్శించారు. ఒక్క ఉప ఎన్నిక కోసం తెరాస రూ.500 కోట్లు ఖర్చు చేసిందని ఆరోపించారు. ‘కేసీఆర్‌.. ఇక ఆట మొదలైంది. శపించడానికి నేను రుషిని కాను. కానీ 2023 ఎన్నికల్లో ప్రజలు తెరాసను దించేస్తారు. రాష్ట్రంలో గెలిచేది కాషాయజెండానే’ అంటూ ఈటల వ్యాఖ్యానించారు. మాజీ ఎంపీలు వివేక్‌ వెంకటస్వామి, జితేందర్‌రెడ్డి, గరికపాటి మోహన్‌రావు, విజయశాంతి తదితరులు ప్రసంగించారు. అంతకుముందు ఈటల రాజేందర్‌ భారీగా వాహనాల ర్యాలీతో గన్‌పార్కుకు చేరుకుని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. అలాగే అసెంబ్లీ ఎదుట ఉన్న సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

పెట్రో ధరలపై రేపు నిరసనలు: సంజయ్‌

రాష్ట్ర ప్రభుత్వం పెట్రో ధరలపై వ్యాట్‌ తగ్గించాలంటూ సోమవారం (8న) రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్‌ కార్యాలయాలు, మండల తహసీల్దార్‌ కార్యాలయాల వద్ద నిరసన ప్రదర్శనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు సంజయ్‌ పిలుపునిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని