Published : 06 Jul 2022 05:58 IST

అఆల నుంచి ఆకృతుల వరకు

అక్షర, సంగీత, క్రీడావనం సహా 75 థీమ్‌ పార్కులు

వంద ఎకరాలు.. రెండు వేల రకాలు.. లక్ష మొక్కలు

జీవ వైవిధ్యం, పిల్లల విజ్ఞానమే లక్ష్యంగా ఎఫ్‌డీసీ ప్రయోగం

ఈనాడు, హైదరాబాద్‌: జీవ వైవిధ్యానికి దోహదం చేయడంతో పాటు పిల్లల్లో ఆసక్తి కలిగించి, విజ్ఞానం పెంపొందించేలా సరికొత్త వనాల్ని అందించేందుకు అటవీ అభివృద్ధి సంస్థ(ఎఫ్‌డీసీ) ఓ కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టనుంది. వంద ఎకరాల విస్తీర్ణం.. రెండు వేల రకాలు.. వివిధ జాతులకు చెందిన లక్ష మొక్కలను ఈ వర్షాకాలంలో నాటేలా కార్యాచరణ సిద్ధం చేసుకుంది. ఇందులోభాగంగా చిన్నచిన్న 75 థీమ్‌ పార్కులు అందుబాటులోకి రానున్నాయి. వీటిలో దాదాపు లక్ష మొక్కలు నాటాలన్నది లక్ష్యం. ఒక థీమ్‌ పార్కులోకి వెళితే తెలుగు అక్షరాలు నేర్చుకోవచ్చు. మరోదాంట్లో ఎ నుంచి జడ్‌ వరకు ఆంగ్ల అక్షరాలు చదవచ్చు. ఇంకో చోట నిర్మల్‌, కొండపల్లి బొమ్మల తయారీకి వాడే చెట్ల గురించి తెలుసుకోవచ్చు. మరోచోట సంగీత పరికరాలకు వాడే కలప మొక్కల గురించి వివరాలు పొందవచ్చు. సంస్కృతీసంప్రదాయాలు, ఔషధాల గురించి.. ఇలా ఒక్కోటి ఒక్కో ప్రత్యేకతతో అలరించేలా మొక్కల్ని నాటి పెంచేందుకు ఎఫ్‌డీసీ ప్రణాళిక సిద్ధం చేసుకుంది.

ఒక్కోటి 300-1000 గజాల్లో...

ఏడో విడత హరితహారంలో భాగంగా అటవీ అభివృద్ధి సంస్థ తనకున్న భూముల్లో మొక్కలు నాటుతోంది. ఇప్పటివరకు యూకలిప్టస్‌, సుబాబుల్‌ వంటి రకాలకే ప్రాధాన్యమిచ్చింది. పర్యావరణానికి ఇవి చేటు చేస్తుండటం.. ఈ చెట్లు ఎక్కువ నీటిని గ్రహించడం, నీడలేక పక్షుల ఆవాసం పోవడం వంటి పర్యావరణపరమైన ప్రతికూలతలున్నాయి. దీంతో హైదరాబాద్‌ సహా పలు జిల్లాల్లో తొలిదశలో ఈ చెట్లను నరికేసి వాటి స్థానంలో ఇతర మొక్కలు నాటాలని ఎఫ్‌డీసీ నిర్ణయించింది.


థీమ్‌ పార్కుల్లో ఇలా...

తమలపాకు వనం: ఆకులు, అందులో వేసే కాసులు, వక్కలు ఏచెట్ల నుంచి వస్తాయో అవన్నీ ఒకచోట ఉంటాయి.

బతుకమ్మ వనం: ఇందులో బతుకమ్మ తయారీకి వాడే పూలరకాల మొక్కలన్నీ ఉంటాయి.

అక్షర వనం: తెలుగు అక్షరాల పేరిట ఒక్కో మొక్క. అ..అరటి, ఈ..ఈత ఇలా.. 56 మొక్కలను ఏర్పాటు చేస్తారు.


ప్రపంచంలో వినూత్నంగా ఉండేలా...

థీమ్‌ పార్కులు వాటికి పెట్టే పేర్లకు తగ్గట్లు ఉండేలా రాబోతున్నాయి. ప్రపంచంలోనే వినూత్నంగా ఉండేలా బొటానికల్‌ గార్డెన్‌ను అభివృద్ధి చేస్తాం. ప్రయోగాత్మకంగా సీతాకోకచిలుక ఆకారంలో బటర్‌ఫ్లై గార్డెన్‌ ఏర్పాటుచేశాం. చిన్నచిన్న పూల మొక్కలపై సీతాకోకచిలుకలు వచ్చి వాలేలా దీన్ని రూపొందించాం. మిగిలిన పార్కులను వర్షాకాలం పూర్తయ్యేలోపు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. పెన్సిల్‌, రబ్బర్‌ వంటివి ఏచెట్ల నుంచి వస్తాయి వంటి విషయాల్ని పిల్లలు తెలుసుకుని విజ్ఞానం పొందేలా రూపొందిస్తున్నాం. ఈ తరహా ఏర్పాట్ల వల్ల పిల్లల మనసుల్లో మొక్కలపై ప్రేమ పెరుగుతుంది. వాటితో బంధం బలపడుతుంది.

-చంద్రశేఖర్‌రెడ్డి, ఎండీ, అటవీ అభివృద్ధి సంస్థ

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని