అవయవదానంలో తెలంగాణ ముందంజ

అవయవదానంలో దేశంలోనే తెలంగాణ ముందంజలో ఉందని, ఇతర రాష్ట్రాలూ ఇక్కడి విధానాలను అనుసరిస్తున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు.

Published : 28 Nov 2022 04:07 IST

మంత్రి హరీశ్‌రావు వెల్లడి

గాంధీ ఆసుపత్రి, న్యూస్‌టుడే: అవయవదానంలో దేశంలోనే తెలంగాణ ముందంజలో ఉందని, ఇతర రాష్ట్రాలూ ఇక్కడి విధానాలను అనుసరిస్తున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆత్మీయులను కోల్పోయిన బాధలో ఉండికూడా అవయవదానానికి ముందుకొచ్చి, పలువురికి పునర్జన్మనిచ్చిన ఆయా కుటుంబీకుల నిర్ణయం ఎందరికో స్ఫూర్తిదాయకమన్నారు. వారందరికీ చేతులెత్తి మొక్కుతున్నానని అన్నారు. ‘నేషనల్‌ ఆర్గాన్‌ డొనేషన్‌ డే’ సందర్భంగా.. అవయవదానాలు చేసినవారి కుటుంబ సభ్యులను గాంధీ వైద్యకళాశాలలో ఆదివారం సత్కరించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న హరీశ్‌రావు మాట్లాడుతూ.. అవయవదానం ద్వారా నిజమైన హీరోలుగా మారిన 162 కుటుంబాలవారిని సన్మానించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ‘‘బ్రెయిన్‌డెడ్‌ అయిన వ్యక్తి నుంచి గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, చర్మం, కార్నియా, ఎముక కణజాలం, గుండె కవాటాలు, రక్తనాళాలను సేకరించి అవసరమైన రోగులకు వినియోగించవచ్చు. ఒక వ్యక్తి నుంచి సేకరించిన అవయవాలను 8 మందికి వినియోగించే అవకాశం ఉంది’’ అని మంత్రి తెలిపారు. అవయవదాన ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా తొలిసారిగా తెలంగాణ ఆన్‌లైన్‌ పోర్టల్‌ను ప్రారంభించినట్లు ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సహా ఏపీ, కేరళ, గుజరాత్‌, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాలూ మన విధానాలనే అనుసరిస్తున్నాయన్నారు. మొత్తం 36 ప్రభుత్వాసుపత్రులు జీవన్‌దాన్‌లో నమోదైనట్లు వివరించారు. 2013లో జీవన్‌దాన్‌ ప్రారంభం కాగా ఇంతవరకు 1,142 మంది బ్రెయిన్‌డెడ్‌ అయిన వారి నుంచి 4,316 అవయవాలను సేకరించి అవసరం ఉన్నవారికి అమర్చినట్లు చెప్పారు. అవయవదాన రేటు దేశంలో ప్రతి పది లక్షలమందికి 0.6శాతం ఉంటే, తెలంగాణలో అది 5.08 శాతంగా ఉన్నట్లు తెలిపారు. జీవన్‌దాన్‌లో నమోదై అవయవాల కోసం ఎదురుచూస్తున్న వారి సంఖ్య ప్రస్తుతం 3వేలుగా ఉన్నట్లు చెప్పారు. అవయవదానాన్ని ప్రోత్సహించేందుకు చేపడుతున్న చర్యలను మంత్రి వివరించారు. గాంధీ ఆసుపత్రిలో రూ.35 కోట్లతో ఆర్గాన్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. డీఎంఈ రమేశ్‌రెడ్డి, వైద్యవిధాన పరిషత్‌ కమిషనర్‌ అజయ్‌కుమార్‌ వైద్యులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని