దేశంలో మొదటి ప్రైవేటు ప్రయోగ వేదిక

దేశంలో మొట్టమొదటగా ఓ ప్రైవేటు సంస్థ ఆధ్వర్యంలో రాకెట్లను నింగిలోకి పంపేందుకు ప్రయోగ వేదికను సిద్ధం చేశారు.

Updated : 06 Dec 2022 11:27 IST

అగ్నికుల్‌ ఆధ్వర్యంలో షార్‌లో ఏర్పాటు

శ్రీహరికోట, న్యూస్‌టుడే: దేశంలో మొట్టమొదటగా ఓ ప్రైవేటు సంస్థ ఆధ్వర్యంలో రాకెట్లను నింగిలోకి పంపేందుకు ప్రయోగ వేదికను సిద్ధం చేశారు. దీనికి అనుబంధంగా మిషన్‌ కంట్రోల్‌ సెంటర్‌(ఎంసీసీ)ను నెలకొల్పారు. త్వరలో రాకెట్‌ ప్రయోగానికి నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. తిరుపతి జిల్లాలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌(షార్‌)లో ఇప్పటికే 3 ప్రయోగ వేదికలు ఉన్నాయి. వీటి నుంచి తరచూ రాకెట్‌ ప్రయోగాలను ఇస్రో చేపడుతోంది. సమీపంలోనే ప్రైవేటు లాంచ్‌ వెహికల్‌ కోసం తొలి ప్రత్యేక వేదికను అందుబాటులోకి తెచ్చారు. దీన్ని చెన్నైకు చెందిన అగ్నికుల్‌ స్టార్టప్‌ ఏర్పాటు చేయగా ఇస్రో, ఇన్‌స్పేస్‌లు ప్రోత్సాహం అందించాయి.

*  ఐఐటీ మద్రాస్‌కు చెందిన శ్రీనాథ్‌ రవిచంద్రన్‌, మొయిన్‌ ఎస్‌పీఎం, ప్రొఫెసర్‌ ఆర్‌.చక్రవర్తిల ఆధ్వర్యంలో 2017లో ‘అగ్నికుల్‌’ పేరుతో స్టార్టప్‌ కంపెనీ ఏర్పాటు చేశారు. సంస్థ సీఈవోగా శ్రీనాథ్‌ రవిచంద్రన్‌ వ్యవహరిస్తున్నారు. 2020 డిసెంబరులో ఇస్రోతో ఒప్పందం చేసుకోవడంతో ప్రయోగ వేదికలను నిర్మించడానికి  నైపుణ్యం, వసతులను వాడుకోవడానికి అగ్నికుల్‌కు అనుమతి మంజూరు చేశారు. ఈ సంస్థ ఉపయోగించే అగ్నిబాన్‌ రాకెట్‌ రెండు దశల ప్రయోగ వాహనం. 700 కి.మీ. ఎత్తులోని నిర్దేశిత కక్ష్యలకు వంద కిలోల పేలోడ్‌ను తీసుకెళ్తుంది. ఇందులోని అగ్నిలెట్‌ అనేది ప్రపంచంలోని మొట్టమొదటి సింగిల్‌-పీస్‌ 3డీ ప్రింటెడ్‌ ఇంజిన్‌. దీనిని దేశీయ పరిజ్ఞానంతో రూపొందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని