‘పులినైనా పట్టేస్తారు..’ బెడద వదిలిస్తారు!

వన్యమృగాలు జనావాసాలు, పొలాల్లోకి వస్తుండటంతో దేశవ్యాప్తంగా పలుచోట్ల ప్రజలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాటి బెడదను వదిలించుకోవడానికి నైపుణ్యం కలిగిన లైసెన్స్‌డ్‌ షూటర్ల (వేటగాళ్ల)కు డిమాండ్‌ పెరుగుతోంది.

Published : 04 Oct 2022 04:25 IST

వన్యమృగాల సమస్య పరిష్కారంలో నిపుణులు

తెలంగాణ షూటర్లకు పెరుగుతున్న డిమాండ్‌

ఈనాడు, హైదరాబాద్‌: వన్యమృగాలు జనావాసాలు, పొలాల్లోకి వస్తుండటంతో దేశవ్యాప్తంగా పలుచోట్ల ప్రజలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాటి బెడదను వదిలించుకోవడానికి నైపుణ్యం కలిగిన లైసెన్స్‌డ్‌ షూటర్ల (వేటగాళ్ల)కు డిమాండ్‌ పెరుగుతోంది. తెలంగాణలో ఈ నిపుణులు ఉండటంతో ఇతర రాష్ట్రాల నుంచి వారికి ఆహ్వానాలు అందుతున్నాయి.

వివిధ రాష్ట్రాల్లో అడవి పందులు, పులులు, చిరుతలు, ఏనుగులు వంటివాటి నుంచి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని జంతువులు పంటలను ధ్వంసం చేయడం, రన్‌వేలపై విమానాలకు అడ్డుపడటం వంటి సమస్యలను సృష్టిస్తుండగా.. పులులు మనుషుల్ని, పెంపుడు జంతువులను చంపుతున్న ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. దీంతో నిపుణులైన షూటర్లు ఆయా ప్రాంతాలకు వెళ్లి నిబంధనలకు అనుగుణంగా అడవి పందులను కాల్చి చంపడం, పులులు వంటివాటిని బంధించడం చేస్తుంటారు.


32 మంది ‘షూటర్ల’ ప్యానెల్‌

రాష్ట్రంలో అడవి పందుల సమస్య తీవ్రంగా ఉండటంతో వాటిని కాల్చి చంపేందుకు.. గుర్తింపు పొందిన 32 మంది నిపుణులైన షూటర్లతో నిబంధనల మేరకు అటవీశాఖ గతేడాది ప్రారంభంలో  ఓ ప్యానెల్‌ని ఏర్పాటు చేసింది. వివిధ రాష్ట్రాల్లో నిపుణులైన వేటగాళ్ల కొరత ఉండగా.. తెలంగాణకు చెందిన నవాబ్‌ షఫత్‌ అలీఖాన్‌, అస్గర్‌ అలీఖాన్‌, యూరాలజిస్ట్‌ రామ సంజయ్‌, రాహుల్‌రావు తదితర  షూటర్లకు డిమాండ్‌ ఉంది.

* బిహార్‌లోని పశ్చిమ చంపారన్‌ జిల్లా వాల్మీకి టైగర్‌ రిజర్వ్‌ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్న రాయల్‌ బెంగాల్‌ టైగర్‌ పులి ఆరుగురు మనుషుల్ని చంపేసింది. ఈ నేపథ్యంలో దాన్ని బంధించడానికి అక్కడి అధికారులు కోరిన మీదట హైదరాబాదీ, జాతీయస్థాయిలో పేరొందిన వేటగాడు నవాబ్‌ షఫత్‌ అలీఖాన్‌ గతవారం వెళ్లారు.

* కొద్దిరోజుల క్రితం తెలంగాణ నుంచి షూటర్ల బృందం కేరళలోని తిరువల్లూర్‌ జిల్లా కొదచ్చెరిలో రబ్బర్‌ తోటలకు వెళ్లి ‘ఆపరేషన్‌ వైల్డ్‌బోర్‌’ చేపట్టి వచ్చింది. అక్కడ అడవి పందులు రబ్బర్‌తోటల్ని నాశనం చేస్తుండటంతో.. పేర్వారం సంతాజి, నవాబ్‌ షఫత్‌ అలీఖాన్‌, అస్గర్‌ అలీఖాన్‌ వెళ్లి వాటి బెడదను వదలించి వచ్చారు. అలాగే వైనాడ్‌ జిల్లాలోని అడవి పందుల్ని చంపడానికి రావాలంటూ ఐదు పంచాయతీల నుంచి ఇక్కడి షూటర్లకు ఆహ్వానం అందింది.

* ఉత్తర్‌ప్రదేశ్‌, తమిళనాడు, గోవా, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోనూ పలు ప్రాంతాలకు తెలంగాణకు చెందిన లైసెన్స్‌డ్‌ షూటర్లు ఇప్పటికే వెళ్లిరాగా.. తాజాగా కూడా వారికి పిలుపులు అందుతున్నాయి.

* మన రాష్ట్రంలోనూ దుండిగల్‌ ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీ ప్రాంతంలో పలు విమానాలు ఎగిరేటప్పుడు, దిగే సమయంలో రన్‌వేపైకి అడవి పందులు వస్తున్నాయి. ఇక్రిశాట్‌, ఐఐటీ (కంది) పరిధిలోకి కూడా ఇవి వస్తున్నాయి. డాక్టర్‌ రామ సంజయ్‌, రాహుల్‌రావు పలు దఫాలుగా వెళ్లి వాటిని అటవీ అధికారుల సమక్షంలో కాల్చి చంపారు. ప్రధాని పర్యటనకు ముందు ఇక్రిశాట్‌లో ఆపరేషన్‌ వైల్డ్‌బోర్‌ చేపట్టారు.


షూటర్ల సమస్యలెన్నో..

సేవల్ని ఉచితంగా అందిస్తున్న షూటర్లు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రయాణం, వసతి, భోజనం వంటి సదుపాయాలను సేవలు వినియోగించుకునేవారు కల్పించడం లేదని, కొన్నిసార్లు తమ వాహనంలోనే నిద్రపోవాల్సి వస్తోందని రామ సంజయ్‌ తెలిపారు. అటవీ అధికారుల సమక్షంలోనే ఆపరేషన్‌ చేపట్టాలన్న నిబంధన ఇబ్బందిగా మారిందని చెబుతున్నారు. కొదచ్చెరిలో ఆయా ఖర్చులను స్థానిక పంచాయతీ భరించిందని, రాష్ట్రంలోనూ ఇలాంటి విధానం ఉండాలని సంతాజి అభిప్రాయపడ్డారు. ఇందుకు ప్రభుత్వం బడ్జెట్‌ కేటాయించాలన్నారు. చాలాచోట్ల ప్రతికూలతలు ఎదురవుతుంటాయని, కేరళ రబ్బర్‌ తోటలకు వెళ్లినప్పుడు కాళ్లకు అనేక జలగలు పట్టుకున్నాయని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని