అపోహలు వీడండి.. వ్యాక్సిన్‌కు కదలండి

కరోనా వ్యాక్సినేషన్‌పై ఉన్న భయాందోళనలు, సంకోచాలను విడిచిపెట్టాలని ప్రధాని మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. తాను రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్నానని, వందేళ్ల తన తల్లి కూడా 2 డోసులు అందుకున్నారని చెప్పారు.

Published : 28 Jun 2021 04:06 IST

వందేళ్ల మా అమ్మ రెండు డోసుల టీకా వేసుకున్నారు

‘మన్‌ కీ బాత్‌’లో ప్రధాని మోదీ

ఈనాడు, దిల్లీ: కరోనా వ్యాక్సినేషన్‌పై ఉన్న భయాందోళనలు, సంకోచాలను విడిచిపెట్టాలని ప్రధాని మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. తాను రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్నానని, వందేళ్ల తన తల్లి కూడా 2 డోసులు అందుకున్నారని చెప్పారు. వ్యాక్సిన్‌ తీసుకోకపోతేనే ప్రమాదం పొంచి ఉంటుందన్న విషయాన్ని ప్రజలు గమనించాలని పిలుపునిచ్చారు. ఆయన ఆదివారం ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమం ద్వారా జాతినుద్దేశించి మాట్లాడారు. ‘‘దేశ ప్రజలు కరోనాకు వ్యతిరేకంగా నిరంతర పోరాటం సాగిస్తున్నారు. ఈ నెల 21న ఒక్క రోజుల్లో 86 లక్షల మందికి ఉచితంగా వ్యాక్సిన్లు అందించి రికార్డు సృష్టించాం. వ్యాక్సిన్‌ ఎప్పుడొస్తుందన్న ప్రశ్న ఏడాది క్రితం ప్రతి ఒక్కరి మదిలో ఉదయించేది. ఇప్పుడు మనం భారత్‌లో తయారైన వ్యాక్సిన్‌ను లక్షల మందికి ఉచితంగా అందించగలుగుతున్నాం. నవభారత బలం ఇదే. వ్యాక్సిన్‌ ద్వారా ప్రతి పౌరుడికి భద్రత కల్పించడానికి మేం ప్రయత్నిస్తున్నాం. ప్రతి పల్లెలో అందరూ టీకా తీసుకోవాలి.

జల సంరక్షణా దేశ సేవే..

ఇప్పుడు దేశవ్యాప్తంగా వర్షాలు ప్రారంభమయ్యాయి. కురిసే వానచుక్కలు మనకే కాదు... భవిష్యత్తు తరాలక్కూడా దక్కుతాయి. జల సంరక్షణ చేయడం దేశానికి సేవ చేయడం కిందే లెక్క. వర్షాకాలంలో పెద్దపెద్ద గుంతలు తవ్వి అందులో వాన నీటిని సంరక్షించాలి. ఈ విషయంలో ఉత్తరాఖండ్‌కు చెందిన సచ్చిదానంద భారతి చేసిన సేవలను అందరూ అనుసరించాలి. ఆయన ఇలాంటి వాననీటి సంరక్షణ గుంతలు 30వేల దాకా తవ్వించారు. దానివల్ల ఆ చుట్టుపక్కల ప్రాంతాలు పచ్చదనంతో నిండిపోవడమే కాకుండా గ్రామీణుల తాగునీటి సమస్య తీరింది. 

ఔషధ మొక్కలను నిర్లక్ష్యం చేయొద్దు

మన చుట్టూ ఉన్న వృక్ష సంపదను గమనించి అందులోని ఔషధ మొక్కలను కాపాడుకోవాలి. మధ్యప్రదేశ్‌కి చెందిన రామ్‌లోతన్‌ తన పొలంలో స్వదేశీ మొక్కలతో మ్యూజియం ఏర్పాటుచేశారు. అందులో ఔషధ గుణాలున్న వందలాది మొక్కలు సేకరించి ఉంచారు. ఆ ప్రయోగాన్ని ఔత్సాహికులు దేశంలోని ఇతర ప్రాంతాల్లో ప్రతిబింబింపజేయొచ్చు. ఇది కొత్త ఆదాయ మార్గంగానూ మారుతుంది’’ అని మోదీ చెప్పారు.

మధ్యప్రదేశ్‌ గ్రామీణుల్లో ‘టీకా’ స్ఫూర్తి నింపిన ప్రధాని

భోపాల్‌/బైతూల్‌: వదంతులు నమ్మకుండా వ్యాక్సిన్‌ తీసుకోండి అని ప్రధాని మోదీ చెప్పిన మాటలు మధ్యప్రదేశ్‌ గ్రామీణుల్లో స్ఫూర్తి నింపాయి. ప్రధానితో మాట్లాడిన వ్యక్తుల కుటుంబాలతోపాటు వారి స్ఫూర్తితో మరికొంతమంది టీకాలు తీసుకున్నారు. మధ్యప్రదేశ్‌లోని బైతూల్‌ జిల్లా దులరియా గ్రామస్థులతో మోదీ గత శుక్రవారం జరిపిన ఈ మాటామంతి వివరాలు ‘మన్‌ కీ బాత్‌’ ద్వారా వెల్లడయ్యాయి. మోదీతో మాట్లాడిన రాజేష్‌ హిరావే (43) తన అభిప్రాయం వెల్లడిస్తూ ‘ప్రధానితో మాట్లాడిన మరుసటిరోజే మా కుటుంబం మొత్తం కరోనా వ్యాక్సిన్‌ తీసుకుంది. నేను మరో 127 మంది గ్రామస్థులను ప్రోత్సహించి టీకా కేంద్రానికి పంపా’ అని తెలిపారు. ఇదే గ్రామంలోని కిశోరిలాల్‌ ధుర్వే (60)తో ప్రధాని మాట్లాడి ప్రోత్సహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని