Khammam: విషాదంలోనూ.. విజేతగా నిలిచిన ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు కుమార్తె

గొత్తికోయల చేతిలో అటవీ అధికారి హత్యకు గురైన ఉదంతం అందరినీ కదిలించింది. ఆ ఘటనతో ఆయన కటుంబసభ్యులు, తోటి ఉద్యోగులు కన్నీరుమున్నీరయ్యారు. వారు రోదిస్తున్న దృశ్యాలు చూసిన ప్రతిఒక్కరి హృదయాలు బరువెక్కాయి.

Updated : 26 Nov 2022 09:15 IST

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

కొత్తగూడెం సాంస్కృతికం, న్యూస్‌టుడే: గొత్తికోయల చేతిలో అటవీ అధికారి హత్యకు గురైన ఉదంతం అందరినీ కదిలించింది. ఆ ఘటనతో ఆయన కటుంబసభ్యులు, తోటి ఉద్యోగులు కన్నీరుమున్నీరయ్యారు. వారు రోదిస్తున్న దృశ్యాలు చూసిన ప్రతిఒక్కరి హృదయాలు బరువెక్కాయి. ఆ విషాదం ఇంకా రాష్ట్ర ప్రజల మనసుల్లోంచి చెరిగిపోలేదు. ఆయన కుటుంబం ఇంకా తేరుకోలేదు. కానీ తండ్రి అమరుడైన నాలుగో రోజునే ఆయన కుమార్తె క్రీడా పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచింది. రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించింది. తండ్రికి తగిన తనయ అని నిరూపించుకుంది. ఆ చిన్నారి మనోధైర్యం ముందు ఓటమి తల వంచింది. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈర్లపూడికి చెందిన ఎఫ్‌ఆర్వో సీహెచ్‌ శ్రీనివాసరావు ఈ నెల 22న గొత్తికోయల చేతిలో దారుణ హత్యకు గురైన విషయం విదితమే. తండ్రి ప్రోత్సాహంతో అథ్లెటిక్స్‌లో రాణిస్తున్న కుమార్తె కృతిక (10).. ఇలాంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యం చాటుకుంది. కొత్తగూడెంలో శుక్రవారం జరిగిన ఉమ్మడి ఖమ్మం సబ్‌ జూనియర్స్‌ అథ్లెటిక్స్‌కు బంధువుల సాయంతో హాజరైంది. అండర్‌-10 విభాగంలో లాంగ్‌జంప్‌లో స్వర్ణం, 100 మీటర్ల పరుగులో రజతం కైవసం చేసుకుంది. డిసెంబరు 5, 6 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. ఈ సందర్భంగా నిర్వాహకులు, కోచ్‌లు   చిన్నారి మనోస్థైర్యాన్ని ఎంతగానో మెచ్చుకున్నారు. కృతిక ప్రస్తుతం ఆరో తరగతి   చదువుకుంటోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని