రెండేళ్లలోపు చిన్నారుల దత్తతకు నూతన నిబంధనలు

చిన్నారులను దత్తత తీసుకోవాలనుకున్న దంపతుల ఉమ్మడి వయసులో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది. ఇప్పటివరకు 0-4 ఏళ్లలోపు వయసున్న పిల్లలను దత్తత తీసుకోవాలంటే దంపతుల ఉమ్మడి వయసు గరిష్ఠంగా 90 ఏళ్లలోపు ఉండేది. సింగిల్‌ పేరెంట్‌ అయితే 45 ఏళ్లుగా ఉండేది.

Published : 01 Oct 2022 05:53 IST

ఈనాడు, హైదరాబాద్‌: చిన్నారులను దత్తత తీసుకోవాలనుకున్న దంపతుల ఉమ్మడి వయసులో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది. ఇప్పటివరకు 0-4 ఏళ్లలోపు వయసున్న పిల్లలను దత్తత తీసుకోవాలంటే దంపతుల ఉమ్మడి వయసు గరిష్ఠంగా 90 ఏళ్లలోపు ఉండేది. సింగిల్‌ పేరెంట్‌ అయితే 45 ఏళ్లుగా ఉండేది. ఇప్పుడు చిన్నారుల వయసును రెండు కేటగిరీలుగా వర్గీకరించింది. 0-2 ఏళ్లలోపు పిల్లలను దత్తత తీసుకోవాలంటే ఉమ్మడి వయసు 85 ఏళ్లుగా ఉండాలని, సింగిల్‌ పేరెంట్‌ వయసు 40 ఏళ్లుగా ఉండాలని పేర్కొంది. 2-4 ఏళ్లలోపు పిల్లల దత్తతకు గతంలో నిబంధనలు అమలవుతాయని వెల్లడించింది. ఇప్పటివరకు అమల్లో ఉన్న నిబంధనల్లో కొన్ని మార్పులు చేస్తూ ‘‘చిన్నారుల దత్తత నిబంధనలు- 2022’’ జారీ చేసింది.

నిబంధనలివీ

దత్తతకు ఆసక్తి చూపిన దంపతులు రిజిస్ట్రేషన్‌ చేసుకున్న తరువాత మూడేళ్లలోపు సీనియారిటీ రిఫరల్‌ రాకుంటే.. ఆ దంపతుల ఉమ్మడి వయసు గరిష్ఠంగా 110 ఏళ్లు దాటితే రిజిస్ట్రేషన్‌ నాటి వయసును పరిగణనలోకి తీసుకుంటారు.

దత్తతకిచ్చే పిల్లల వయసు ఆధారంగా 0-2 ఏళ్లలోపు, 2-4 ఏళ్లు, 4-8 ఏళ్లు, 8-18 ఏళ్లలోపు నాలుగు కేటగిరీలుగా ఖరారయ్యాయి. సింగిల్‌ మహిళా పేరెంట్‌కు ఆడపిల్లను దత్తతకు ఇచ్చేలా నిబంధనలు చేర్చాయి. అయితే మగ పేరెంట్‌కు మాత్రం ఆడపిల్లను ఇవ్వరు.

చిన్నారి, దత్తత తీసుకునే దంపతుల మధ్య 25 ఏళ్ల కన్నా వయసు వ్యత్యాసం తక్కువగా ఉండకూడదు. రక్త సంబంధీకుల దత్తతలో దంపతుల గరిష్ఠ వయసును పరిగణనలోకి తీసుకోరు. దత్తత తీసుకున్న తరువాత ప్రతి మూడేళ్లకోసారి హోంస్టడీ నివేదికల్ని మహిళా శిశు సంక్షేమశాఖ తీసుకుంటుంది.

దత్తత కోరుకున్న దంపతులకు మూడుసార్లు చిన్నారులను ఎంపిక చేసుకునే అవకాశమిస్తారు. ఆ సమయంలో ఎంపిక చేసుకోకుంటే వారిని ఏడాది పాటు డిబార్‌ చేస్తారు. అనంతరం ఆ రిజిస్ట్రేషన్‌ను కొత్త రిజిస్ట్రేషన్‌గా పరిగణిస్తారు. విదేశీ దంపతులకు రెండుసార్లు మాత్రమే పిల్లల్ని ఎంపిక చేసుకునే అవకాశమిచ్చి, ఏడాది పాటు డిబార్‌ చేస్తారు.

దంపతుల మధ్య విభేదాలుంటే వారికి చిన్నారుల్ని దత్తతకు ఇవ్వకుండా తిరస్కరించడంతో పాటు డిబార్‌ చేస్తారు. దత్తత తీసుకున్న చిన్నారిని న్యాయపరమైన నిబంధనలు పూర్తిచేసిన తరువాత పదిరోజుల పాటు ప్రీఅడాప్షన్‌కు అనుమతిస్తారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని