Bandi Sanjay: నేటి నుంచి ప్రజా సంగ్రామ యాత్ర

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర నేటి సాయంత్రం ప్రారంభం కానుంది. జోగులాంబ గద్వాల, నారాయణపేట, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, రంగారెడ్డి జిల్లాల్లోని 

Published : 14 Apr 2022 05:19 IST

అలంపూర్‌ నుంచి బండి సంజయ్‌ రెండో విడత పాదయాత్ర

10 నియోజకవర్గాల పరిధిలో.. 387 కి.మీ. సాగనున్న కార్యక్రమం

మహబూబ్‌నగర్‌, ఈనాడు డిజిటల్‌: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర నేటి సాయంత్రం ప్రారంభం కానుంది. జోగులాంబ గద్వాల, నారాయణపేట, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, రంగారెడ్డి జిల్లాల్లోని 10 నియోజకవర్గాల పరిధిలో 105 గ్రామాల్లో కొనసాగనున్న యాత్రను ఆపార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌ఛుగ్‌ అలంపూర్‌లో ప్రారంభిస్తారు. ‘ఇందులో భాగంగా సంజయ్‌ ఉదయం 9 గంటలకు హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌ వద్దనున్న బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేస్తారు. అక్కణ్నుంచి బయల్దేరి మధ్యాహ్నం 3.30 గంటలకు అలంపూర్‌ చేరుకుంటారు. జోగులాంబ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం అయిదు గంటలకు అక్కడ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. మొదటిరోజు సంజయ్‌ నాలుగు కిలోమీటర్లు నడిచి రాత్రి ఇమామ్‌పూర్‌లో బస చేస్తారు. రెండోరోజు నుంచి 13కి.మీ చొప్పున యాత్రచేస్తారని’ పార్టీవర్గాలు తెలిపాయి.

31 రోజులపాటు: రెండో విడత పాదయాత్ర 31 రోజులపాటు కొనసాగనుంది. ఉదయం, సాయంత్రం వేళల్లో యాత్ర కొనసాగించి, మధ్యాహ్న సమయంలో పార్టీ రాష్ట్రస్థాయి నేతలతో సమావేశాలు నిర్వహించేలా ప్రణాళిక రచించారు. మొత్తం 387 కి.మీ దూరం సాగే కార్యక్రమం.. మే 14న రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ముగుస్తుంది.

ప్రజాస్వామ్య తెలంగాణ లక్ష్యమంటూ..: రాష్ట్రంలో అవినీతి, కుటుంబపాలన సాగుతోందని..యువత, ఉద్యోగులు, రైతులు సహా ఏ వర్గమూ సంతోషంగా లేరంటూ.. వారి ఇబ్బందులను స్వయంగా తెలుసుకునే లక్ష్యంతో ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టినట్టు సంజయ్‌ తొలి విడత ప్రారంభం సందర్భంగా పేర్కొన్నారు. రాష్ట్రంలో కమలదళాన్ని అధికారంలోకి తీసుకురావడం, ప్రజాస్వామ్య తెలంగాణ ఏర్పాటు తమ అంతిమ లక్ష్యమని పేర్కొన్నారు. సంగ్రామ యాత్రకు ఇన్‌ఛార్జిగా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్‌రెడ్డి, సహ ఇన్‌ఛార్జీలుగా తూళ్ల వీరేందర్‌గౌడ్‌, లంకల దీపక్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని