మంటలు భయపెడుతున్నా.. సురక్షితంగా ‘తరలింపు’

బహుళ అంతస్తుల భవనాలు.. వాణిజ్య సముదాయాలు.. గేటెడ్‌ కమ్యూనిటీల్లో అనూహ్యంగా అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు ప్రాణాలు కాపాడేందుకు ప్రత్యేకంగా ‘తరలింపు’(ఎవాక్యుయేషన్‌) లిఫ్టులు అందుబాటులోకి వచ్చాయి.

Published : 27 Nov 2022 03:55 IST

బహుళ అంతస్తుల భవనాల్లో ప్రత్యేక లిఫ్టులు
గ్రేటర్‌లో వాటి ఏర్పాటు తప్పనిసరి చేసేలా కసరత్తు 

ఈనాడు, హైదరాబాద్‌: బహుళ అంతస్తుల భవనాలు.. వాణిజ్య సముదాయాలు.. గేటెడ్‌ కమ్యూనిటీల్లో అనూహ్యంగా అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు ప్రాణాలు కాపాడేందుకు ప్రత్యేకంగా ‘తరలింపు’(ఎవాక్యుయేషన్‌) లిఫ్టులు అందుబాటులోకి వచ్చాయి. ముంబయిలో కొత్తగా నిర్మిస్తున్న భారీ భవనాల్లో వీటిని తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని మహారాష్ట్ర సర్కారు ఆదేశించింది. గ్రేటర్‌ పరిధిలోనూ ఎత్తైన భవనాలు నిర్మిస్తున్న నేపథ్యంలో ఇక్కడా ఆ లిఫ్టుల ఏర్పాటు తప్పనిసరి చేయాలని అగ్నిమాపకశాఖ ఉన్నతాధికారులు నిర్ణయానికి వచ్చారు. కొద్దిరోజుల క్రితం అధికారులు ముంబయికి వెళ్లి వాటి పనితీరును పరిశీలించారు. మన అవసరాలకు అనుగుణంగా ఈ లిఫ్టుల వినియోగంపై నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించనున్నారు. వీటి ధర రూ.70 లక్షల నుంచి రూ.మూడు కోట్ల వరకు ఉంటుంది.

ప్రాణనష్టం నివారణకు..

హైదరాబాద్‌లో తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. లిఫ్టులు, మెట్లున్నా... పొగ, మంటల కారణంగా బయటకు రాలేక సజీవ దహనమవుతున్నారు. సికింద్రాబాద్‌లోని రూబీ లాడ్జిలో రెండు నెలల క్రితం జరిగిన అగ్నిప్రమాదంలో లిఫ్టులు పనిచేయక, మెట్లపై మంటలు పెరగడంతో ప్రాణనష్టం జరిగిన సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో తరలింపు లిఫ్టులు బాగా ఉపయోగపడతాయి. ముంబయిలో రెండు నెలల క్రితం ఓ బహుళ అంతస్తుల భవనంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో తరలింపు లిఫ్టుల కారణంగా పది మంది ప్రాణాలు రక్షించామని అక్కడి ఫైర్‌ బ్రిగేడ్‌ అధికారులు తెలిపారు.

పనితీరు ఇలా.. 

* ఈ లిఫ్టుల నిర్మాణం అగ్నిప్రమాదాలను తట్టుకునే విధంగా ఉంటుంది. దట్టమైన పొగ, మంట వ్యాపించినా దాని పరిసర ప్రాంతాల్లో అంతగా ప్రభావం ఉండదు. ఒకవేళ పొగ లోపలికి వచ్చినా బయటకు పంపేందుకు ప్రత్యేక అగ్నిమాపక వ్యవస్థ ఉంటుంది.

* విద్యుత్‌ సరఫరా ఆగిపోయినా... కనీసం 10 నిమిషాలు నడిచేలా పవర్‌ బ్యాకప్‌ ఉంటుంది. కింది అంతస్తుల్లో మంటలున్నా.. పొగ వేగంగా వస్తూ..  వెళ్లలేని పరిస్థితులున్నా.. వెంటనే లిఫ్టు పైభాగాన్ని బద్దలు కొట్టుకుని నిచ్చెన ద్వారా పైకి చేరేందుకు అవకాశముంటుంది.

* అగ్నిప్రమాదంలో చిక్కుకున్నవారు ఎంత మంది? లిఫ్టులో ఎంతమందిని తీసుకువస్తున్నారు? వంటి వివరాలను ఎప్పటికప్పుడు తెలిపేందుకు ఇందులో పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టమ్‌ను అమరుస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని