మహిళాభ్యున్నతిలో రాష్ట్రమే మేటి

మహిళాభ్యుదయంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని, ఏ రాష్ట్రంలో లేనివిధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీ రామారావు తెలిపారు.రాష్ట్రంలోని ప్రతి

Published : 12 Aug 2022 03:59 IST

ఎక్కడా లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు: మంత్రి కేటీఆర్‌

రాఖీపౌర్ణమి సందర్భంగా మహిళా లబ్ధిదారులతో దృశ్యమాధ్యమ సమావేశం

ఈనాడు, హైదరాబాద్‌: మహిళాభ్యుదయంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని, ఏ రాష్ట్రంలో లేనివిధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీ రామారావు తెలిపారు.రాష్ట్రంలోని ప్రతి మహిళకు ఉజ్వల భవిష్యత్తును కల్పించేలా.. పెద్దన్నగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ భరోసా కల్పిస్తున్నారని అన్నారు.  రక్షాబంధన్‌ సందర్భంగా వివిధ పథకాల మహిళా లబ్ధిదారులతో ఆయన గురువారం ప్రగతిభవన్‌ నుంచి దృశ్యమాధ్యమంలో మాట్లాడారు. వారికి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం కేసీఆర్‌ చిత్రపటానికి ఆడబిడ్డలంతా రాఖీకట్టాలని కోరారు. ‘‘మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్నదే సీఎం కేసీఆర్‌ సంకల్పం. ఆయన హయాంలో మహిళల పెన్షన్‌ పదిరెట్లు పెరిగింది. ఒంటరి మహిళలు, బీడీ కార్మికురాళ్లకు సైతం పింఛను ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణయే. స్థానిక సంస్థలు, నామినేటెడ్‌ పదవుల్లో మహిళలకు రిజర్వేషన్లు ఇస్తున్నాం. కేంద్రం అంగన్‌వాడీ కార్యకర్తల జీతాల్లో కోటా తగ్గించినా అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తల జీతాలను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. చట్ట సభల్లో కూడా మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రాన్ని కోరినా స్పందన లేదు.  రాష్ట్రంలో ఉన్న సుమారు 4 లక్షల స్వయం సహాయక బృందాలకు నిరంతరం మద్దతునందిస్తున్నాం. రెండు పడకగదుల ఇళ్లను స్త్రీలకే కేటాయిస్తున్నాం. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు వీహబ్‌ను ఏర్పాటు చేశాం. ప్రభుత్వ దవాఖానాలను బలోపేతం చేశాం. ఇప్పటివరకు 13.30 లక్షల మందికి కేసీఆర్‌ కిట్లు అందజేశాం. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లు తల్లిదండ్రులకు భారం కావద్దని కల్యాణలక్ష్మి తీసుకొచ్చాం. అమ్మఒడి లాంటి పథకం దేశంలో ఎక్కడా లేదు.కంటి వెలుగు ద్వారా బాధితులకు వైద్యం అందించాం. ఏజెన్సీ ఏరియాల్లోని ప్రజల ఆరోగ్య పరిస్థితి కోసం ప్రత్యేక వైద్య పరీక్షలు చేయించాం. దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు వైద్య పరీక్షలు చేయించాం. 33 జిల్లాల్లో 33 వైద్య కళాశాలల ద్వారా పేదలకు వైద్యం అందుబాటులోకి తీసుకొస్తున్నాం. మహిళల సుఖసంతోషాల కోసం తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోంది’’ అని మంత్రి కేటీఆర్‌ ఈ సమావేశంలో తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని