మహిళా రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకోవాలి

‘మహిళా రిజర్వేషన్ల బిల్లును లోక్‌సభ ఆమోదించాలి. రాజ్యసభ ఆ బిల్లును ఆమోదించిన తర్వాత ఇది మూడో లోక్‌సభ.

Updated : 30 Nov 2022 06:22 IST

రాజకీయం సహా వివిధ అంశాలపై ప్రజల్లో అవగాహనకు కృషి చేస్తా
మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు

ఈనాడు, దిల్లీ: ‘మహిళా రిజర్వేషన్ల బిల్లును లోక్‌సభ ఆమోదించాలి. రాజ్యసభ ఆ బిల్లును ఆమోదించిన తర్వాత ఇది మూడో లోక్‌సభ. ఇక ఎంతమాత్రం నాన్చడం తగదు. ఎంతో కొంత రిజర్వేషన్లతో బిల్లును ఆమోదిస్తే తర్వాత పెంచుకుంటూ పోవచ్చు’ అని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. దిల్లీ త్యాగరాజ్‌ మార్గ్‌లోని ఆయన నివాసానికి మంగళవారం తెలుగు పాత్రికేయులను ఆహ్వానించారు. ఇష్టాగోష్ఠి నిర్వహించారు. ‘రాజ్యాంగబద్ధమైన పదవి నిర్వహించినందున రాజకీయాల్లో జోక్యం చేసుకోను. కానీ, వివిధ రాజకీయ, సామాజిక, ఆర్థిక, పర్యావరణ అంశాలపై నాకున్న అనుభవం ఆధారంగా అభిప్రాయాలు తెలియజేస్తా. మున్ముందు దిల్లీ, హైదరాబాద్‌, చెన్నై వేదికగా ఇంటర్వ్యూలు, ఇష్టాగోష్ఠులు, సమావేశాలు చేపడతా. దేశవ్యాప్తంగా పర్యటించి ప్రజలతో మమేకమవుతా. దిల్లీలో మార్చి 21న ఉగాది సమ్మేళనం నిర్వహిస్తా. ప్రతి ఒక్కరూ తమ భాషలోనే మాట్లాడుకునే అవకాశం కల్పించాలి. చట్టసభలు, న్యాయస్థానాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో మాతృభాష వాడకాన్ని విస్తృతం చేయాలి. నేను రాజ్యసభ ఛైర్మన్‌గా ఉన్నప్పుడు ఎంపీలు మాతృభాషలో మాట్లాడేందుకు అవకాశం కల్పించా. దేశ రాజకీయాలు తిరోగమన దిశగా పయనిస్తున్నాయి. గతంలో జీవితాంతం ఒకే సిద్ధాంతానికి కట్టుబడి ఉండేవారు. నేడు పలు సిద్ధాంతపరమైన పార్టీలు బలహీనపడ్డాయి. పార్టీ ఫిరాయింపులు దారుణంగా ఉన్నాయి. ఎవరు ఏ పార్టీలో ఉన్నారో తెలుసుకునేందుకు రాసుకోవాల్సి వస్తోంది. 2009లో అడ్వాణీ నాయకత్వంలో ఎన్నికలకు వెళ్లి భాజపా ఓడిపోయింది. ఆయనపై గౌరవం ఉన్నప్పటికీ సిద్ధాంతాల దృష్ట్యా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లగలిగే నేతగా విశ్వసించి మోదీకి మద్దతు పలికా. చట్టాలు చేయడం ఎమ్మెల్యేలు, ఎంపీల పని. కానీ నల్లా కనెక్షన్‌ ఇచ్చే అధికారమూ వారి చేతుల్లోనే ఉంది. ఈ తీరు మారాలి’ అని వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు.


విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఆయన సతీమణి మంగళవారం వెంకయ్య నాయుడిని కలిశారు. తమ కుమార్తె శ్వేత వివాహ పత్రికను అందజేసి, వేడుకకు ఆహ్వానించారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని